Friday, March 29, 2024

ఉప్పల్‌లో ‘పరుగుల వరద’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం నువ్వానేనా అన్నట్టు సాగిన తొలి వన్డేలో టీమిండియా 12 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. శుభ్‌మన్ గిల్ (208) డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 49.2 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటై స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ఒక దశలో 131 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను మైఖేల్ బ్రాస్‌వెల్ (140) చారిత్రక బ్యాటింగ్‌తో దాదాపు గెలిపించినంత పని చేశాడు. చివరి ఓవర్‌లో బ్రాస్‌వెల్ ఔట్ కావడంతో భారత్ ఓటమి నుంచి బయటపడింది.

ఆరంభంలోనే..

కష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ డెవోన్ కాన్వే (10)ను సిరాజ్ తక్కువ స్కోరుకే పెవిలియన్ పంపించాడు. అయితే మరో ఓపెనర్ ఫిన్ అలెన్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అలెన్ ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 40 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కివీస్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. నికోల్స్ (18), డారిల్ మిఛెల్ (9), కెప్టెన్ టామ్ లాథమ్ (24), గ్లెన్ ఫిలిప్స్ (11) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. దీతో కివీస్ 131 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది.

బ్రాస్‌వెల్ వీరవిహారం..

ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మైఖేల్ బ్రాస్‌వెల్ తనపై వేసుకున్నాడు. అతనికి మిఛెల్ సాంట్నర్ అండగా నిలిచారు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన బ్రాస్‌వెల్ వరుస ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. అతని అసాధారణ బ్యాటింగ్ అభిమానులను కనువిందు చేసింది. అప్పటి వరకు సప్పగా సాగుతున్న మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన బ్రాస్‌వెల్ కళ్లు చెదిరే శతకం సాధించాడు. మరోవైపు సాంట్నర్ 45 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 57 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో బ్రాస్‌వెల్‌తో కలిసి ఏడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 162 పరుగులు జోడించాడు. మరోవైపు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన బ్రాస్‌వెల్ 78 బంతుల్లోనే 10 భారీ సిక్సర్లు, 12 బౌండరీలతో 140 పరుగులు చేసి చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు, కుల్దీప్, శార్దూల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

శుభమన్ డబుల్ సెంచరీ

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో ఆదుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (34), విరాట్ కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5)లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. అయితే శుభ్‌మన్ గిల్ మాత్రం కివీస్ బౌలర్లను హడలెత్తిస్తూ స్కోరును పరిగెత్తించాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న గిల్ 149 బంతుల్లోనే 19 బౌండరీలు, 9 భారీ సిక్సర్లతో 208 పరుగులు సాధించాడు. అతనికి సూర్యకుమార్ (31), హార్దిక్ పాండ్య (28) అండగా నిలిచారు. వారి సహకారంతో గిల్ పరుగుల వరద పారించాడు. ఇక 149 నుంచి 200 పరుగులు చేరుకునే క్రమంలో గిల్ ఏకంగా ఆరు సిక్సర్లు కొట్టడం విశేషం. గిల్ చారిత్రక డబుల్ సెంచరీతో భారత్ స్కోరు 349 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News