Thursday, April 25, 2024

ఐసిసి టి20 ర్యాంకింగ్స్: టీమిండియాకు అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

Team India tops ICC T20 team rankings

 

దుబాయి: ఐసిసి ట్వంటీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 30తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ను టీమిండియా వెనక్కి నెట్టి మొదటి ర్యాంక్‌ను దక్కించుకుంది. కాగా, భారత్ చివరి సారిగా 2016లో టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఈ ఫార్మాట్‌లో టాప్ ర్యాంక్‌ను అందుకోవడం ఇదే తొలిసారి. ఇటీవల కాలంలో టి20లలో భారత్ అద్భుత ఆటను కనబరుస్తోంది.

సొంత గడ్డపైనే కాకుండా విదేశాల్లోనూ వరుస సిరీస్‌లను దక్కించుకొంటోంది. దీంతో భారత్‌కు మరోసారి టాప్ ర్యాంక్ వరించింది. వెస్టిండీస్‌తో సొంత గడ్డపై జరిగిన సిరీస్‌లో టీమిండియా ఆడిన మూడు మ్యాచుల్లోనూ జయకేతనం ఎగుర వేసింది. దీంతో 10484 రేటింగ్ పాయింట్లతో భారత్ టాప్ ర్యాంక్‌ను అందుకుంది. అయితే రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ కంటే భారత్ కేవలం పది రేటింగ్ పాయింట్ల ఆధిక్యంలో మాత్రమే ఉంది. అయితే రానున్న శ్రీలంక సిరీస్‌లో విజయం సాధిస్తే టీమిండియా టాప్ ర్యాంక్ మరింత పదిలం కావడం ఖాయం. కాగా పాకిస్థాన్ మూడో, న్యూజిలాండ్ నాలుగో, ఆస్ట్రేలియా ఐదో ర్యాంక్‌లో నిలిచింది.

ప్రశంసల వర్షం..

మరోవైపు టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రానున్న వరల్డ్‌కప్ నాటికి టీమిండియా మరింత బలోపేతం కావడం ఖాయమని అభిమానులు జోస్యం చెబుతున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ టీమిండియాకు వరంగా మారిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే వరల్డ్‌కప్‌లో భారత్ ట్రోఫీని సాధించడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా సమతూకంగా కనిపిస్తోందని దీనికి ఐపిఎల్ వంటి మెగా టోర్నమెంట్ కారణమని వారు పేర్కొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News