Friday, April 19, 2024

ప్రపంచ క్రికెట్‌పై టీమిండియా ముద్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రపంచ క్రికెట్‌లో తనకు ఎదురులేదనే విషయాన్ని టీమిండియా మరోసారి నిరూపించింది. సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో విజయమే దీనికి నిదర్శనం. అగ్రశ్రేణి జట్లలో ఒకటిగా పేరున్న ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తొలి రెండు మ్యాచుల్లో భారత్ సునాయాస విజయాలను అందుకుంది. అయితే మూడో మ్యాచ్‌లో మాత్రం టీమిండియాకు చుక్కెదురైంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకుంది. కానీ చివరి మ్యాచ్‌లో భారత్ మళ్లీ పుంజుకుంది. ఈ టెస్టును డ్రాగా ముగించడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇదే క్రమంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు కూడా అర్హత సాధించింది. సమకాలిన క్రికెట్‌లో ఆస్ట్రేలియా చాలా బలమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సొంత గడ్డపైనే కాకుండా విదేశాల్లో కూడా వరుస విజయాలు సాధించడం ఆస్ట్రేలియా అలవాటుగా మార్చుకుంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, పాకిస్థాన్ వంటి జట్లను వారి సొంత గడ్డపై అలవోకగా ఓడించిన ఘనత ఆస్ట్రేలియాకు ఉంది.

కానీ భారత గడ్డపై మాత్రం కంగారూలు అలాంటి సంప్రదాయాన్ని కొనసాగించలేక పోయారు. తొలి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడడంతో సిరీస్‌ను డ్రా చేయడం తప్పించి మరో మార్గం లేకుండా పోయింది. ఇలాంటి స్థితిలో ఇండోర్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అనూహ్యంగా పుంజుకుంది. మొదటి రెండు మ్యాచుల్లో అలవోక విజయాలు అందుకుని జోరు మీదున్న టీమిండియాను చిత్తుగా ఓడించి తాను ఎంత ప్రమాదకర జట్టో ఆస్ట్రేలియా మరోసారి చాటింది. ఈ టెస్టులో కనీసం భారత్‌కు గట్టిపోటీనైనా ఇస్తుందా అని భావించిన ఆస్ట్రేలియా ఏకంగా మ్యాచ్‌ను సొంత చేసుకుని పెను ప్రకంపనలు సృష్టించింది. అంతేగాక హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని భావించిన భారత్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అయితే కీలకమైన నాలుగో మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఆస్ట్రేలియాకు సిరీస్‌ను సమం చేసే అవకాశం లేకుండా పోయింది. తొలి మూడు మ్యాచులు సగం రోజుల్లోనే ముగియగా ఆఖరి టెస్టు మాత్రం చివరి రోజు వరకు కొనసాగింది. ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు. ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా, ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌లు శతకాలతో అలరించారు. భారత జట్టులో ఓపెనర్ శుభ్‌మన్‌తో పాటు డాషింగ్ బ్యాటర్ విరాట్ కోహ్లి కళ్లు చెదిరే శతకాలను సాధించారు. దీంతో భారత్ ఆస్ట్రేలియాకు దీటైన జవాబిచ్చింది. ఇక అహ్మదాబాద్ పిచ్ బౌలర్లకు ఏమాత్రం సహకరించక పోవడంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది.

స్పిన్నర్ల హవా

ఇక ఈ సిరీస్‌లో ఇరు జట్లకు చెందిన స్పిన్నర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. భారత తరఫున రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు అసాధారణ బౌలింగ్‌ను కనబరిచారు. మరోవైపు అక్షర్ పటేల్ కూడా ఇటు బ్యాట్‌తో అటు బంతితో రాణించి తనవంతు పాత్ర పోషించాడు. ఇక భారత్ విజయాల్లో అశ్విన్, జడేజాల పాత్ర చాలా కీలకమని చెప్పక తప్పదు. తొలి రెండు టెస్టుల్లో వీరిద్దరూ అసాధారణ బౌలింగ్‌ను కనబరిచారు. వీరి ధాటికి తట్టుకోలేక తొలి రెండు మ్యాచుల్లో ఆస్ట్రేలియా ఘోర పరాజయాలను చవిచూడాల్సింది. మరోవైపు ఆస్ట్రేలియా స్పిన్నర్లు కుహ్నెమన్, నాథన్ లియాన్, మర్ఫిలు కూడా అద్భుతంగా రాణించారు. మూడో టెస్టులో నాథన్ లియాన్ అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయాన్ని సాధించి పెట్టాడు. ఇక కుహ్నెమన్, మర్ఫిలు కూడా అంచనాలకు మించి రాణించడం విశేషం. ఇలా ఇరు జట్లకు చెందిన స్పిన్నర్లు సిరీస్‌లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News