Saturday, February 4, 2023

వైట్‌వాష్‌పై కన్నేసిన టీమిండియా

- Advertisement -

team-Indకోల్‌కతా: భారత్‌లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టుకు ఒక్క గెలుపు కూడా లేదు. ప్రస్తుతం వన్డేల్లోనూ, అంతకు ముందు టెస్ట్ సిరీస్‌లోనూ పూర్తిగా పరాజయం పాలైంది. వన్డే సిరీస్‌లో చివరిది ఆదివారం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగనుంది. ఇరు జట్లు ఇప్పటికే కోల్‌కతా చేరుకుని ప్రాక్టీసు కూడా చేస్తున్నాయి. టీమిండియా జట్టు ఒక్కటిగా నిలిచి విజయపరంపరను కొనసాగిస్తోంది. లక్షం వారి దృష్టిలో కేవలం అంకెలుగానే ఉండిపోతున్నాయి. రెండో వన్డేలో ఇంగ్లాండ్ జట్టు 350 లక్షాన్ని ఉంచినా, ఆదిలోనే నాలుగు కీలక వికెట్లు పడిపోయినా టీమిండియా గెలిచిందంటే భారత్ జట్టులోని బ్యాట్స్‌మెన్ ఎంత కలసికట్టుగా ఆడుతున్నది అర్థంకాగలదు. మరో ఐదు నెలల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉండగానే ఫైనల్ వన్డేలోనూ ఇంగ్లాండ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని టీమిండియా చూస్తోంది. ఇందుకు క్లీన్‌స్వీప్‌ను లక్షంగా పెట్టుకుంది.
విరాట్ కోహ్లి సేనలో యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ వంటి వారు మళ్లీ తమ పాత ఫామ్‌లోకి కూడా వచ్చేశారు. వారు అద్భుతంగా ఆడి రెండో వన్డేలో ఇంగ్లాండ్ జట్టును 15 పరుగుల తేడాతో ఓడించారు. కటక్‌లో 382 పరుగుల ఛేదనలోను, పుణెలో 351 లక్షాన్ని సాధించడంలోనూ ఇంగ్లాండ జట్టు విఫలమైంది. ఇంగ్లాండ్ జట్టు బాగా ఆడినా, ఆ జట్టు కెప్టెన్ మోర్గాన్ మంచి ఫామ్ కనబరిచినా యువరాజ్, ధోనీ 256 పరుగుల భాగస్వామ్యంతో నీరుగార్చేశారు. భారత జట్టు బ్యాట్స్‌మెన్‌ల ముందు 350 పరుగులు కేవలం అంకెలుగానే మిగిలిపోయాయి తప్ప అసాధ్య అక్షంగా కూడా కనిపించలేదు. టీమిండియాలో బ్యాట్స్‌మన్ కలసికట్టుతనం కొట్టోచినట్లు కనబడుతోంది. పుణెలో కేదార్ జాదవ్ 76 బంతుల్లో 120 పరుగులు చేయడం కూడా ఓ విశేషమనే చెప్పాలి.
ఇంగ్లాండ్ ఓపెనర్ జె.రాయ్ అయితే వన్డేల్లో రెండు పెద్ద శతకాలు చేయడం మిస్సయినందుకు చాలా నిరాశ చెంది ఉన్నాడు. ఓపెనర్లుగా రాయ్, హేల్స్ 2016 వన్డేల్లో అత్యధిక పరుగులు(256 పరుగులు) చేశారు. ప్రస్తుతం మూడో వన్డేలో గాయం కారణంగా హేల్స్ ఆడడం లేదు. అయినప్పటికీ ఇంగ్లాండ్‌ను ఓ ప్రత్యేక జట్టుగా నిలబెట్టడానికి తాను ప్రయత్నిస్తానంటున్నాడు జేసన్ రాయ్. హేల్స్ స్థానాన్ని సామ్ బిల్లింగ్స్ భర్తీ చేస్తాడని నమ్ముతున్నాడు. ఇంగ్లాండ్‌లో జరుగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ జట్టు ఆరు వన్డేలు ఆడనున్నది. ఇవన్నీ దానికి మెట్లుగా భావిస్తానంటున్నాడు. ఈ సిరీస్‌లో తన సత్తా చూపాలని అతడు తెగ ప్రయత్నిస్తున్నాడు.
వన్డేల్లో ఇక ఇంగ్లాండ్‌కు మిగిలిన చివరి అవకాశం కోల్‌కతా వన్డేనే. వారు ఎలాగైనా గెలవడానికి ప్రయత్నించనున్నారు. కానీ టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే మూడో వన్డే కూడా గెలిచి ఇంగ్లాండ్‌పై పూర్తి వైట్‌వాష్ సాధించాలని, ఇంగ్లాండ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని కంకణం కట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles