Home రాష్ట్ర వార్తలు 6 ప్రాజెక్టులపై పెత్తనం మాదే

6 ప్రాజెక్టులపై పెత్తనం మాదే

కుదరదంటున్న తెలంగాణ, నేడు గోదావరి బోర్డు సమావేశం 

                   Godawari-River

హైదరాబాద్: హైదరాబాద్‌లో శుక్రవారం గోదావరి బోర్డు సమావేశం కానుంది. బేసిన్‌లోని ప్రాజెక్టుల నియంత్రణ అంశాన్ని తే ల్చాలని బోర్డు పట్టుదలతో ఉండగా, అవసరం లేదని తెలంగాణ వాదిస్తున్న నేపథ్యంలో సమావేశం జరగనుంది. తెలంగాణలోని ఆరు ప్రాజెక్టులపై తమకు పెత్తనాన్ని అప్పజెప్పాలని బోర్డు ఇదివరకే నోటిఫికేషన్ జారీచేసింది. తెలంగాణకు జీవంగా భావించే శ్రీరాంసాగర్‌తో పాటు  నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చుకుంటామని చెబుతోంది. ఈ ప్రాజెక్టుల పరిధిలో ని బ్యారేజీ హెడ్ వర్క్, డ్యామ్‌లు, రిజర్వాయ ర్లు, కాలువలు, రెగ్యులేటర్లతో పాటు విద్యుత్ ప్లాంట్ల హెడ్‌వర్క్,  రిజర్వాయర్ల పరిధిలోని ఎత్తిపోతల పథకాలు, నీరు విడుదల చేసే నిర్మాణాలు అన్నింటినీ బోర్డుకు అప్పజెప్పాలని కోరుతుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచనలకు వత్తాసు పలుకుతూ గోదావరి బోర్డు పెత్తనాన్ని కోరుతోంది. ఇదిలా ఉండగా గోదావరిలో 1480 టిఎంసిల నీటి లభ్యత ఉండగా, 880 టిఎంసిలకు మించి వాడడం లేదు. ఇందులో తెలంగాణకు 954.23 టిఎంసిల వాటా ఉండగా, ఎపి 530 టిఎంసిల వాటా ఉంది. కొత్త ప్రాజెక్టులు పూర్తైనా తెలంగాణ వినియోగం 450 టిఎంసిలను మించే అవకాశం లేదు. ఎపిలో 450 టిఎంసిలే వినియోగిస్తున్నారని తెలంగాణ వాదన. గోదావరి నదిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టులే లేనందున బోర్డు పరిధి ప్రశ్నే తలెత్తవద్దని తెలంగాణ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

దీనికి తోడు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి నది నుంచి కృష్ణా నదికి మళ్లించిన నీటిలో తెలంగాణ వాటాపై అధికారులు ప్రశ్నించనున్నారు. కాళేశ్వరం, సీతారామ, భక్తరామదాసు డిపిఆర్‌లపై ఎపి అధికారులు ప్రశ్నిం చే అవకాశం ఉంది. జులై 21న గోదావరి బోర్డు కార్యాలయంలో పూర్తిస్థాయి బోర్డు చైర్మన్, సభ్య కార్యదర్శి హెచ్.కె. సాహు, సమీర్ చటర్జీలతో పాటు తెలంగాణ, ఎపి ఇరిగేషన్ శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్‌కె జోషి, శశిభూషణ్, ఇఎన్‌సిలు సి.మురళీధర్, ఎం. వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొంటారు.