Home తాజా వార్తలు బోణీ అదిరింది..

బోణీ అదిరింది..

Team india

 

శ్రేయస్ మెరుపులు, రాహుల్ దూకుడు, రాణించిన క్లాస్, కేన్ శ్రమ వృథా, కివీస్‌కు షాక్, తొలి టి20 భారత్ ఘన విజయం

ఆక్లాండ్: క్లిష్టమైన న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా కళ్లు చెదిరే విజయంతో ఆరంభించింది. సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా క్లిష్టమైన ఈ భారీ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలివుండగానే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

టాప్ ఆర్డర్ రాణించడంతో భారత్ చారిత్రక విజయాన్ని దక్కించుకుంది. టి20 ఫార్మాట్‌లో కివీస్‌పై భారత్‌కు ఉన్న పేలవమైన రికార్డును ఈ మ్యాచ్ ద్వారా భారత్ చెరిపేసిందనే చెప్పాలి. ప్రత్యర్థి కొండంత లక్ష్యాన్ని ఉంచినా టీమిండియా ఎక్కడ ఒత్తిడికి గురి కాలేదు. భీకర ఫామ్‌లో ఉన్న లోకేశ్ రాహుల్ ఈసారి కూడా తన జోరును కొనసాగించాడు. కోహ్లి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో తనవంతు పాత్ర పోషించాడు. ఇక, యువ సంచలనం శ్రేయస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్‌కు సంచలన విజయాన్ని సాధించి పెట్టాడు. అయ్యర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో టి20 జరుగనుంది.

రాహుల్ జోరు
భారీ లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆరంభంలోనే కోలుకోలేని షాక్ తగిలింది. కీలక ఆటగాడు, ఓపెనర్ రోహిత్ శర్మ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఏడు పరుగులు మాత్రమే చేసి సాంట్నర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అప్పటికీ జట్టు స్కోరు 16 పరుగులు మాత్రమే. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను కెప్టెన్ విరాట్ కోహ్లి, మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ తమపై వేసుకున్నారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. అద్భుత ఫామ్‌లో ఉన్న రాహుల్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను భారీ షాట్లుగా మలుస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. కెప్టెన్ కోహ్లి కూడా తన మార్క్ బ్యాటింగ్‌తో అలరించాడు. ఇటు కోహ్లి, అటు రాహుల్ కుదురు కోవడంతో భారత్ నెమ్మదిగా లక్షం వైపు సాగింది.

మరోవైపు ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొంత కాలంగా అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న రాహుల్ మరోసారి జట్టుకు అండగా నిలిచాడు. భారీ లక్షం ముందున్నా ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా పోరాటాన్ని కొనసాగించాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో కివీస్ బౌలర్లను హడలెత్తించాడు. సునామీ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 27 బంతుల్లోనే మూడు భారీ సిక్సర్లు, మరో నాలుగు ఫోర్లతో 56 పరుగులు చేశాడు.

అయితే దూకుడుగా ఆడుతున్న రాహుల్‌ను ఐష్ సోధి ఔట్ చేశాడు. ఇదే క్రమంలో కోహ్లితో కలిసి రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించాడు. కొద్ది సేపటికే విరాట్ కోహ్లి కూడా పెవిలియన్ చేరాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి ఒక సిక్స్, మరో మూడు ఫోర్లతో 32 బంతుల్లోనే 45 పరుగులు సాధించాడు. తర్వాత వచ్చిన యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. ఒక ఫోర్, మరో సిక్సర్‌తో 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ ఒక దశలో 142 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

శ్రేయస్ విధ్వంసం
ఇలాంటి పరిస్థితుల్లో జట్టును గెలిపించే బాధ్యతను యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తనపై వేసుకున్నాడు. అతనికి సీనియర్ ఆటగాడు మనీష్ పాండే అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి కివీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. మనీష్ సమన్వయంతో ఆడగా, అయ్యర్ కళ్లు చెదిరే షాట్లతో చెలరేగి పోయాడు. కివీస్ బౌలర్లను హడలెత్తిస్తూ పరుగుల వరద పారించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో అభిమానులను కనువిందు చేశాడు. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ముందుకు సాగిన శ్రేయస్ చూడచక్కని షాట్లతో ఆకట్టుకున్నాడు. పాండే కూడా అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ 29 బంతుల్లోనే మూడు భారీ సిక్సర్లు, మరో ఐదు కళ్లు చెదిరే ఫోర్లతో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు మనీష్ పాండే ఒక సిక్స్‌తో 14 పరుగులు సాధించి నాటౌట్‌గా ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ విధ్వంసక బ్యాటింగ్‌తో భారత్ మరో ఓవర్ మిగిలివుండగానే లక్ష్యాన్ని అందుకుంది.

