Home తాజా వార్తలు కొండంత విషాదం…

కొండంత విషాదం…

Telangana bus accident in Kondagattu

మనతెలంగాణ/జగిత్యాల / జగిత్యాలటౌన్ / మల్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 57 మంది దుర్మరణం చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో నలుగురు చిన్నారులు, 30 మంది మహిళలు, 23 మంది పురుషులు ఉన్నారు. జగిత్యాల డిపోకు చెందిన ఎపి 28 జెడ్ 2319 నెంబరు గల ఆర్‌టిసి బస్సు కొండగట్టు అంజన్నను దర్శించుకుని వస్తున్న భక్తులతో కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి జగిత్యాలకు వస్తుండగా ఘాట్ రోడ్డుపై అదుపు తప్పి సుమారు 12 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడగా 24 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృత్యువాత పడగా మరో 30 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బస్సులోని మిగితా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు హుటాహుటిన జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రితో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.

క్షతగాత్రుల్లో 20 మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా ప్రధాన ఆసుపత్రి వద్దకు మృతుల కుటుంబ సభ్యులు భారీగా చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. జిల్లాలోని శనివారంపేట నుంచి బయలుదేరిన బస్సు కొండగట్టుకు వచ్చే సరికి ప్రయాణీకులతో నిండిపోయింది. ఘాట్ రోడ్డు నుంచి కిందికి దిగుతుండగా చివరి మూలమలుపు వద్ద ముందుగా వెళ్తున్న కారును ఓవర్‌టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న టాటా ఎస్ వాహనాన్ని బస్సు ఢీకొట్టింది. అదే వేగంతో ఘాట్ రోడ్డుపై ఉన్న రెయిలింగ్‌పైకి దూసుకెళ్ళి అక్కడి నుంచి 12 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. వేగంగా వెళ్ళి లోయలో పడిపోవడంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా బస్సు డ్రైవర్ కొన ఊపిరితో బస్సు అద్దాల్లోంచి బయటకి వేలాడుతుండగా స్థానికులు డ్రైవర్‌ను బయటకు తీసేందుకు యత్నించేలోపే మృతి చెందాడు. అలాగే బస్సులోని సీట్లన్నీ నుజ్జునుజ్జు కాగా సీట్ల కింద పడి ప్రయాణీకులు 24 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి బస్సులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసేందుకు సుమారు అరగంట సమ యం పట్టింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 92 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల రోదనలతో సంఘటన స్థలం దద్దరిల్లింది. ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ శరత్, ఎస్‌పి సింధూశర్మ, ఆర్‌డిఆఓ నరేందర్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల్లో జగిత్యాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న పలువురు క్షతగాత్రులను కరీంనగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలలోని ఆసుపత్రులకు తరలించారు.
ఆర్‌టిసి చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం
కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంలో 57 మంది మృత్యువాత పడడం ఉమ్మడి కరీంగనర్ జిల్లాలో పెను విషాదాన్ని నింపింది. మృతుల్లో కొడిమ్యాల మండలం శనివారంపేట, హిమ్మత్‌రావుపేట, రాంసాగర్, డబ్బుతిమ్మాయిపల్లె గ్రామాలకు చెందిన వారే ఎక్కువ మంది మృతి చెందడంతో ఆయా గ్రామాల్లో విషాదం నెలకొంది. ప్రమాద విషయం తెలుసుకున్న రాష్ట్ర అపధర్మ మంత్రులు పట్నం మహేందర్‌రెడ్డి, ఈటెల రాజేందర్, కె.తారకరామారావు, ఎంపి కవితలు హెలికాఫ్టర్ ద్వారా జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా రూ. 5 లక్షలు, టిఆర్‌ఆర్‌టిసి సంస్థ నుంచి రూ. 3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని, క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రులు ప్రకటించారు. కొండగట్టులో బస్సు ప్రమాదం రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఘోర రోడ్డు ప్రమాదమని, ఇది అత్యంత విషాదకర సంఘటన అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఐటి శాఖ మంత్రి కెటిఆర్, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌లు అన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారని, ప్రమాద సంఘటనకు హుటాహుటిన తరలివెళ్ళి సహాయ చర్యలను ముమ్మరం చేయాలని తమను ఆదేశించినట్లు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది నిరుపేదలేనని, వారిని ప్రభుత్వపరంగా అన్ని విధాల ఆదుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా రూ.5లక్షలు, ఆర్‌టిసి ద్వారా మరో రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తామన్నారు. మృతుల్లో ఎవరైనా రైతులు ఉన్నట్లయితే రైతు బంధు పథకం ద్వారా రూ.5 లక్షలు అందజేస్తామన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం అత్యంత విషాదకరమన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఎంత ఆర్థిక సాయం చేసినా తక్కువేనని, వారు మనోనిబ్బరం కోల్పోకుండా ఉండాలన్నారు. వారి వెంట చీఫ్ విప్ ఈశ్వర్, మాజీ ఎంