Thursday, April 25, 2024

తొలి రోజు స్పిన్నర్లదే!

- Advertisement -
- Advertisement -

చివరి టెస్టు.. తొలి రోజు స్పిన్నర్లదే!

చెలరేగిన అక్షర్, అశ్విన్ మాయ, సిరాజ్ హవా

ఇంగ్లండ్ 205 ఆలౌట్, భారత్ 24/1

Team India 24/1 at Stump on Day 1 in 3rd Test

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో, చివరి టెస్టులో భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లు మరోసారి చెలరేగి పోయారు. వీరికి హైదరాబాది స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ తోడు కావడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే ఆలౌటైంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా శుక్రవారం తొలి రోజు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే భారత్ మరో 181 పరుగులు చేయాలి. ఇక నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య భారత జట్టు 21 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగించినా టీమిండియాకే సిరీస్ దక్కుతోంది. అంతేగాక ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ కూడా ఖరారవుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. బుమ్రా స్థానంలో సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు.
ఆరంభం నుంచే..
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే కోలుకోలేని షాక్ తగిలింది. సిరీస్‌లో అసాధారణ రీతిలో చెలరేగి పోతున్న అక్షర్ పటేల్ మరోసారి అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. అతని దెబ్బకు ఇంగ్లండ్ ఓపెనర్లు డొమినిక్ సిబ్లి (2), జాక్ క్రాలీ (9) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ జో రూట్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. 5 పరుగులు మాత్రమే చేసి సిరాజ్ వేసిన అద్భుత బంతికి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లండ్ 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
స్టోక్స్ ఒంటరి పోరాటం..
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యత బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ తమపై వేసుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సమన్వయంతో ఆడుతూ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు కుదురుగా ఆడడంతో ఇంగ్లండ్ కోలుకున్నట్టే కనిపించింది. కానీ ఆరు ఫోర్లతో 28 పరుగులు చేసిన బెయిర్‌స్టోను సిరాజ్ పెవిలియన్ బాట పట్టించాడు. తర్వాత వచ్చిన ఓలి పోప్‌తో కలిసి స్టోక్స్ పోరాటం కొనసాగించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన స్టోక్స్ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 55 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికి పోయాడు. పోప్(29)ను అశ్విన్ ఔట్ చేశాడు. ఇక ధాటిగా ఆడిన లారెన్స్ 8 ఫోర్లతో 46 పరుగులు చేసి అక్షర్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. తర్వాత భారత బౌలర్లు వెంటవెంటనే వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 75.5 ఓవర్లలో 205 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో అక్షర్ నాలుగు, అశ్విన్ మూడు, సిరాజ్ రెండు, సుందర్ ఒక వికెట్ పడగొట్టారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (౦) ఔటయ్యాడు. అండర్సన్ వేసిన అద్భుత బంతికి గిల్ ఎల్బీగా వెనుదిరిగాడు. అప్పటికీ భారత్ ఖాతానే తెరవలేదు. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ 8 (బ్యాటింగ్), చటేశ్వర్ పుజారా 15 (బ్యాటింగ్) జట్టు స్కోరును ఒక వికెట్ నష్టానికి 24 పరుగులకు చేర్చారు.
బ్యాట్స్‌మెన్‌పైనే భారం
తొలి రోజు భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్ మరోసారి చెలరేగడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆశించిన స్కోరు కంటే తక్కువకే ముగిసింది. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ రూట్ మరోసారి పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశకు గురి చేశాడు. మిగతావారిలో స్టోక్స్, లారెన్స్ తప్ప ఎవరూ రాణించలేక పోయారు. కాగా, పిచ్ కూడా బౌలర్లకు అనుకూలంగా ఉండడం భారత్‌కు కలిసి వచ్చింది. అయితే భారత్‌కు రెండో రోజు ఇబ్బందులు ఖాయంగా కనిపిస్తున్నాయి. పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారడంతో బ్యాట్స్‌మెన్ జాగ్రత్తగా ఆడాల్సిన అవసరంఎంతైన ఉంది. ఏ మాత్రం నిర్లక్షం వహించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇలాంటి స్థితిలో శనివారం రెండో రోజు జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సిన బాధ్యత బ్యాట్స్‌మెన్‌పైనే ఉందని చెప్పాలి.

Team India 24/1 at Stump on Day 1 in 3rd Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News