Home మినీ సంగ్రామం నంద్యాలలో పని చేసిన సానుభూతి

నంద్యాలలో పని చేసిన సానుభూతి

Chandrababu-Naidu

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార టిడిపి ఘన విజయం సాధించింది. అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపిలు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచేందుకు హోరోహోరిన పోరాడాయి. అయితే ఇక్కడ అధికార టిడిపికి ప్రజలు పట్టం గట్టారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసిపి విజయం సాధించింది. వైసిపి అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి, టిడిపి అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డిలు బరిలో నిలిశారు. అయితే ఇక్కడ వైసిపి అభ్యర్థి భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. అనంతరం మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా భూమా నాగిరెడ్డి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఇటీవల గుండెపోటుతో మరణించారు. దీంతో నంద్యాలలో ఉప ఎన్నిక అనివార్యమైందన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో టిడిపి నేతగా ఉన్న శిల్పా మోహన్‌రెడ్డికి సిఎం చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. దీంతో శిల్పా వైసిపిలో చేరి , ఆ పార్టీ టికెట్‌పై ఉప ఎన్నికలో పోటీ చేశారు. అధికార టిడిపి తరపున భూమా నాగిరెడ్డి సోదరుని కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేశారు. ఈ క్రమంలో సోమవారం వెలువడిన ఫలితాల్లో భూమా  బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన విజయానికి సానుభూతితో పాటు ఇతర కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అధికార టిడిపి ప్రజలను ప్రలోభ పెట్టిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిందని వైసిపి నేతలు చెబుతున్నారు.

సానుభూతి పవనాలు వీయడం వల్లనే ఇక్కడ టిడిపి గెలిచిందని, చంద్రబాబు చేసిన అభివృద్ధి కాదని వారు చెబుతున్నారు. గతంలో వైఎస్ చనిపోయిన, అనంతరం జగన్ పార్టీ పెట్టడం, ఉప ఎన్నికలకు వెళ్లడం , ఘన విజయం సాధించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు భూమా నాగిరెడ్డి మరణంతో వచ్చిన సానుభూతి టిడిపిని గెలిపించిందని చెబుతున్నారు. భూమా శోభానాగిరెడ్డి చనిపోవడం, అనంతరం ఆమె భర్త భూమా నాగిరెడ్డి మరణించడంతో వారి పిల్లలు అనాథలుగా మారిపోయారని, అటువంటి వారిపై పోటీ చేయడం ఏ మేరకు సమంజసమని, వారిపై పోటీ చేయడం ఏమేరకు ప్రతాపమని టిడిపి చీఫ్, ఎపి సిఎం చంద్రబాబు చెప్పడం కూడా నంద్యాల ఓటర్లను ప్రభావితం చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.

అంతేకాక ఎన్నికల సందర్భంగా టిడిపి సర్వే పేరుతో ప్రజలను, ముఖ్యంగా మహిళలను బెదిరించిందని, టిడిపి గెలవకపోతే ఇక్కడ అభివృద్ధి జరగదని అధికార టిడిపి ప్రజలను బెదిరింపులకు గురి చేసిందని, ఇది కూడా టిడిపి విజయానికి ఒక కారణంగా వైసిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో వైసిపిదే విజయమంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇది కూడా వైసిపికి ప్రతికూలంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు కొందరు వైసిపి నేతలు టిడిపిపై, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏతావాతా టిడిపి విజయం మాత్రం చంద్రబాబు అభివృద్ధిది కాదని, కేవలం సానుభూతి, ప్రలోభాలు, భయపెట్టడాలు తదితర కారణాల వల్లే అధికార టిడిపి ఘన విజయం సాధించిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

TDP won in Nandyal by election