Home జాతీయ వార్తలు లోక్‌సభలో పన్ను విధింపు సవరణ బిల్లు

లోక్‌సభలో పన్ను విధింపు సవరణ బిల్లు

Taxation amendment bill to introduced in Lok sabha

 

మంత్రి ఠాకూర్ వ్యాఖ్యలతో నిరసనలతో సభ పలుమార్లు వాయిదా
ఆదాయం పన్నుకు సంబంధించింది మాత్రమే, జిఎస్‌టి చట్టాన్ని ఉల్లంఘించేది కాదు : నిర్మలా
బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, టిఎంసి, సిపిఎం

న్యూఢిల్లీ: శుక్రవారం లోక్‌సభలో ట్యాక్స్ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రతిపక్షాల నిరసనల మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. పన్ను చెల్లింపుదారులకు పలు సడలింపులిస్తూ ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ‘పన్ను విధింపు, ఇతర చట్టాల(నిబంధనల్లో సడలింపులు, సవరణ)బిల్లు2020’ పేరుతో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లులో ఆదాయం పన్ను రిటర్న్ దాఖలు చేయడంలో కాలపరిమితిని పొడిగించడం, ఆధార్‌కు పాన్‌కార్డును లింక్ చేయడం, తదితర అంశాలున్నాయి. ఈ బిల్లు కేవలం కేంద్రానికి చెల్లించాల్సిన పన్నులు, రిటర్న్ దాఖలుకు సంబంధించింది మాత్రమేనని ఆర్థికమంత్రి తెలిపారు. బిల్లును వ్యతిరేకిస్తున్నవారు ఇందులో పేర్కొన్న అంశాలను అర్థం చేసుకోవడంలో విఫలమైనట్టుగా తాను భావిస్తున్నానని ఆమె విమర్శించారు.

జిఎస్‌టి షేర్స్ విషయంలో రాష్ట్రాల అధికారాల్ని తాము తీసుకోవడం లేదని, రాష్ట్రాల వాటాల్ని తప్పకుండా చెల్లిస్తామని ఆమె హామీ ఇచ్చారు. జిఎస్‌టి మండలి, సిజిఎస్‌టి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణల్ని ఆమె తిరస్కరించారు. ప్రధాని మోడీ విజయవంతమైన ముఖ్యమంత్రి అని, ఆయనకు రాష్ట్రాల సమస్యలు, అవసరాలు తెలుసునని నిర్మల అన్నారు. పిఎం కేర్స్ ఫండ్‌పై వివరణ ఇవ్వాల్సిందిగా తన శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్‌ను నిర్మల కోరారు. ఠాకూర్ మాట్లాడుతూ ప్రతిపక్షాలకు అన్ని అంశాల్లోనూ తప్పులే కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. ఇవిఎంలు, ట్రిపుల్ తలాక్, జిఎస్‌టిలను కూడా ప్రతిపక్షాలు తప్పు పట్టాయని, అవి తమ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలని ఆయన సమర్థించుకున్నారు. పిఎం కేర్స్ ఫండ్‌లో తప్పేమున్నది..? మీరు అనేకసార్లు దీనిపై కోర్టుకు వెళ్లారు.

కోర్టులు దీనికి అనుకూలంగా తీర్పులిచ్చాయని ఠాకూర్ అన్నారు. పిఎం కేర్స్ ఫండ్ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన ప్రజా దాతృత్వ ట్రస్ట్ అని ఠాకూర్ అన్నారు. యుపిఎ హయాంలో ఏర్పాటు చేసిన పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్‌ను ఉద్దేశిస్తూ.. అది నెహ్రూగాంధీ కుటుంబానికి లబ్ధి చేకూర్చడానికే ఏర్పరిచారంటూ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభను 30 నిమిషాలపాటు వాయిదా వేశారు. ఆ తర్వాత మరో రెండుసార్లు (5గంటలకు ఓసారి, 530కి మరోసారి) గందరగోళం నడుమ సభను వాయిదా వేయక తప్పలేదు. ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన ట్యాక్స్ బిల్లును కాంగ్రెస్, టిఎంసి, సిపిఐ(ఎం) వ్యతిరేకించాయి. పిఎంకేర్స్ ఫండ్‌ను కాగ్ ఆడిట్ పరిధి నుంచి ఎందుకు మినహాయించారని కాంగ్రెస్ సభ్యుడు శశిథరూర్ ప్రశ్నించారు. పిఎం కేర్స్ ఫండ్‌ను రద్దు చేసి, ఆ నిధుల్ని పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు బదిలీ చేయాలని టిఎంసి ఎంపి సౌగతారాయ్ డిమాండ్ చేశారు.

Taxation amendment bill to introduced in Lok sabha