Home తాజా వార్తలు తీర్పు నేడే

తీర్పు నేడే

Telangana Assembly election results today

ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాల సరళి వెల్లడవుతుంది. ఎన్నికలు జరిగిన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాంల ఫలితాలు కూడా ఈ రోజే బహిర్గతం కానున్నాయి.

రాష్ట్రంలో తేలనున్న 1821 మంది అభ్యర్థుల భవితవ్యం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 43 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలకు 13 కౌంటింగ్ కేంద్రాలు ఉండగా, మిగిలిన 30 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొనింది. సెప్టెంబరు 6వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీని రద్దు చేయడంతో ఈ ఎన్నికలు జరిగాయి. షెడ్యూలు ప్రకారమైతే సాధారణ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సి ఉంది. అసెంబ్లీని రద్దు చేసిన రోజునే 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన అధికార టిఆర్‌ఎస్‌కు మూడు నెలల పాటు విస్తృతంగా నియోజకవర్గంలో ప్రచారం చేసే అవకాశం లభించింది.

గత ఎన్నికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాతిపదికన జరగ్గా ఈసారి మాత్రం తెలంగాణ రాష్ట్రం పేరుతోనే జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కమిషనర్లు రెండు దఫాలుగా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లపై సమీక్షినిర్వహించారు. రాష్ట్రం మొత్తంమీద 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1821 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒక థర్డ్ ట్రాన్స్‌జెండర్ కూడా బరిలో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి పోలింగ్ శాతం 73.20గా నమోదైంది. మొత్తం 2.80 కోట్ల మంది ఓటర్లతో జాబితా రూపొందగా ఇందులో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేవారు సుమారు ఏడు లక్షల మంది ఉన్నట్లు అంచనా.

పకడ్బందీగా లెక్కింపు ప్రక్రియ
జిల్లాకు కౌంటింగ్ కేంద్రం ఒక్కటే అయినప్పటికీ, అందులో నియోజకవర్గాలకు విడివిడిగా ఏర్పాటు చేసి ఓట్లు లెక్కింపును చేపట్టేలా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఏర్పాట్లు చేసింది. సాధారణంగా ఒక్కో నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపుకు 14 నిర్ణయించగా, పోలింగ్ కేంద్రాల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోకవర్గాల్లో అదనపు ఏర్పాటు చేసింది. లెక్కిపు పూర్తయిన తరువాత అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఏదైనా ఒక వివిప్యాట్‌లోని ముద్రిత ఓటరు స్లిప్పులను లెక్కించి సరిచూసుకుంటారు. అయినప్పటికీ తక్కువ ఓట్లతో ఎవరైనా ఓడిపోతే వివిప్యాట్‌ల లెక్కను చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఛాలెంజ్ చేసుకోవాలని సిఇఒ రజత్ కుమార్ ఇప్పటికే తెలిపారు. ఇందుకు సంబంధించి సిఇఒ జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.

ఓట్ల లెక్కింపుతో మొత్తం 1821 మంది అభ్యర్థుల భవితవ్యం తేలడంతో పాటు, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టనుందో కూడా ఫలితాలే తేల్చనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తరువాత బ్యాలెట్ యూనిట్ల ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ ప్రారంభానికి ముందు ప్రీసైడింగ్ అధికారి సంతకంతో ఉన్న 17 సి ఫారం వివరాలు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఏజెంట్లకు చూపిస్తారు. 17సి ఫారంలో ఇవిఎంల వారీగా పోలైన ఓట్ల వివరాలు ఉంటాయి. పోలైన ఓట్లు, ఇవిఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరిచూసుకుంటారు. వాటిని నోట్ చేసుకోవడంతో పాటే ఏజెంట్లకు కూడా చూపించి వారి సంతకాలు తీసుకుంటారు. వాటిని ఏజెంట్లు నోట్ చేసుకున్న అనంతరం ఇవిఎంలను సీల్‌ను తొలగించి రిజల్ట్ బటన్‌ను నొక్కుతారు. వెంటనే అభ్యర్థుల వారీగా .. వారి వారి ఫలితాలు వెలువడుతాయి.

ఒక్కొక్క రౌండ్‌లో 14 ఇవిఎంల ఫలితాలు వెల్లడవుతాయి. ప్రతి రౌండ్ ఫలితం వారు సంతృప్తి చెందిన తరువాతే వెల్లడిస్తారు. సెప్టెంబర్ 6వ తేదీన అసెంబ్లీ రద్దు చేయడంతో రాష్ట్రంలో అనివార్యంగా ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 3 నెలల పాటు టిఆర్‌ఎస్ అభ్యర్థులు నిర్విరామంగా ప్రచారం నిర్వహించారు. ప్రజాకూటమి అభ్యర్థులు నోటిఫికేషన్ తరువాత ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం ఫలితాలు వెలువడే వరకు తమకు టెన్షన్ తప్పదని అభ్యర్థులు పేర్కొన్నారు.

Telangana Assembly election results today

Telangana Latest News