Home ఎడిటోరియల్ ఇరకాటం ఇంతింత కాదయా!

ఇరకాటం ఇంతింత కాదయా!

Sampadakeeyam-Logoరాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బిజెపితో నాలుగేళ్ల సహచర్యం తదుపరి శుక్రవారం ఉదయం తప్పనిసరి పరిస్థితిలో ఎన్‌డిఎ కూటమినుంచి బయటకు
వచ్చారు. ఎపికి వాగ్దానం చేసిన ‘ప్రత్యేక తరగతి హోదా’పై ప్రధాని

నరేంద్రమోడీ మోసం చేయటమేగాక టిడిపి పైకి వైసిపి జగన్‌ను, జనసేన పవన్ కళ్యాణ్‌ను ఉసిగొల్పి పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు, విభజన చట్టంలోని హామీల అమలుకై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగాఉన్న మనోభావాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే చాతుర్య ప్రదర్శనగా చంద్రబాబునాయుడు వారం రోజుల క్రితం కేంద్రమంత్రివర్గం నుంచి టిడిపి మంత్రులిరువుర్ని ఉపసంహరించారు. కేంద్రంపై ఒత్తిడి కొనసాగింపుగా ఆ పార్టీ ఎంపిలతో పార్లమెంటు లోపల బయట ఆందోళన చేయిస్తున్నారు. ఏప్రిల్ ఆరు దాకా పార్లమెంటు సమావేశాల షెడ్యూలు ఉన్నందున అప్పటిలోగా ఏమీ ఫలితం రాబట్ట లేకపోతే ఎన్‌డిఎనుంచి వైదొలిగే విషయం అప్పుడు నిర్ణయించవచ్చుననుకున్నారు. అయితే పరిస్థితులు తరుముకొచ్చాయి. ఒకవైపు,మార్చి 21న కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం, ఏప్రిల్ 6న ఎంపిల రాజీనామాల సమర్పణను ప్రకటించిన వైసిపి, పార్లమెంటు సమావేశాలు ఏరోజైనా నిరవధికంగా వాయిదా పడవచ్చన్న ఊహాగానాల మధ్య అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే తేదీని ముందుకు (16వ తేదీ)జరపటం, మరోవైపున, పవన్‌కళ్యాణ్ రెండ్రోజుల క్రితం గుంటూరుజిల్లాలో జనసేన ఆవిర్భావ నాల్గవ వార్షిక సభపెట్టి టిడిపి పరిపాలనను అవినీతిమయంగా కడిగేయటం చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టాయి. ఎన్ని బలహీనతలున్నా, ప్రత్యేకహోదాకై ఆదినుంచి పట్టువిడవకుండా ఆందోళన చేస్తున్న వైసిపి ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానాన్ని బలపరచాలా, లేదా అనే సందిగ్ధావస్థలో ఉన్న చంద్రబాబునాయుడుకు పరిస్థితి ముందు నుయ్యి వెనుకగొయ్యిలా తయారైంది. శుక్రవారం సాయంత్రం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశాన్ని పిలిచిన చంద్రబాబుకు వ్యవధి ముంచుకొచ్చింది. వైసిపి తీర్మానాన్ని బలపరిస్తే తీర్మానం పెట్టిన ఖ్యాతి ఆ పార్టీకి దక్కుతుంది. అది తనకు రాజకీయంగా నష్టం. తామే తీర్మానానికి నోటీసు ఇవ్వాలంటే ఎన్‌డిఎనుంచి బయటకు రావాలి. ఆయన రెండవ మార్గం ఎంచుకోకతప్పలేదు. పొలిట్‌బ్యూరో సభ్యులతో తెల్లవారుతూనే టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఎన్‌డిఎనుంచి నిష్క్రమణ, మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నిర్ణయాలు తీసుకుని, ఎంపిల చేత నోటీసు ఇప్పించారు. అంతకు ముందే వైసిపి నోటీసు ఇచ్చింది.

ప్రత్యేక హోదా సమస్యపై మా అవిశ్వాస తీర్మానాన్ని టిడిపి బలపరచాలి లేదా వారు నోటీసిస్తే తాము బలపరుస్తామని జగన్ వ్యూహాత్మక ప్రతిపాదనపై చంద్రబాబు అప్పుడే స్పందించి ఉంటే, లేక మంత్రుల రాజీనామాల నాడే ఎన్‌డిఎనుంచి వైదొలిగి ఉంటే చొరవ చంద్రబాబు చేతిలో ఉండేది. కేంద్రంపై ఒత్తిడిద్వారా హోదా కాకపోయినా, ప్యాకేజీ నిధులైనా ఎంతోకొంత సాధించి రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీపై, గల్లి నుంచి ఢిల్లీదాకా ఆందోళన చేస్తున్న వామపక్షాలు, కాంగ్రెస్, స్వతంత్రులపై పైచేయి సాధించి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు వ్యూహాత్మక తప్పిదం చేశారు. అది బెడిసి కొట్టింది. బిజెపి జగన్‌ను ఉపయోగించుకుని అవిశ్వాస తీర్మానం, ఎంపిల రాజీనామాలు, పవన్ కళ్యాణ్‌ను ఉపయోగించుకుని అవినీతి ఆరోపణలు చేయిస్తున్నదని ఇప్పుడు నిందిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేము, తత్సమాన ఆర్థిక ప్యాకేజి ఇస్తామని కేంద్రం చెప్పిన మాటకు తలాడించి హోదా డిమాండ్‌ను వదులుకున్ననాడే తప్పు చేశారు. హోదా కోరుతూ ఆందోళన చేస్తున్న ఇతర పార్టీలు రాజకీయ లబ్దిపొందకుండా నిరోధించేందుకుగాను ఆయన ఇప్పుడు మళ్లీ హోదా డిమాండ్ అందుకున్నారు. అవ్వబువ్వ రెండూ తనకే కావాలకుని ఏకాకి అయినారు.

ఏమైతేనేం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం చేసిన దగాకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాన నోటీసులు కాంగ్రెస్ సహా అనేక పార్టీలను ఏకతాటిపైకి తెస్తూ బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఐక్యతకు పునాది వేస్తున్నది. బహుశా సోమవారం చర్చకు రావచ్చు. వైసిపి, టిడిపిలు తమ సంకుచిత బుద్ధిని, స్వార్థ రాజకీయాన్ని కట్టిపెట్టి రాష్ట్ర ప్రయోజనాలకొరకు పార్లమెంటులోనైనా ఐక్యంగా కొట్లాడితే ప్రజలు సంతోషిస్తారు.