Home ఎడిటోరియల్ ఇంటర్ లొల్లికి అవుతలి రోకు..

ఇంటర్ లొల్లికి అవుతలి రోకు..

Technical role in intermediate exam management

 

ముదిరిన కాన్సర్‌ను కొన్నిసార్లు ముట్టుకుంటే రిస్కు. అయి నా ధైర్యంతో శస్త్రచికిత్స చేసి శాశ్వతంగా నిర్మూలించవచ్చు. అదే విధానంలో వలస పాలనలో తెలంగాణలో రోగగ్రస్తమైన విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, తదితర ప్రజా సంక్షేమం అభివృద్ధి రంగాలకు స్వయం పాలన అనే ఆపరేషన్ థియేటర్‌లో సిఎం కెసిఆర్ అనే సర్జన్ పర్యవేక్షణలో ఆపరేషన్ జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డంక వొక్కొక్క రంగాన్నే తీసుకుని రిస్కుతో చేపట్టిన శస్త్ర చికిత్సలు వొక్కొక్కటిగా విజయవంతమైతున్నవి. బంగారు బాతుగా మారిన ఇంటరు బోర్డులో సమూల మార్పులను ఓర్చుకోలేని కొన్ని పరాన్నబుక్కులు కుట్రలకు తెరలేపినయి. వారి కుట్ర కోణాన్ని అర్థం చేసుకోవడానికి వొకసారి ఈ వ్యవహారం లోతుల్లోంచి మూల్యాంకనం చేయవలసి వున్నది.

ఇంటర్మీడియెట్ పరీక్షా విధానం
పరీక్ష ఫీజు తీసుకోవడం, విద్యార్థికి హాల్‌టికెట్ నెంబర్‌ను కేటాయించడం, వారికి పరీక్ష సెంటర్‌ను నిర్ధారించడం, వీరికి ఇన్విజిలేటర్లు కేటాయించడం, ప్రశ్న పత్రాలను తయారు చేయడం, జవాబు పత్రాలను తయారీ (ఆన్సర్ షీట్లు) చేసి వాటి మీద బార్ కోడ్‌లను, హాల్ టిక్కెట్లను ముద్రించడం వాటికి నెంబర్లను కేటాయించడం, సమాధానాలు రాసే పత్రాలు వాటికి బార్ కోడ్లు కేటాయించడం వంటి కీలకమైన సాంకేతికమైన గోప్యతతో నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఇంటర్మీడియెట్ బోర్డు చేపడుతుంది. ఈ మొత్తం వ్యవస్థలో అత్యం త కీలకమైనది హాల్ టికెట్ నెంబర్‌కు ఆన్సర్ షీట్ మీది బార్ కోడ్‌ను అనుసంధానం చేస్తూ ఎన్ క్రిఫ్టెడ్ (encrypted) లింక్ కోడ్‌లను ఏర్పాటు చేసుకోవడం. ఈ లింక్ కోడ్ వ్యవహారమే అత్యంత కీలకం… దీన్ని మనం ముందు ముందు తెలుసుకుందాం. అయితే…పైన తెలిపిన విధులతో పాటు పరీక్షల నిర్వహణ అనంతరం ఆన్సర్ షీట్ల ను భద్రపరచడం, ఆ తర్వాత వాటిని మూల్యాంకనం చేయడం, మార్కులను క్రోడీకరించి రహస్యంగా భద్రపరచడం, వంటి పలు సాంకేతిక వ్యవహారాలు, గోప్యత భద్రత బాధ్యతతో కూడిన కార్యాచరణ, దాదాపు తొమ్మిది లక్షల మంది దాకా విద్యార్థిని విద్యార్థులు పాల్గొనే ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణలో వుంటుం ది.