ఆరంభం నుంచే
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య న్యూజిలాండ్‌కు ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, కొలిన్ మన్రో కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించారు. ఇద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. ఇటు మన్రో, అటు గుప్టిల్ పోటీ పడి ఆడడంతో పరుగుల వరద పారింది. ఈ జోడీని కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. స్టార్ ఆటగాడు గుప్టిల్ కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. ధాటిగా ఆడిన గుప్టిల్ 19 బంతుల్లోనే ఒక సిక్స్, మరో నాలుగు ఫోర్లతో 30 పరుగులు సాధించాడు. ప్రమాదకరంగా మారిన గుప్టిల్‌ను శివమ్ దూబే వెనక్కి పంపాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన గుప్టిల్ బౌండరీ లైన్ వద్ద రోహిత్ శర్మ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కు వెనుదిరిగాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన క్యాచ్‌లలో ఇది ఒకటి నిలిచి పోతుందనడంలో సందేహం లేదు. కాగా, గుప్టిల్ అప్పటికే 7.5 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 80 పరుగుల భాగ స్వామ్యంలో పాలు పంచుకున్నాడు.

చెలరేగిన విలియమ్సన్
తర్వాత వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ కూడా చెలరేగి ఆడాడు. భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. ఒకవైపు మన్రో, మరోవైపు విలియమ్సన్ చెలరేగి పోవడంతో స్కోరు తుఫాన్‌ను తలపిస్తూ ముందుకు సాగింది. కాగా, కీలక ఇన్నింగ్స్ ఆడిన మన్రో 42 బంతుల్లోనే రెండు సిక్స్‌లు, మరో ఆరు ఫోర్లతో 59 పరుగులు చేసి ఔటయ్యాడు. శార్దూల్‌కు ఈ వికెట్ దక్కింది. తర్వాత వచ్చిన గ్రాండోమ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ వికెట్ జడేజాకు దక్కింది.

రాస్ మెరుపులు
ఈ దశలో క్రీజులోకి వచ్చిన సీనియర్ ఆటగాడు రాస్ టైలర్ విధ్వంసక బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఒకవైపు రాస్, మరోవైపు విలియమ్సన్ చెలరేగి పోవడంతో స్కోరు వేగం పుంజుకుంది. వీరిని కట్టడి చేసేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ విలియమ్సన్ 26 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, మరో నాలుగు ఫోర్లతో 51 పరుగులు సాధించాడు. ఇక, సీనియర్ ఆటగాడు రాస్ చివరి వరకు జోరును కొనసాగించాడు. చెలరేగి ఆడిన రాస్ 27 బంతుల్లోనే మూడు సిక్సర్లు, 3 ఫోర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో కివీస్ స్కోరు 203 పరుగులకు చేరింది.

స్కోరు బోర్డు

న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ (సి) రోహిత్ (బి) శివమ్ దూబే 30, కొలిన్ మన్రో (సి) చాహల్ (బి) శార్ధూల్ ఠాకూర్ 59, కేన్ విలియమ్సన్ (సి) కోహ్లి (బి) చాహల్ 51, గ్రాండోమ్ (సి) శివమ్ (బి) రవీంద్ర జడేజా 0, రాస్ టైలర్ నాటౌట్ 54, టిమ్ సిఫర్ట్ (సి) శ్రేయస్ (బి) బుమ్రా 1, మిఛెల్ సాంట్నర్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు 6, మొత్తం 20 ఓవర్లలో 203/5.
బౌలింగ్: జస్‌ప్రిత్ బుమ్రా 40311, శార్ధూల్ ఠాకూర్ 30411, మహ్మద్ షమి 40530, యజువేంద్ర చాహల్ 40321, శివమ్ దూబే 30241, రవీంద్ర జడేజా 20181.

భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) రాస్ (బి) సాంట్నర్ 7, లోకేశ్ రాహుల్ (సి) సౌథి (బి) ఐష్ సోధి 56, విరాట్ కోహ్లి (సి) గుప్టిల్ (బి) టిక్నర్ 45, శ్రేయస్ అయ్యర్ నాటౌట్ 58, శివమ్ దూబే (సి) సౌథి (బి) ఐష్ సోధి 13, మనీష్ పాండే నాటౌట్ 14, ఎక్స్‌ట్రాలు 11, మొత్తం 19 ఓవర్లలో 204/4.
బౌలింగ్: టిమ్ సౌథి 40480, మిఛెల్ సాంట్నర్ 40501, హామిష్ బెన్నెట్ 40360, బ్లెయిర్ టిక్నర్ 30341, ఐష్ సోధి 40362.

Team india win in T20 match