Thursday, February 22, 2024

జైత్రయాత్రకు శ్రీకారం

- Advertisement -
- Advertisement -

Team India

 

కొత్త ఏడాదిలో టీమిండియా జోరు

క్రీడా విభాగం: కిందటి ఏడాది వరుస విజయాలతో హోరెత్తించిన టీమిండియా ఈసారి కూడా జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. 2020లో ఆడిన రెండు సిరీస్‌లలో కూడా భారత జట్టు జయకేతనం ఎగుర వేసింది. శ్రీలంకతో జరిగిన ట్వంటీ20 సిరీస్‌ను టీమిండియా 20తో సొంతం చేసుకుంది. తాజాగా పటిష్టమైన ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను విరాట్ కోహ్లి సేన 21తో దక్కించుకుంది. ఈ ఏడాది టి20 ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో భారత జట్టు విజయంతో సీజన్‌ను ఆరంభించడం పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోహ్లి సేన సమతూకంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదురైనా టీమిండియా ఒత్తిడికి గురి కాలేదు.

తర్వాత జరిగిన రెండు వన్డేల్లోనూ గెలిచి తనకు ఎదురులేదని నిరూపించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్, యువ ఆటగాడు లోకేశ్ రాహుల్, సీనియర్ బౌలర్ షమి తదితరులు టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ఈ సిరీస్ ద్వారా తన నాయకత్వ సత్తా ఏంటో కోహ్లి మరోసారి చాటి చెప్పాడు. ఒత్తిడిలోనూ జట్టును ముందుండి నడిపించిన తీరును ఎంత పొగిడినా తక్కువే. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా, ఫీల్డర్‌గా కోహ్లి మరోసారి చెలరేగి పోయాడు. టీమిండియా సిరీస్ సాధించిందంటే అందుకు ప్రధాన కారణాల్లో కోహ్లి ఒకడని చెప్పక తప్పదు. ఇక, సీనియర్ ఓపెనర్ ధావన్ కూడా ఆడిన రెండు మ్యాచుల్లోనూ మెరుగైన బ్యాటింగ్‌తో అలరించాడు. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ వరుసగా రెండు మ్యాచుల్లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కిందటి మ్యాచ్‌లో గాయం వల్ల బ్యాటింగ్‌కు దిగలేదు.

ఒకవేళ దిగివుంటే కచ్చితం మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ అవార్డును ఎగురేసుకు పోయేవాడే. కొంతకాలంగా పేలవమైన ఆటతో సతమతమవుతున్న ధావన్ ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై మెరుగ్గా ఆడడం జట్టుకు శుభసూచకంగా చెప్పొచ్చు. రానున్న సిరీస్‌లలో మరింత మెరుగ్గా రాణించేందుకు ఇది దోహదం చేయడం ఖాయం. మరోవైపు లోకేశ్ రాహుల్ కూడా సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ సత్తా చాటాడు. కీలక సమయంలో అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. భారత్ సిరీస్ సాధించడంలో రాహుల్ కూడా కీలకపాత్ర పోషించాడు. వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా రాహుల్ జట్టుపై తనదైన ముద్ర వేశాడు. రానున్న కివీస్‌లో మరింత మెరుగ్గా రాణించేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు. క్లిష్టమైన కివీస్ సిరీస్‌లో రోహిత్ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు.

ఆస్ట్రేలియాపై రాణించడంతో అతని ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందనడంలో సందేహం లేదు. భవిష్యత్తులో టీమిండియా ప్రధాన అస్త్రాల్లో ఒకడిగా రాహుల్ కొనసాగే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఇక, చివరి మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ చిరస్మరణీయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో అసాధారణ బ్యాటింగ్‌తో రోహిత్ జట్టును ఆదుకున్నాడు. ఆస్ట్రేలియా వంటి పటిష్ట బౌలింగ్ లైనప్ కలిగిన జట్టుపై రోహిత్ చెలరేగిన తీరును చూడముచ్చటగా ఉంది. ఒత్తిడిలోనూ అతను కొట్టిన సిక్సర్లు క్రికెట్ చరిత్రలో చిరకాలం తీపి జ్ఞాపకంగా గుర్తుండి పోతాయి. తొలి రెండు మ్యాచుల్లో విఫలమైనా ఆఖరి మ్యాచ్‌లో మాత్రం రోహిత్ తన స్థాయికి తగ్గ ఆటనే కనబరిచాడు. భారీ సిక్సర్లు, చక్కటి ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. రోహిత్ ఫామ్‌లోకి రావడం రానున్న న్యూజిలాండ్ సిరీస్‌లో భారత్‌కు పెద్ద ఊరట కలిగించే పరిణామమే.

సమష్టి విజయమిది
సమష్టి పోరాటం వల్లేఆస్ట్రేలియాపై భారత్‌కు గెలుపు దక్కిందని చెప్పాలి. తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం తర్వాత భారత జట్టులో గెలిచి తీరాలనే పట్టుదల స్పష్టంగా కనిపించింది. చివరి రెండు మ్యాచుల్లో టీమిండియా క్రికెటర్లు సమష్టిగా పోరాడారు. ప్రతి ఆటగాడు తన పాత్రను సమర్థంగా పోషించాడు. ఇటు బ్యాట్స్‌మెన్, అటు బౌలర్లు సమష్టితత్వంతో ముందుకు సాగారు. ఫీల్డర్లు కూడా అద్భుత ప్రతిభను కనబరిచారు.

ప్రమాదకర ఆటగాళ్లతో కూడిన ఆస్ట్రేలియాను రెండు మ్యాచుల్లోనూ భారత బౌలర్లు కట్టడి చేయడంలో సఫలమయ్యారు. సీనియర్లు బుమ్రా, షమిలు అద్భుతంగా రాణించారు. బుమ్రా వికెట్లు తీయకున్నా పొదుపుగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి చేయడంలో సఫలమయ్యాడు. షమి మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నా కీలక సమయంలో వికెట్లు తీసి జట్టును ఆదుకున్నాడు. కుల్దీప్, సైని, జడేజాలు కూడా తమ పాత్రను సమర్థంగా పోషించారు. ఫీల్డర్లు కూడా తమ వంతు సహకారం అందించడంతో టీమిండియాకు సిరీస్ దక్కింది.

Team India josh in the new year
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News