Home తాజా వార్తలు అండర్-19 వరల్డ్ కప్ 2020: భారత జట్టు ప్రకటన..

అండర్-19 వరల్డ్ కప్ 2020: భారత జట్టు ప్రకటన..

ముంబయి: దక్షిణాఫ్రికాలో జరగనున్న పదమూడో అండర్-19 వరల్డ్ కప్ 2020కు టీమిండియా జట్టును ఎంపిక చేశారు. సోమవారం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించారు. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది జనవరి 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనుంది. భారత జట్టుకు కెప్టెన్ గా ఉత్తర్ ప్రదేశ్ బ్యాట్స్‌మన్ ప్రియామ్ గార్గ్, వైస్ కెప్టెన్ గా ధ్రవ్ చంద్ లను సెలెక్ట్ చేశారు. ధ్రవ్ బ్యాటింగ్ తోపాటు వికెట్ కీపర్ గానూ జట్టుకు సేవలందించగలడు. అయితే, కుమాల్ కుషాగ్రా కూడా జట్టులో వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. ముంబైకర్ యశస్వి జైస్వాల్‌తో పాటు దివ్యన్ష్ సక్సేనా, ఉత్తరాఖండ్‌కు చెందిన శశ్వత్ రావత్, హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ వంటి యువ బ్యాట్స్‌మన్లు ఈ టోర్నీకి ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా 50 ఓవర్ల మ్యాచ్ లో ముంబయి తరఫున బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్‌ అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. కేవలం 154 బంతుల్లో 12సిక్స్ లు, 17ఫోర్లతో మెరుపులు మెరిపించిన జైస్వాల్‌ డబుల్ సెంచరీ (203) సాధించి రికార్డు నెలకొల్పాడు. దీంతో అతి పిన్న వయస్సులో డబుల్ సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా జైస్వాల్‌ నిలిచాడు. కాగా, మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ఈ జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. న్యూజిలాండ్, జపాన్, శ్రీలంక జట్లతోపాటు టీమిండియాను గ్రూప్-ఎలో చేర్చారు. 2018, న్యూజిలాండ్ లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ని పృథ్వీషా సారథ్యంలోని టీమిండియా జట్టు కైవసం చేసుకుంది. మొత్తం పన్నెండు అండర్-19 ప్రపంచకప్ లు జరగగా.. టీమిండియా నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది.

భారత జట్టు:  ప్రియామ్ గార్గ్(కెప్టెన్), ధ్రవ్ చంద్ జురెల్(వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, దివ్యన్ష్ సక్సేనా, శశ్వత్ రావత్, దివ్యన్ష్ జోషి, శుభాంగ్ హెగ్డే, రవి బిష్ణోయ్, ఆకాష్ సింగ్, కార్తీక్ త్యాగి, అధర్వ అంకోలేకర్, కుమార్ కుష్రా విద్యాధర్ పాటిల్.

Team India Select for Under-19 World Cup 2020