Home Default ఎపిలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలి : చంద్రబాబునాయుడు

ఎపిలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలి : చంద్రబాబునాయుడు

TDP Chief Chandrababu Meets President Ramnathఢిల్లీ : ఎపిలో శాంతిభద్రతలు క్షీణించాయని, వెంటనే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరారు. సోమవారం మధ్యాహ్నం రాష్ట్రపతితో చంద్రబాబు నేతృత్వంలోని బృందం భేటీ అయింది. అనంతరం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. ఎపిలో ఆర్టికల్ 356 ను ఉపయోగించి, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని  రాష్ట్రపతిని కోరినట్టు ఆయన వెల్లడించారు. ఎపి సిఎం జగన్ తో కుమ్మక్కైన డిజిపి గౌతమ్ సవాంగ్ ను తక్షణమే రీకాల్ చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం సాగుతుందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్టు ఆయన వెల్లడించారు. టిడిపి కార్యాలయంపై జరిగిన దాడి కేసును సిబిఐకి అప్పగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా, వాటి మూలాలు ఎపిలోనే ఉంటున్నాయని ఆయన ఆరోపించారు. మద్య నిషేధం పేరిట ధరలు పెంచి మాఫియాగా మారి వైసిపి నాయకులు సొంత వ్యాపారం చేసుకుంటున్నారని ఆయన ద్వజమెత్తారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయిందని, ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపితే దాడులు చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.