Home లైఫ్ స్టైల్ ఒలింపిక్సే నా లక్ష్యం

ఒలింపిక్సే నా లక్ష్యం

Tejavath Sukanya Bhai Olympics is my goal

ఆమె వయస్సు 23 ఏళ్లే. కాని నూట ఎనభై కిలోలు అలవోకగా ఎత్తగలదు. పుట్టింది మారుమూల జగ్గా తండా. అందరిలాగే 18 ఏళ్లకే తల్లిదండ్రులు పెళ్లి చేస్తాం అన్నారు. కాని ఆమె ఎంచుకున్న మార్గాన్ని చేరుకునే వరకూ పట్టువిడవనంటుంది. పురుషులతో పోటీ పడుతూ వెయిట్ లిఫ్టింగ్‌లో విజయాలు సాధిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మానుకోట మట్టిబిడ్డ తేజవత్ సుకన్యభాయ్ ఒలింపిక్సే నా లక్షం అంటూ సకుటుంబంతో తన ప్రస్థానాన్ని పంచుకుంది.

మాది మహబూబాబాద్ జిల్లా, మా అమ్మ బద్రి, నాన్న లక్ష్మణ్. మేము ముగ్గురం ఆడపిల్లలం. నేనే మా ఇంట్లో చిన్న అమ్మాయిని. మా నాన్న సింగరేణి కార్మికుడు. నా బాల్యం పాఠశాల చదువు మణుగూర్‌లో గడిచింది. తరువాత 2014లో డిప్లమా కోర్సుకి హైదరాబాద్ మసబ్‌ట్యాంక్ గవర్నమెంట్ కాలేజిలో సీటు వచ్చింది. అప్పుడు మా ఊరి నుండి చదువుకోసం హైదరాబాద్ వచ్చాను.

క్రీడల పట్ల ఆసక్తి ఎలా కలిగింది?
నాకు కరణం మల్ల్లేశ్వరి స్ఫూర్తి. చిన్నప్పటి నుండి ఆటల పట్ల చాలా ఇష్టం ఉండేది. నేను హైదరాబాద్ డిప్లొమా చదవడానికి వచ్చిన తర్వాత చదువుకుంటూనే కాలేజీ ఎన్‌సిసిలో చేరి ‘సి’ సర్టిఫికేట్ సాధించాను. అప్పటి నుండి ఆటలమీద ఎక్కువగా ఆసక్తి పెరిగింది.

వెయిట్ లిఫ్టర్‌గా మీ ప్రస్థానం ఎలా మొదలైంది?
నేను మా కాలేజి తరఫున వాలీబాల్ లో సీనియర్ స్థాయిలో బ్రాంచ్ మెడల్ సాధించాను. రోజూ కాలేజ్ అయిపోగానే సాయంత్రం ఎల్‌బీ స్టేడియంలో వాలీబాల్ ప్రాక్టీస్ చేసేదాన్ని. నేను వాలీబాల్ ఆడుతున్నప్పుడు అక్కడ నాకు వెయిట్‌లిఫ్టింగ్ కోచ్ వి.ఎన్. రాజశేఖర్ సార్ పరిచయం అయ్యారు. నీకు మంచి ఫిట్‌నెస్ ఉంది కానీ, నీవు ఎత్తు తక్కువ ఉన్నావు కాబట్టి వాలీబాల్ ఆడటం కంటే వెయిట్ లిఫ్టింగ్‌లో మంచిగా రాణిస్తావని చెప్పి, 2014లో నన్ను వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీలో చేర్చుకున్నారు. నేను అకాడమీలో చేరిన నెల రోజుల్లోనే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఆ పోటీల్లో నేను మెడల్ సాధించాను. అప్పటి నుండి నాలో ఉత్సాహం పెరిగి వెయిట్ లిఫ్టింగ్ ఫైట్ మొదలైంది. 2016 మే వరకు ప్రాక్టీసు బాగానే జరిగింది కానీ కోచ్ తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కు ట్రాన్స్‌ఫర్ అవడంతో ప్రాక్టీస్ సరిగ్గా లేకపోవడంతో కోచ్‌ని కలిస్తే విజయవాడ సి.బి.ఆర్ అకాడమీకి రావలిసిందిగా చెప్పారు. నాన్న సరే అనడంతో మళ్లీ నేను విజయవాడ సి.బి.ఆర్ అకాడమీలో కోచ్ వి.ఎన్.రాజశేఖర్ దగ్గర జాయిన్ అయ్యాను.

