Home స్కోర్ ఆసీస్ గడ్డపై టీమిండియా నయా చరిత్ర

ఆసీస్ గడ్డపై టీమిండియా నయా చరిత్ర

India win in Asia Cup Final match

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక ప్రదర్శనతో టీమిండియా ప్రపంచ క్రికెట్‌లో కొత్త ఆధ్యాయానికి తెరలేపిందనే చెప్పాలి. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఓడించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అలాంటి జట్టును టెస్టుల్లో, వన్డేల్లో ఓడించి విరాట్ కోహ్లి సేన పెను ప్రకంపనలు సృష్టించింది. ట్వంటీ20 సిరీస్‌ను సమం చేసిన భారత్ తర్వాత జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌లలో జయకేతనం ఎగుర వేసింది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్ టెస్టుల్లో, వన్డేల్లో విజయం సాధించడం ఇదే తొలిసారి. గతంలో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన సిరీస్‌లలో భారత్‌కు చేదు జ్ఞాపకాలే మిగిలాయి. టెస్టుల్లో అయితే భారత్ ప్రదర్శన అంతంత మాత్రమే. కిందటి రెండు సిరీస్‌లలో అయితే చిత్తు చిత్తుగా ఓడింది. కానీ, ఈసారి మాత్రం భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. సిడ్నీలో జరిగిన ఆఖరి టెస్టుకు వర్షం అడ్డంకిగా మారి ఉండక పోతే భారత్ మరింత భారీ తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకునేది. అంతేగాక టి20లలో కూడా వర్షం వల్ల భారత్‌కు సిరీస్ సాధించే అవకాశం చేజారింది. ఇక, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో మూడు ఫార్మాట్‌లలో కూడా టీమిండియా చిరస్మరణీయ ప్రదర్శన చేసిందనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోహ్లి సేనకు ఎదురు లేకుండా పోయింది. సొంత గడ్డపై సిరీస్‌లంటే ఆస్ట్రేలియా గెలుపు దాదాపు ముందే ఖరారు కావడం సంప్రదాయంగా వస్తోంది. గతంలో ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు మాత్రమే ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఓడించాయి. తాజాగా ఈ జట్ల సరసన భారత్ చేరింది. ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో పేలవమైన ప్రదర్శన చేసిన టీమిండియాకు ఆస్ట్రేలియా సిరీస్‌లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడం ఖాయమని అందరూ భావించారు. కానీ, తొలి టెస్టు నుంచే భారత జట్టు అసాధారణ ఆటను కనబరిచింది. ప్రారంభ టెస్టులోనూ ఆస్ట్రేలియాను ఓడించి సంచలనం సృష్టించింది. భారీ తేడాతో గెలవకున్న విజయం భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పాలి. కానీ, రెండో టెస్టులో చిత్తుగా ఓడడంతో భారత జట్టు ప్రదర్శనపై మళ్లీ సందేహాలు తలెత్తాయి. కానీ, కోహ్లి సేన మాత్రం ఒత్తిడిని సయితం తట్టుకుంటూ మూడో టెస్టులో చారిత్రక విజయాన్ని అందుకుంది. కొత్త ఆటగాడు మయాంక్ అగర్వాల్ అసాధారణ బ్యాటింగ్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆడిన రెండు మ్యాచుల్లోనూ మయాంక్ తనదైన ముద్ర వేశాడు. రానున్న రోజుల్లో పృథ్వీషా, మయాంక్‌లు భారత జట్టుకు కీలక ఓపెనర్లుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారాను ఎంత పొగిడిన తక్కువే. టెస్టు సిరీస్‌లో నిలకడగా రాణించిన పుజారా తానెంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ అజింక్య రహానె, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌లు కూడా అద్భుతంగా రాణించారు. జట్టు టెస్టు సిరీస్ గెలవడంలో వీరంత తమవంతు సహకారం అందించారు
సత్తా చాటిన బౌలర్లు


మరోవైపు టెస్టు, వన్డే సిరీస్ విజయాల్లో బౌలర్లది కూడా కీలక పాత్ర అని చెప్పక తప్పదు. టెస్టుల్లో జస్‌ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్‌లు అద్భుతంగా రాణించారు. బుమ్రా అయితే ఏకంగా 21 వికెట్లు తీసి ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. షమీ కూడా 16 వికెట్లతో మెరిశాడు. ఇషాంత్ కూడా 11 వికెట్లను పడగొట్టి తనలో చేవ తగ్గలేదని నిరూపించాడు. జడేజా, అశ్విన్, కుల్దీప్‌లు తమ స్పిన్‌తో జట్టుకు అండగా నిలిచారు. ఇలా బౌలర్లందరూ సమష్టి కృషితో భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించారు.
మురిపించిన ధోని

Dhoni
ఇక, వన్డే సిరీస్‌లో సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అసాధారణ ఆటతో ఆకట్టుకున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ధోని అద్భుతంగా రాణించాడు. మూడింటిలోనూ అర్ధ సెంచరీలు సాధించి తనలో ఇంకా సత్తా మిగిలేవుందని విమర్శకులకు గట్టి సమాధానం చెప్పాడు. చివరి రెండు మ్యాచుల్లో ఆఖరు వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. రానున్న ప్రపంచకప్‌లోనూ జట్టులో స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు కూడా బ్యాట్‌తో మెరుపులు మెరిపించారు. ఇద్దరు సిరీస్‌లో చెరో సెంచరీ సాధించి తామెంత కీలక ఆటగాళ్లో చాటి చెప్పారు. కేదార్ జాదవ్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బౌలింగ్‌లో భువనేశ్వర్, చాహల్‌లు అద్భుతంగా రాణించారు. చివరి వన్డేలో చాహల్ ఏకంగా ఆరు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. రెండో వన్డేలో భువనేశ్వర్ కూడా నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కాలక పాత్ర పోషించాడు. మహ్మద్ షమీ కూడా బాగానే బౌలింగ్ చేశాడు. కీలక సమయంలో వికెట్లు తీసి జట్టు విజయంలో తనవంతు సహకారం అందించాడు. కాగా, రానున్న ప్రపంచకప్‌లో మరింత మెరుగ్గా రాణించేందుకు టీమిండియాకు ఈ విజయాలు దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు.

Team India new record in Australia