Wednesday, April 24, 2024

జనాభా ప్రాతిపదిక కోటా!

- Advertisement -
- Advertisement -

Tejaswi Yadav promises 10 lakh Government jobs

 

బీహార్ ఎన్నికలలో నాయకుల వాగ్దానాలు నిద్రాణంగా ఉన్న అంశాలను సైతం చర్చకు తీసుకు వస్తున్నాయి. కేవలం కులాల ప్రాతిపదికగా ఓటు వేయడానికే అలవాటుపడిపోయిన ఆ రాష్ట్రంలో ఈసారి నిరుద్యోగం, వలస కార్మికుల వ్యథలు, వరద బాధితుల కష్టాలు వంటివి ప్రముఖంగా ప్రస్తావనకు రావడం, అవి ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించడం ఒక మంచి పరిణామమనే అభిప్రాయం కలిగింది. ముఖ్యంగా మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్‌జెడి అధినేత, యువ నేత తేజస్వి యాదవ్ 10 లక్షల ప్రభుత్వోద్యోగాల వాగ్దానం ఓటర్లను విశేషంగా ప్రభావితం చేసిందంటున్నారు. అంత మందికి జీతాలు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తావు అని ఎదురు ప్రశ్నించడం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రతిష్ఠను దెబ్బ తీసిందనే అభిప్రాయం చోటు చేసుకున్నది. ఆ నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో ఆయన తాజాగా సంధించిన జనాభా ప్రాతిపదిక కుల రిజర్వేషన్లు అణగారిన వర్గాల్లో చిరకాలంగా ఉన్న ఆకాంక్షను తిరిగి రగిలిస్తుంది. పశ్చిమ చంపారణ్ జిల్లా వాల్మీకి నగర్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచార సభలో నితీశ్ కుమార్ గురువారం నాడు మాట్లాడుతూ ఈ ప్రస్తావన తెచ్చారు.

ఇది ఒకే కూటమి భాగస్వామ్య పక్షాలైన బిజెపి, జెడి(యు)ల మధ్య దూరాన్ని మరోసారి రుజువు చేసింది. బిజెపి అభిప్రాయం నితీశ్ కుమార్ ప్రతిపాదనకు భిన్నంగా ఉంది. తమ పార్టీ రిజర్వేషన్లను సమర్థిస్తుందిగాని రాజ్యాంగ విరుద్ధంగా మాత్రం వ్యవహరించబోదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లు షెడ్యూల్డ్ కులాలు, తెగలకు మాత్రమే వారి జనాభా ప్రాతిపదికన కోటాకు అవకాశమిస్తున్నాయి. 330, 332 అధికరణలు రాష్ట్రాల అసెంబ్లీలలో, పార్లమెంటులో ఎస్‌సి, ఎస్‌టిలకు జనాభా ఆధారంగా కోటాను కల్పిస్తున్నాయి. కాని ఇతర వెనుకబడిన తరగతులకు జనాభాపరమైన రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగం అంగీకరించదు. రవి శంకర్ ప్రసాద్ ప్రకటన ఆంతర్యం ఇదేనని బోధపడుతున్నది. నితీశ్ కుమార్ జనాభా ఆధార కోటా ప్రతిపాదనను వివరిస్తూ దేశంలో తాజా జన గణన జరిగిన తర్వాతే దానిని అమలు చేయడం సాధ్యమవుతుందన్నారు.

అంతేకాదు కులాల వారీ జనాభా లెక్కల సేకరణ చేస్తే తప్ప అది సాధ్యం కాదు. ఈ ఏడాది జరగవలసిన జనాభా గణనను కరోనా కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జన సంఖ్య ఆధారంగా కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలన్నది తన అభిమతమని అది అమలు కావడమనేది కేంద్రం జనాభా లెక్కలు సేకరించడంపై ఆధారపడి ఉంటుందన్నది నితీశ్ కుమార్ అభిప్రాయం. అన్ని రకాల రిజర్వేషన్లు కలిసి 50 శాతం మించరాదని 1993లో 9 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన హద్దు రేఖ గీసింది. చట్టం ముందు అందరూ సమానులే, కుల మతాది ప్రాతిపదికలపై విచక్షణ చూపరాదన్న మౌలిక సూత్రం ప్రకారం మెజారిటీ సీట్లను రిజర్వేషన్ల కింద కేటాయించరాదన్న అభిప్రాయంతో ఈ హద్దు ఊడిపడింది. దీని కారణంగానే ఇతర వెనుకబడిన తరగతుల కోటాను వారి జనాభా దామాషా ప్రకారం కాకుండా 27 శాతానికి, అంతకు తక్కువకు పరిమితం చేశారు. శారీరక లోపాలున్నవారు మున్నగు ఇతర బలహీన వర్గాల కోటాను కూడా కలుపుకుంటే 50 శాతం హద్దుకు పరిమితమై ఉంటుంది.

ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రాజ్యాంగ సవరణ ద్వారా కేటాయించిన 10 శాతం రిజర్వేషన్ల వల్ల ఈ హద్దు చెరిగిపోతుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడవలసి ఉంది. తమిళనాడు మొత్తంగా 69 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నది. వాటికి రాజ్యాంగం తొమ్మిదవ షెడ్యూలు రక్షా కవచాన్ని తొడిగించింది. రాజస్థాన్‌లో గుజ్జర్లకు, మహారాష్ట్రలో మరాఠాలకు కల్పించిన రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుంటే ఆ రాష్ట్రాలలో కోటా 50 శాతం మించిపోతుంది. హర్యానా కూడా జాట్లకు మరి 5 కులాలకు 10 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వారికి మరి 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో అక్కడ కోటా 67 శాతానికి చేరుకున్నది.

బిసిలు జనాభాలో అధిక సంఖ్యలో గల చత్తీస్‌గఢ్ కోటాను పెంచి 72 శాతానికి చేర్చింది. బీహార్‌లో కూడా అణగారిన కులాల జనాభా అధికంగా ఉంది. జన సంఖ్య ప్రాతిపదిక కులాల కోటా అనేది అక్కడి బిసిలకు ఊహించని వరమవుతుంది. వారి ఓట్లపై దృష్టితోనే నితీశ్ కుమార్ ఈ అంశాన్ని బయటకు తీసి వాగ్దాన బాణాన్ని సంధించారు. వాల్మీకి నగర్ లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా ఆయన ఈ హామీని ఇచ్చినప్పటికీ అది సహజంగానే ప్రస్తుతం జరుగుతున్న బీహార్ శాసన సభ ఎన్నికల ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇది మళ్లీ అక్కడి ఎన్నికలకు సామాజిక న్యాయ కోణాన్ని చేరుస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News