పరీక్షల నిర్వహణలో సాంకేతిక పాత్ర
సాంకేతికాభివృద్ధి సురువైన 1990 నుంచి నేటి వరకు పలు రకాల పరీక్షల నిర్వహణలో కంప్యూటర్ల వాడకం వాటి సేవల వినియోగం పెరిగింది. ఇంటర్మీడియెటే కాదు ఉద్యోగాల కోసం రాసే పరీక్షలతో సహా ప్రయివేట్ ఏజేన్సీలే నిర్వహిస్తున్నవి. అందుకు గాను టెండర్ వేస్తరు. టెండర్ ఖాయం కాకముందు ఈ ఏజెన్సీలకు కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి ఏమిటంటే, ముందు తాము నిర్వర్తించబోయే పనికి సంబంధించి అందులో చోటుచేసుకునే సాంకేతిక అంశాలకు మొత్తం అగ్రిమెంటులో కీలక పాత్ర పోషించేది ఈ సాంకేతిక తనిఖీ అనే ఆడిట్ రిపోర్టే. సంబంధించి ఈ ఆడిటింగ్ రిపోర్టు మీదనే ఆధారపడినడుస్తది.

ఆడిటింగ్ అంటే ?
ప్రభుత్వం గుర్తింపు పొందిన గోల్డ్ స్మిత్ (అవుసలాయన) కాడికి పోయి ఇది వొరిజనల్ బంగారమే.. అనే సర్టిపికేట్ తీసుకోని బ్యాంకులోన్ తీసుకోవడం లాంటిదనమాట. ఫలానా సంస్థకు చెందిన సాఫ్ట్ట్‌వేర్‌ను మీము పరిశీలించినం. దాని ప్రకారం పరీక్ష నిర్వహణలకు కావాలసిన అన్ని తీర్ల ఏర్పాట్లను నిర్వర్తించే శక్తి, నాణ్యతతో కూడిన గోప్యత కలిగిన అన్నితీర్ల సాంకేతిక విధానాలను ఈ సంస్థ అనుసరించగలదని మా పరిశీలనలో తేలింది అని అవుసలి అప్పయ్య లాంటి వొక ప్రభుత్వ గుర్తింపు పొందిన స్వతంత్ర ఆడిట్ సంస్థ ఇచ్చిన ఆడిట్ రిపోర్టు సర్టిపికేట్‌ను ప్రభుత్వ కంట్రాక్టు ఒప్పందంలో జతపరచాల్సి వుంటది. దానిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే సదరు ప్రయివేట్ ఏజెన్సీకి పరీక్షల నిర్వహణా అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం జరుగుతది. ఇదీ స్థూలంగా పరీక్షా విధానపు తనిఖీ పద్ధతి .

జవాబు పత్రాల గోప్యత దశాబ్దాలుగా ఏజెన్సీల తంతు
పేపరు దిద్దే ప్రక్రియ కింది నుంచి మీది దాకా నాలుగు అంచెల్లో పరిశీలన జరుగుతుంది. ఆన్సర్ షీట్ ఫలానా వారిది అని తెలువకుండా వుండేందుకు మూల్యాంకనం సందర్భంగా ఆన్సర్ షీట్లోని హాలు టికెట్ నెంబర్‌ను చించి వేస్తరు. వొక ఆన్సర్ షీట్‌కు సంబంధించి ఎ, బి, సి అని మూడు భాగాలుగా విడిపోయి పేపర్ దిద్దినంక బార్ కోడ్ ద్వారా అన్నీ వొకకాడ కలుస్తయి. ఇదంతా గోప్యత కోసమే. ఆయితే, పేపర్ దిద్దినంక.. ఈ బార్ కోడ్ ను డికోడిఫై చేసి ఆన్సర్ షీట్ ఏ హాల్ టికెట్ నెంబర్‌దో తెలుసుకునేందుకు వొక ఎన్‌క్రిప్టెడ్ ఫైల్ ఉంటుంది. ఈ లింక్‌ను తెలిపే ఫైల్ అత్యంత సీక్రెట్ గా మెయింటేన్ చేయాల్సి వుంటుంది. ఎందుకంటే ఇది తెలిస్తే హాల్ టికెట్ నెంబర్లు తెలుస్తయి. హాల్ టికెట్ల నెంబర్లు తెలుసుకుంటే పేపర్లు దిద్దే వారికి, అటు తర్వాత కంప్యూటర్లకు మార్కు లు ఎక్కించే కాన్నించి లబ్ది చేకూర్చవచ్చు. అందికే ఈ సీక్రెట్ ఎన్క్రిప్టెడ్ (encrypted file) ఫైల్ ఇంటర్మీడియెట్ బోర్డు సెక్రెటరీ దగ్గర వుంటుంది.

