Home తాజా వార్తలు తెలంగాణ, ఎపి మధ్య కుదిరిన అంగీకారం

తెలంగాణ, ఎపి మధ్య కుదిరిన అంగీకారం

Telangana and AP Review over Krishna river water

 

శ్రీశైలం విద్యుత్ నుంచి సగం సగం వాటా
మంచినీటి వినియోగాన్ని 20శాతంగానే లెక్కించాలని కేంద్ర జల సంఘాన్ని కోరనున్న తెలుగు రాష్ట్రాలు
రెండో దశ టెలిమెట్రీ అమలుకు ఒప్పుకున్న రెండు రాష్ట్రాలు
కృష్ణ బోర్డుకు తమ తమ వాదనలు వినిపించిన తెలంగాణ, ఎపి
ఆరున్నర గంటల పాటు సాగిన సమావేశం
కొత్త ప్రాజెక్టుల డిపిఆర్‌లు కోరిన బోర్డు
అనుమతులు తీసుకొని ఇస్తామని చెప్పిన రెండు రాష్ట్రాల ప్రతినిధులు
వరద జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాను : బోర్డు చైర్మన్ పరమేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ, ఎపి రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరింది. ఈ జలాలను 66:34 నిష్పత్తిలో వినియోగించుకునేందుకు రెండు రాష్ట్రాలు పరస్పరం అంగీకరించాయి. అలాగే శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం నుంచి 50:50నిష్పత్తిలో కరెంటును వినియోగించుకోవాలని నిర్ణయించాయి. అలాగే రెండో దశ టెలిమెట్రీని అమలు చేసేందుకు కూడా రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఫిర్యాదుల నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ, ఎపి రాష్ట్రాలకు చెందిన అధికారులు తమ తమ వాదనాలను గట్టిగా వినిపించే ప్రయత్నం చేశారు.

కృష్ణానది యజమాన్య బోర్డు చైర్మన్ పరమేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ శాఖ కార్యదర్శులు, ఇఎన్‌సిలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సుమారు ఆరున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశం వాడివేడిగా జరిగింది. ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు తమ వాదనాలను గట్టిగా వినిపించాయి. అనంతరం సమావేశం వివరాలను బోర్డు చైర్మన్ పరమేశం మీడియాకు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలు వాడుకోవాలని సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రతినిధులకు సూచించినట్లు తెలిపారు.

రెండు రాష్ట్రాల కొత్త ప్రాజెక్టులకు సంబంధించి డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టులు (డిపిఆర్‌లు) ఇవ్వాలని సమావేశానికి హాజరైన రెండు రాష్ట్రాల ప్రతినిధి బృందాలను కోరినట్టు ఆయన తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు తీసుకుని డిపిఆర్‌లు సమర్పించేందుకు వారు అంగీకరించారని తెలిపారు. ఇక శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం నుంచి 50:50 నిష్పత్తిలో విద్యుత్ పంపకానికి ఇరు రాష్ట్రాలు సమ్మతించాయని ఆయన వెల్లడించారు. తాగునీటి వినియోగాన్ని 20 శాతమే లెక్కించాలనే విషయమై కేంద్ర జల సంఘానికి నివేదించేందుకు కూడా రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపినట్లు బోర్డు చైర్మన్ పరమేశం తెలిపారు. అలాగే కృష్ణా వరద జలాల వినియోగంపై ఇరు రాష్ట్రాల వాదనలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే రెండో దశ టెలిమెట్రీని అమలు చేసేందుకు రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయని వివరించారు. ఎపిలో గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు తరలించిన జలాల అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించామని పరమేశం పేర్కొన్నారు. కృష్ణా బోర్డును ఎపి రాజధానికి తరలించే అంశంలో కేంద్ర జలశక్తి శాఖదే తుది నిర్ణయం అని అన్నారు.

