Home తాజా వార్తలు అతిపెద్ద టెక్ సంస్థలకు సిఇఒలుగా భారతీయులు

అతిపెద్ద టెక్ సంస్థలకు సిఇఒలుగా భారతీయులు

Tech companies being headed by Indian-origin ceos

 

న్యూఢిల్లీ : ట్విట్టర్ సిఇఒ(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా పరాగ్ అగర్వాల్‌ను నియమించిన తర్వాత మళ్లీ భారత సంతతికి చెందిన టెక్ సిఇఒల గురించి చర్చ మొదలైంది. 37 ఏళ్ల పరాగ్ ఇప్పుడు ప్రపంచంలోని టాప్ 500 కంపెనీల్లో అతి పిన్న వయస్కుడైన సిఇఒగా అవతరించారు. మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాదెళ్ల, గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ నుంచి పరాగ్ వరకు భారతీయులు టెక్ సంస్థలకు నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచ స్థాయి అతిపెద్ద టెక్ సంస్థలకు భారతీయుల నాయకత్వం వహించడం పట్ల దేశం ఎంతో గర్విస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పేరు మారుమ్రోగేలా చేసిన ఏడుగురు భారతీయుల గురించి తెలుసుకుందాం.

సత్య నాదెళ్ల
మొదటగా చెప్పుకోవాల్సిన వ్యక్తి సత్యనాదెళ్ల (54), ఆయన ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 1967 ఆగస్టు 19న హైదరాబాద్‌లో జన్మించిన నాదెళ్ల 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సిఇఒగా బాధ్యతలు చేపట్టారు. మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ చేశారు. 1992లో ఆయన మైక్రోసాఫ్ట్‌లో విండో ఎన్‌టి ఆపరేటింగ్ సిస్టమ్ డెవలపర్‌గా సేవలను ప్రారంభించారు. సత్య నాదెళ్ల నికర విలువ 2,527 బిలియన్ డాలర్లుగా ఉంది.

సుందర్ పిచాయ్
గూగుల్ గురించి తెలియని వారు ఉండరు. అటువంటి దిగ్గజ సంస్థకు సుందర్ పిచాయ్ నాయకత్వం వహిస్తున్నారు. 2019 సంవత్సరం నుండి గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సిఇఒగా సేవలందిస్తున్నారు. చెన్నైలో జన్మించిన సుందర్ పిచాయ్ 2014లో గూగుల్ హెడ్‌గా మారారు. 49 ఏళ్ల పిచాయ్ 1972 జూన్ 10న తమిళనాడులోని మధురైలో జన్మించారు. అతను ఐఐటి ఖరగ్‌పూర్, కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదివారు. ప్రస్తుతం ఆయన నికర విలువ 1924 బిలియన్ డాలర్లుగా ఉంది.

శంతను నారాయణ్
2007 నుండి అడోబ్ సంస్థ సిఇఒ, చైర్మన్‌గా శంతను నారాయణ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన 1963 మే 27న హైదరాబాద్‌లో జన్మించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీని పొందిన నారాయణ్, బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎంబిఎ చదివారు. అడోబ్‌లో చేరడానికి ముందు ఆయన యాపిల్‌లో పనిచేశారు. 58 ఏళ్ల శాంతను నికర విలువ 325 బిలియన్ డాలర్లుగా ఉంది.

అరవింద్ కృష్ణ
అరవింద్ కృష్ణ 2020 సంవత్సరం నుండి ఐబిఎం సిఇఒగా సేవలందిస్తున్నారు. దాదాపు 30 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నారు. ఐఐటి కాన్పూర్ నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత ఆయన ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పిహెచ్‌డి చేశారు. అరవింద్ కృష్ణ 1962లో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరిలో జన్మించారు. 59 ఏళ్ల అరవింద్ కృష్ణ నికర విలువ 106 బిలియన్ డాలర్లుగా ఉంది.

నికేశ్ అరోరా
నికేశ్ అరోరా(53) జూన్ 2018 నుండి పాలో ఆల్టో నెట్‌వర్క్‌కు సిఇఒగా ఉన్నారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జన్మించారు. గూగుల్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అరోరా జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ సిఇఒగా బాధ్యతలు చేపట్టారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు), బోస్టన్ కాలేజ్, ఈశాన్య విశ్వవిద్యాలయంలో ఆయన చదివారు. ఆయన నికర విలువ 54 బిలియన్ డాలర్లుగా ఉంది.

సంజయ్ మెహ్రోత్రా
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో జన్మించిన సంజయ్ మెహ్రోత్రా మైక్రో టెక్నాలజీ సిఇఒగా ఉన్నారు. ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చదివారు. ఆయన శాన్‌డిస్క్ సిఇఒగా కూడా చేశారు. సంజయ్ మెహ్రోత్రా నికర విలువ 95 బిలియన్ డాలర్లుగా ఉంది.

పరాగ్ అగర్వాల్
ట్విటర్ సిఇఒగా నియమితులైన పరాగ్ అగర్వాల్‌కు 10 ఏళ్లుగా ఆ కంపెనీలో సేవలందిస్తున్నారు. ట్విట్టర్‌లో చేరక ముందు ఆయన మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, యాహూతో కలిసి పనిచేశారు. ఐఐటి బాంబే నుంచి పట్టభద్రుడైన పరాగ్ అగర్వాల్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా పొందారు. 37 ఏళ్ల పరాగ్ అగర్వాల్ నికర విలువ 38.5 బిలియన్ డాలర్లుగా ఉంది.

Tech companies being headed by Indian-origin CEOs