కానీ వారేం చేస్తున్నరు. (వలస పాలనలో దశాబ్దాలుగా నడుస్తున్న తంతు ఇది.) కాంట్రాక్టు తీసుకున్న సంస్థకు సదరు సీక్రెట్ ను అప్పజెప్తున్నరు. ఇగ అక్కడి నుంచి మొదలయితున్నది అసలు కత. అట్లా యూనియన్ నాయకుల నుంచి అటు ఇంటర్మీడియెట్ బోర్డు అధికారుల దాకా, ప్రయివేట్ ఏజెన్సీలను కొనుక్కోవడం నుంచి పరీక్ష పత్రాలను దిద్దే టోల్లదాకా కోట్లాది రూపాయలను పంచుకుంటూ తమ తమ కార్పొరేట్ కాలేజీల విద్యార్ధులకు వందకు వంద మార్కులు వేయించుకుంటూ ర్యాంకులను ప్రకటించుకుంటూ వస్తున్నరు. అంద రూ అట్లనే పాసయితున్నరు అని అనలేము కానీ.., వొకటి రొండు మూడు ర్యాంకులంటూ టివిలల్ల గట్టిగ వొర్లుకుంటూ చూయించుకునే కార్పొరేట్ కాలేజీల ప్రతాపం వెనుక మాత్రం పెద్ద కతేవున్నది మాత్రం అర్థమయితున్నది.

ఇట్లా గత దశాబ్దాలుగా ఇంటర్మీడియెట్ బోర్డులో వేల్లూనుకున్న అవినీతి బాగోతానికి.. తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తూ వస్తున్నది. ఆ క్రమంలో ఇన్నాల్లుగా నడిపిస్తున్న మాగ్నెటిక్ అనే సంస్థ స్థానంలో గ్లోబరీనా అనే సంస్థ సదరు కాంట్రాక్టు తీసుకున్నది. దీంతో వలస పాలన నుంచి నేటి దాక తమ అప్రతిహత హవాను నడిపిస్తున్న కార్పొరేట్ కాలేజీల నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. ఇంటర్మీడియట్ యూనియన్ లీడర్ల నుంచి అన్ని స్థాయిల వారి అక్రమాలకు అడ్డుకట్ట పడింది. దాంతో బంగారు బాతు లాంటి ఏజెన్సీ తమ నుంచి పోయే సరికి కొత్తగా వచ్చిన గ్లోబరీనా సంస్థ మీద దుష్ప్రచారం చేయాలనే నిర్ణయానికి వచ్చినయి కార్పొరేట్ కాలేజీలు వారి ద్వారా లబ్ధిపొందే కొన్ని వేల్లూనుకున్న వ్యవస్థలు.

గ్లోబరీనా తప్పేంటి.?
పరీక్షా నిర్వహరణలో గ్లోబరీనా టెండర్ దక్కించుకున్నది. అయితే కొన్ని తప్పులు దొర్లిన మాట వాస్తవమే అంటున్నరు నిపుణులు. దొర్లిన తప్పులేమిటంటే.. వొక్క విద్యార్థికే వొకటికంటే ఎక్కువ హాల్ టికెట్లు మంజూరు చేయడం, తద్వారా విద్యార్థులు వొక్కహాల్ టికెట్ తోనేకాకుండా ఇంకో హాల్ టికెట్ నెంబర్‌తో పరీక్షరాయడం తత్ఫలితంగా భిన్నమైన రిజల్టు రావడం…ఇదంతా విద్యార్థులను అయోమయానికి గురి చేసింది. దాదాపు 550 మంది జియోగ్రఫీ విద్యార్థులకు డేటా ఎంట్రీ లో పొరపాట్ల వల్ల మార్కులు పడకపోవడం., జంబ్లింగయిన పేపర్లను వొక్క దగ్గరికి చేర్చి సరిచూసుకోవడంలో వో ఇరవై మందికి ఫలితాల్లో తేడాలు రావడం, ఇటువంటి పొరపాట్లు దొర్లినయి. అంతేకాకుండా ఇంటర్మీడియెట్ బోర్డు నిర్లక్ష్యం కూడా కొంత తోడయింది. అదేంటంటే… పొరపాట్లు దొర్లిన సంగతిని ముందే పసిగట్టిన అధికారులు వాటిని తమ వెబ్‌సైట్లో మార్చిన్రు కానీ ., మీడియాకిచ్చిన సిడీలల్లో మార్చలేదు. దాంతో ఎక్కువగా మీడియా వ్బ్సైట్లలో రిజల్టు చూసుకున్న విద్యార్థులు తప్పుడు సమాచారానికి గురయ్యిన్రు. నాలుగు రోజుల వ్యవధిలో గుర్తుపట్టి సవరించేసరికి అప్పటికే కాలాతీతమైంది. అయితే, అదే అదునుగా కాచుకున్న అవకాశవాదులకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టయ్యింది.

ఆత్మహత్యలకు ఎవరు బాధ్యులు?
దురదృష్టవశాత్తూ,, పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులు మానసిక దుర్బలత్వంతో పలు రకాల వత్తిల్లకు గురయి ఆత్మహత్యలు చేసుకుంటరు. ఇది ప్రతి ఫలితాల ముందు జరుగుతున్న బాధాకారమైన ఘట్టం. ఇగ దీన్ని గ్లోబరీనా మీద పెట్టితోసిన్రు. అయితే… ఈ వ్యవహారం మీద ప్రభుత్వం వో కమిటీ వేసి నిజానిజాలు నిర్ధారించాలని ఆదేశించిన మేరకు వాల్లు వో రిపోర్టు ఇచ్చిన్రు. ఆమేరకు ముందుగాల ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల ఆన్సర్ షీట్లను తిరిగి మూల్యాంకనం చేసిండ్రు. అయినా మొదటి సారి వచ్చినన్ని మార్కులే వచ్చినయి. తద్వారా పిల్లల ఆత్మహత్యలకు గ్లోబరీనా చేసిందనే ఆరోపణలను ఎదుర్కొంటున్న తప్పులకు సంబంధం లేదని తేలింది. ఇదీ.. అసలు సంగతి. అమృతం సాధించాలని దేవతాసురులు కలసి చేసిన క్షీర సాగర మధనం సందర్భంగా కాలకూట విషం సహా అనేక వ్యర్ధాలే ముందుగాల వచ్చినట్టు., ఇంటర్మీడియట్ బోర్డు లొల్లిని కూడా అట్లనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ప్రక్షాళన ప్రారంభ దశలో కొం చెం ఇబ్బందులు తలెత్తుతయి.

ఆ తర్వాత అన్నీ దారికొచ్చి అసలైన గుణాత్మక మార్పు ప్రారంభమైతది. అయిదేండ్లు అయితాంది ఇంకెన్నాల్లు అని మాట్లాడే వాల్లకు క్షేత్రస్థాయి అవగాహనలేదని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. భూమి రికార్డులను ప్రక్షాళన చేయాలంటే రెవిన్యూ అధికారులతోని ఎంత తిప్పలయితాందో రోజూ మోగుతున్న ధర్మగంటలే సాక్ష్యం. తెలంగాణను బంగారి తెలంగాణగా తీర్చిదిద్దేందుకు…అట్లా వొక్కో శాఖను ప్రక్షాళన చేసుకుంటూ సమూల మార్పులకు గురిచేసి గుణాత్మక అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రభుత్వాన్ని పలుచన చేయాల్నని కుట్రలు కుతంత్రాలు పన్నుతున్న వారిని తెలంగాణ సమాజం వో కంటకనిపెట్టుకుంటూ వుండాలె. ఇటువంటి కీలక సందర్భంలో తలెత్తే పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూనే ముఖ్యమంత్రి మాన్యు లు కెసిఆర్‌కు అటు ప్రజలు ఇటు అధికారవర్గం అండగా వుండాలె. బంగారి తెలంగాణ సాధనలో ఇది చారిత్రక సందర్భం.

Technical role in intermediate exam management