Home జాతీయ వార్తలు టెక్నాలజీతో అవినీతికి చెక్

టెక్నాలజీతో అవినీతికి చెక్

భారత్‌లో అవినీతి గణనీయంగా తగ్గుతోంది
దీనికి రైల్వే టికెటింగ్, పన్ను విభాగాలే ఉదాహరణ
ఆర్‌బిఐ గవర్నర్ రఘురాం రాజన్

లండన్: భారత్‌లో అవినీతి తRAGHUగ్గుముఖం పడుతోందని, దీనిలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో దోహదం చేస్తుందని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు అవినీతి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, అభివృద్ధి చెందిన దేశాల నుంచి అక్రమంగా డబ్బును లండన్ వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారని, ఇటువంటి విషయాలను గుర్తించాలని సూచించారు. భారత్‌లో ఇప్పటికీ అవినీతి పెద్ద సమస్యగా ఉందనే ప్రశ్నపై రాజన్ స్పందిస్తూ, వ్యవస్థలో ప్రధానమైన పన్ను విధానాన్ని సరిచేస్తే ఆర్థిక వృద్ధి చోటుచేసుకుంటుందని, భారత్‌లో అవినీతి సమస్య గణనీయంగా తగ్గుముఖం పడుతోందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అవినీతిని తగ్గించడంలో దోహదం చేస్తుందని, దీనికి రైల్వే టికెటింగ్, పన్ను విభాగం యంత్రాంగాలే ఉదాహరణ అని అన్నారు. రైల్వే టికెటింగ్‌లో టెక్నాలజీ వల్ల విక్రయాల్లో అవినీతికి తగ్గిందని, ఆదాయం పన్ను విభాగం కూడా సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా నడుస్తోందని అన్నారు. పన్ను రిటర్న్ కోసం ఆదాయం పన్ను ఇన్‌స్పెక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, అమెరికాలో కంటే భారత్‌లో సులభంగా ఆదాయం పన్నును దాఖలు చేయొచ్చని రాజన్ ఇక్కడ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వద్ద చర్చలో రాజన్ అన్నారు. భారత్‌లో అవినీతి సమస్యను ఎదుర్కొనేందుకు పటిష్ఠమైన వ్యవస్థ ఉందని అన్నారు. తమ దేశంలో మీడియాకు స్వేచ్ఛ ఉంది, ఇది అవినీతిని వెలికితీస్తుందని, అలాగే ఒప్పందాలు, కేటాయింపుల్లో పారదర్శకత పెరిగేందుకు ప్రభుత్వం కూడా అనేక చర్యలు చేపట్టిందని రాజన్ పేర్కొన్నారు. కొద్ది సంవత్సరాలుగా అవినీతికి వ్యతిరేకంగా చర్యలు వేగవంతమవుతున్నాయని, గతంలో కంటే ఇప్పుడు పరిస్థితి మెరుగ్గా ఉందని, పూర్తి స్థాయిలో అవినీతి నిర్మూలన చేపట్టాల్సి ఉందని అన్నారు. అవినీతి సమస్యను పూర్తిగా పరిష్కరించిన దేశాల్లో సింగపూర్ వంటి కొన్ని ఉన్నాయని, కానీ ఈ సమస్యపై పోరాటం అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రారంభం కాలేదు, ముగియలేదని అన్నారు.
రెండు రోజుల క్రితం బ్రిటన్‌లో కేంబ్రిడ్జి యూనివర్శిటీలోనూ పలు అంశాలపై రాజన్ ప్రసంగించారు. కొన్ని రంగాలకు ప్రత్యేకించి రాయితీలు వంటి ప్రోత్సాహకాలు అందివ్వడాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకించారు. ఏ పరిశ్రమనైనా ప్రోత్సహించే ప్రయత్నం చేశారంటే అది ఖచ్చితంగా వాటిని చంపడమేనని, స్వతంత్రంగా వృద్ధి చెందేందుకు పరిశ్రమలకు అవకాశం ఇవ్వాలన్నారు. ఎలా వ్యాపారం చేయాలో శాసించడాన్ని విధానకర్తలు మానుకోవాలంటూ రాజన్ సూచించారు. వస్తువుల ఎగుమతులను బలోపేతం చేయడానికి రూపాయి విలువను తగ్గించాలంటూ పరిశ్రమ సంఘాలు తరచూ అధికార యంత్రాంగాలకు డిమాండ్ చేయడాన్ని కూడా ఆయన సరైంది కాదన్నారు. దేశీయ వ్యాపారానికి అనుగుణంగా కరెన్సీ విలువను అవసరాలకు తగ్గట్టుగా తగ్గించుకునేది కాదని అన్నారు. వృద్ధి పథాన నడిచేందుకు ఆర్థిక స్థిరత్వం కోసం భారత్ ప్రయత్నాలు చేస్తోందని, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ధరలు పడిపోవడం వల్ల అనేక దేశాల కమోడిటీ ఎగుమతులు దెబ్బతిన్నాయని. ఇటీవల ఇండియా వస్తు ఎగుమతులు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే దారుణంగా మారాయని రాజన్ అన్నారు. అదే సమయంలో భారత్ సేవల ఎగుమతులు మెరుగ్గా ఉన్నాయని, బహుశా అమెరికా నుంచి డిమాండ్ ఉండడం వల్లే అయివుంటుందని అన్నారు. దిర్ఘకాలిక పెట్టుబడుల రాకపై ఆర్‌బిఐ దృష్టి పెట్టిందని, రూపాయి వర్సెస్ ఇతర కరెన్సీల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని రాజన్ వివరించారు.