Home తాజా వార్తలు సమ్మె సైరన్

సమ్మె సైరన్

TBGKS to strike against SCCL privatisation on dec 9

 

బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి నిర్ణయం
9 నుంచి సమ్మెకు నోటీసు ఇచ్చిన టిబిజికెఎస్
పెద్దపల్లిలో కేంద్ర కమిటీ సమావేశం, హాజరైన 11 కార్మిక సంఘాల నేతలు
ఆ నాలుగు బ్లాక్‌లు సింగరేణికివ్వాలని డిమాండ్

మన తెలంగాణ/హైదరాబాద్/మంచిర్యాల : సింగరేణిలో త్వరలో సమ్మె సైరన్ మోగనుంది. ప్రభుత్వ రంగ బొగ్గు గనులను, బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేందుకు పూనుకోవడంతో వాటిని కాపాడుకునేందుకు సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టిబిజికెఎస్) గురువారం సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ మేరకు ఐదు డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచింది. వీటిని సత్వరమే పరిష్కరించని పక్షంలో వచ్చే నెల 9వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు ఆ నోటీసులో స్పష్టం చేసింది. గనుల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కార్మికులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా టిబిజికెఎస్ హెచ్చరించింది. ప్రధానంగా కళ్యాణి ఖని బ్లాక్ 6, కొయ్యగూడెం బ్లాక్3, సత్తుపల్లి బ్లాక్3, శ్రావణి పల్లి బ్లాకులను ప్రైవేటీకరణ చేయడాన్ని వెంటనే సంస్థ యాజమాన్యం ఉపసంహరించుకోవాలని సమ్మె నోటీసులో టిబిజికెఎస్ డిమాండ్ చేసింది.

అదే విధంగా అన్‌ఫిట్ కార్మికుల డిపెండెంట్ల వయసును 35 నుంచి 40 ఏళ్ల కు పెంచడం, కార్మికుల అలియాస్ పేర్లను మార్చడం, ఏడాది నుంచి మెడికల్ బోర్డు సమావేశం నిర్వహించనందున తక్షణమే మెడికల్ బోర్డును ఏర్పాటు చేయడం, మెడికల్ బోర్డు లేని కారణంగా డిపెండెంట్ల వయసు పెరగడంతో వారికి అవకాశం ఇవ్వడం వంటి డిమాండ్‌లను త్వరగా పరిష్కరించాలని అధికార యూనియన్ సూచించింది.పెద్దపల్లి జిల్లా యైటింక్లైన్ కాలనీలో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో ప్రధానంగా ప్రై వేటీకరణ వల్ల జరిగే నష్టాలపై కార్మిక సంఘాల నాయకులు చర్చించారు. టిబిజికెఎస్ అధ్యక్షుడు వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 11 బొగ్గు గనుల కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సంస్థ యజమాన్యం వెంటనే ఉపసంహరించుకుని ఆ నాలుగు బ్లాకులను సింగరేణికి ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు.

కోలిండియాలోని 89 బ్లాకులతో పాటు సింగరేణిలోని నాలుగు బ్లాకులకు ఓపెన్ టెండర్ పిలవడం పట్ల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణను ఆదిలోనే అడ్డుకోకపోతే గనులన్నీ ప్రైవేటు పరం అవుతాయని పేర్కొన్నారు. ప్రైవేటీకరణతో వారసత్వ ఉద్యోగా ల్లో కోత పడడమే కాకుండా కొత్త ప్రారంభించే అవకాశాలు ఉండబోవని సంఘం నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణతో ఆర్జిత లాభాలు తగ్గిపోయి అసలుకే నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర సమావేశంలో ఆదిలాబాద్, పెద్దపల్లి, భూ పాలపల్లి తదితర జిల్లాల కార్మిక సంఘాల నా యకులతో పాటు మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

TBGKS to strike against singareni privatisation on dec 9