Home తాజా వార్తలు చిన్నారులను చితకబాదిన ఉపాధ్యాయులు…

చిన్నారులను చితకబాదిన ఉపాధ్యాయులు…

Students

 

నకిరేకల్ కృష్ణవేణి పాఠశాలలో ఘటన

నకిరేకల్ : అభంశుభం తెలియని చిన్నారులను ఉపాధ్యాయులు చితకబాధిన సంఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని కృష్ణవేణి టాలెంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చోటు చేసుకుంది. రెండు మూడు రోజులుగా ఇద్దరు చిన్నారులను ఉపాధ్యాయులు ఇష్టం వచ్చినట్లు బెత్తంతో కొట్టడంతో వారికి గాయాలయ్యాయి. పసి పిల్లలపై ఉపాధ్యాయులకు కోపం ఎందుకని బాధిత చిన్నారుల తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణవేణిలో 8వ తరగతి చదువుతున్న కుమేజ్‌ను గణిత బోధకుడు అప్పారావు గురువారం మధ్యాహ్నం రూల్ కర్రతో తలపై, ఎడమచేతిపై కొట్టడంతో తలకు స్వల్పగాయాలు కాగా చేతికి వాతలు పడ్డాయి.

అదే విధంగా 3వ తరగతి చదువుతున్న లక్ష్మిచరణ్‌తేజను ఈ నెల 16వ తేదీన హిందీ బోధకురాలు రేష్మా బెత్తంతో కొట్టడంతో కుడిచేతిపై వాతలు పడి కమిలిపోయింది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొని శుక్రవారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులపై, పాఠశాల యాజమాన్యంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలను దారుణంగా కొట్టడంతో స్కూల్‌కు రావాలంటే వారు భయపడుతున్నారని పాఠశాల యాజమాన్యాన్ని నిలదీసారు. దీంతో చిన్న పిల్లలను కొట్టిన విషయం తన దృష్టికి వచ్చిందని అట్టి ఉపాధ్యాయులను పాఠశాల నుంచి తొలగిస్తామని, ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని పాఠశాల ప్రిన్సిపాల్ విశ్వనాథ్ తల్లిదండ్రులకు నచ్చజెప్పడంతో ఆందోళన సర్దుమనిగింది.

Teacher who beat the Students