Friday, April 19, 2024

ఆస్ట్రేలియాదే వన్డే సిరీస్

- Advertisement -
- Advertisement -

Team India lost the second ODI as well

 

స్మిత్ మరో శతకం, రాణించిన వార్నర్, ఫించ్, మాక్స్‌వెల్ మెరుపులు, రాహుల్, కోహ్లి పోరాటం వృథా, రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి

సిడ్నీ: భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను ఆతిథ్య ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలివుండగానే సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 51 పరుగులతో తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ విజయంతో 20 తేడాతో సిరీస్‌ను దక్కించుకుంది. ఇరు జట్ల మధ్య మూడో, చివరి వన్డే బుధవారం కాన్‌బెరాలో జరుగనుంది. సిడ్నీ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 389 పరుగుల భారీ స్కోరును సాధించింది. స్టీవ్ స్మిత్ (104) వరుసగా రెండో సెంచరీ సాధించి జట్టుకు అండగా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 338 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

కోహ్లి పోరాటం

క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే అడపాదడపా బౌండరీలతో స్కోరు వేగం తగ్గకుండా చూశారు. ఓపెనర్లు కుదురుగా ఆడడంతో భారత్‌కు మెరుగైన ఆరంభం లభించింది. అయితే ఐదు ఫోర్లతో 30 పరుగులు చేసి దూకుడు మీద కనిపించిన ధావన్‌ను హాజిల్‌వుడ్ వెనక్కి పంపాడు. దీంతో 58 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే మరో ఓపెనర్ మయాంక్ కూడా ఔటయ్యాడు. 4 ఫోర్లతో 28 పరుగులు చేసిన మయాంక్‌ను కమిన్స్ పెవిలియన్ దారి చూపించాడు. దీంతో భారత్ 60 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యత కెప్టెన్ విరాట్ కోహ్లి తనపై వేసుకున్నాడు. అతనికి శ్రేయస్ అయ్యర్ సహకారం అందించాడు.

ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇటు అయ్యర్, అటు కోహ్లి ధాటిగా ఆడడంతో స్కోరు వేగం పుంజుకుంది. ఇద్దరి దూకుడును చూస్తుంటే భారత్ కోలుకున్నట్టే కనిపించింది. ఈ జంటను విడగొట్టేందుకు ఆస్ట్రేలియా బౌలర్లు చాలా సేపటి వరకు నిరీక్షించాల్సి వచ్చింది. అయితే 5 ఫోర్లతో 38 పరుగులు చేసిన అయ్యర్‌ను హెన్రిక్స్ వెనక్కిపంపాడు. దీంతో 93 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన లోకేశ్ రాహుల్‌తో కలిసి కోహ్లి పోరాటం కొనసాగించాడు. ఇద్దరు కుదురుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. కానీ 87 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 89 పరుగులు చేసిన కోహ్లిని హాజిల్‌వుడ్ ఔట్ చేశాడు. మరోవైపు కోహ్లి ఔటైనా రాహుల్ తన పోరాటం కొనసాగించాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 66 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, మరో 4 ఫోర్లతో 76 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక రవీంద్ర జడేజా (24), హార్దిక్ పాండ్య (28) తప్ప మిగతావారు విఫలం కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.

కదం తొక్కిన స్మిత్

అంతకుముదు తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్‌లు మరోసారి శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. వీరిని ఔట్ చేసేందుకు కెప్టెన్ కోహ్లి తరచూ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ఫించ్ ఆరు ఫోర్లు, సిక్స్‌తో 60 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 142 పరుగులు జోడించాడు. ఓ వెంటనే వార్నర్ కూడా ఔటయ్యాడు. ధాటిగా ఆడిన వార్నర్ మూడు సిక్స్‌లు, ఏడు ఫోర్లతో 83 పరుగులు చేశాడు. మరోవైపు వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్ మరోసారి విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. భారత బౌలింగ్‌ను చీల్చి చెండాడిన స్మిత్ 64 బంతుల్లోనే 14 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 104 పరుగులు సాధించాడు. మరోవైపు చెలరేగి ఆడిన మాక్స్‌వెల్ 29 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, మరో 4 ఫోర్లతో అజేయంగా 63 పరుగులు చేశాడు. లబూషేన్ (70) కూడా తనవంతు పాత్ర పోషించడంతో ఆస్ట్రేలియా స్కోరు 389 పరుగులకు చేరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News