శ్రీశైలం-సాగర్ కేటాయింపుల్లో గతంలోని పలు అంశాలను మరోసారి తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిందని బోర్డు చైర్మన్ పరమేశం తెలిపారు. ఇందుకు ఎపి కూడా పలు అభ్యంతరాలను తెలిపిందన్నారు. ఇరు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలను కేంద్ర జలాశక్తి శాఖకు పంపాము. దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుంది. రెండు రాష్ట్రాలు చేపట్టబోయే ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి డిపిఆర్ నివేదికలు ఇచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు అని సూచించినట్లు ఆయన వెల్లడించారు. గతంలో వాడుకొని నీళ్లను భవిష్యత్‌లో ఇవ్వాలని తెలంగాణ కోరిన అంశంపై చర్చ జరిగిందని దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

కాగా మిగుల జలాల వాడకంపై కమిటీ వేశామని, ఆ కమిటీ రిపోర్ట్ వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ కమిటీ ఇప్పటికే ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ జరిపిందని పరమేశం తెలిపారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఎపికి రావాల్సిన నీళ్లను మాత్రమే వాడుకుంటామని చెబుతోందన్నారు. పట్టిసీమ 45 టిఎంసిల్లో ఇరు రాష్ట్రాలకు ఎంత మేరకు రావాలని అనే దానిపై జలాశక్తికి పంపామన్నారు.ఈ సమావేశంలో బోర్డు చైర్మన్ పరమేశంతో పాటు ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ కార్యదర్శులు రజత్‌కుమార్, ఆదిత్యనాథ్‌దాస్, ఇఎన్‌సిలు మురళీధర్, నారాయణరెడ్డి తదితరులు హాజరు అయ్యారు.

తెలంగాణ తరఫున రజత్‌కుమార్ వాదనలు
బోర్డు సమావేశంలో తెలంగాణ పక్షాన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ గట్టిగా వినిపించారు. ముందుగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన నిర్మించిన ప్రాజెక్టులపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇరు రాష్ట్రాలు లేవనెత్తుతున్న కొత్త ప్రాజెక్టుల డిపిఆర్‌తో పాటు టెలిమెట్రీల వ్యవస్థ ఏర్పాటు….ఈ ఏడాదిలో నీటి పంపిణీ, మళ్లింపు జలాల వాటా తదితర అంశాలపై బోర్డు సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రజత్‌కుమార్ మాట్లాడుతూ, కృష్ణా నదిపై ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు వచ్చాయన్నారు. వాటినే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోందని తెలిపారు. అయితే ఎపి ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టొద్దని రజత్‌కుమార్ సూచించారు.

ఇది రెండు రాష్ట్రాల విభజన అనంతరం నిర్మిస్తున్న ప్రాజెక్టు కాబట్టి అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి ప్రాజెక్టును చేపట్టడం లేదని సమావేశంలో తేల్చి చెప్పారు. దీనిపై ఉద్దేశ పూర్వకంగానే తెలంగాణపై ఎపి ప్రభుత్వం నిరాధారపు ఆరోపణలు చేయడంతో పాటు అక్రమంగా, ఎలాంటి అనుమతులు లేకుండ ప్రాజెక్టులను నిర్మిస్తోందని ఆరోపించారు. నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ రాష్టం న్యాయబద్దంగా, చట్టబద్దంగా నడుచుకుంటోందని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలతో తాము గొడవలను కోరుకోవడం లేదని, అయితే దీనిని తమ అసమర్ధతగా ఎపి ప్రభుత్వం భావించవద్దని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఎటువంటి చర్యలను కూడా సహించబోమని ఈ సమావేశంలో రజత్‌కుమార్ కరాఖండిగా ఎపి అధికారులకు చెప్పినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

తదనంతరం వాదనలకు సంబంధించిన వివరాలను రజత్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 16.5 టిఎంసిలు హైదరాబాద్‌కు రావాలనే విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తాగునీటి కేటాయంపులను 20 శాతం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. పోలవరం, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించి ఆ మేరకు అదనపు జలాలను ఇవ్వాలని కోరినట్లు రజత్ కుమార్ చెప్పారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన పలు పెండింగ్ అంశాల గురించి బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

Telangana and AP Review over Krishna river water