ఇప్పటి వరకూ ఎన్ని మెడల్స్ సాధించారు
* 2014 తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం వేదికగా జరిగిన మొట్టమొదటి జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించాను.
* 2015లో తార్నాకలో జరిగిన ఫస్ట్ సీనియర్ విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించాను.
* మళ్లీ అదే సంవత్సరం మహబూబ్‌నగర్ లో జరిగిన సెకండ్ సీనియర్ పోటీలో గోల్డ్‌మెడల్ వచ్చింది.
* 2016 హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో జరిగిన మూడవ సీనియర్ పోటీల్లో గోల్డ్‌మెడలిస్ట్‌ని.
* 2017 జర్మని నాగోల్డ్ వేదికగా జరిగిన 14th ఇంటర్నేషనల్ విమెన్ వెయిట్ లిఫ్టింగ్ గ్రాండ్ ప్రిక్స్ లో 6th ప్లేస్ సాధించాను .
* 2018 మే స్పెయిన్‌లోని తేనెరీఫ్ లో జరిగిన 15 ఇంటర్నేషనల్ విమెన్ వెయిట్ లిఫ్టింగ్ గ్రాండ్ ప్రిక్స్ లో 90
కిలోల విభాగంలో రెండవ స్థానంతో సిల్వర్ మెడల్ సాధించాను.

ఎన్ని కిలోల బరువులు ఎత్తుతారు.. ఎలా సాధ్యపడింది?
ఆటలంటేనే ఎక్కువగా పురుషులు ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు మహిళలు కూడా క్రీడల్లో రాణిస్తున్నారు. వాస్తవానికి వెయిట్ లిఫ్టింగ్‌లో అయితే పురుషులే ఎక్కువ. నేను పురుషులతోనే పోటీ పడుతుంటాను. ఎందుకంటే నా స్ట్రెంగ్త్ పెరగాలంటే వారితోనే పోటీపడాలని మా కోచ్ చెపుతుంటారు. స్స్నాచ్ లో 75 కేజీలు, దాంతో పాటు క్లీన్ జెర్క్ లో 85 కేజీలు= మొత్తం 160 కేజీల విభాగంలో కూడా రాణించాను. 130 తో మొదలు పెట్టి ఇప్పుడు 180 కిలోలు ఎత్తుతున్నాను. ఈ డిసెంబర్‌లో నేషనల్ సీనియర్ పోటీలున్నాయి. అప్పటి వరకూ 210 కిలోలు ఎత్తడమే నా టార్గెట్.

అవార్డులు…
* ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా కొముర భీం అవార్డు. బంజార తీజ్ మేళాలో కీర్తి అవార్డు.
* తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల క్యాష్ అవార్డు ఇచ్చింది.

కుటుంబ ప్రోత్సాహం ఎలా ఉంటుంది ?
నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే తల్లిదండ్రులు, ముఖ్యంగా మా తాత తేజావత్ రామచంద్రు నాయక్ ఉండటం నాకు చాలా సంతోషం. ఎందుకంటే మా తండాల్లో ఆడపిల్లలకు చిన్న వయసులో పెళ్లి చేస్తారు. నాకు కూడా 18 ఏళ్లకే పెళ్లి చేస్తాం అని చాలా ఇబ్బంది పెట్టారు. కాని ఇప్పుడు నన్ను చూసి చాలా గర్వంగా ఉందంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని. దేశంలో ఉన్న ఆడపిల్లలకు ఆదర్శంగా నిలవాలని అంటున్నారు.

మీ గోల్ ఏంటి…
ఒలింపిక్స్‌లో ఆడి గెలిచి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం పేరు నిలబెట్టడమే నా గోల్. డిసెంబర్‌లో వచ్చే నేషనల్ సీనియర్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించడమే లక్షంగా ప్రాక్టీస్ చేయిస్తున్నారు మా కోచ్. ప్రతి ఈవెంట్‌లో గోల్డ్‌మెడల్ తీసుకుని రావాలని మా కోచ్ రోజూ చెపుతుంటారు. సి.బి.ఆర్ అకాడమీలో కోచ్ ప్రసాద్ సార్. మా కోచ్ రాజశేఖర్ సార్, చైర్మన్ వెంకటేశ్వర్ సార్ ఆశీస్సులతో తప్పక అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తానని ఆశిస్తున్నాను. ఎవరయినా స్పాన్సర్స్ ముందుకు వచ్చి ప్రోత్సహిస్తే తప్పక అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం పేరు, స్పాన్సర్స్ పేరు నిలబెడతాననే ఆత్మవిశ్వాసంతో ఉన్నాను.                                                                                                                                              – బొర్ర శ్రీనివాస్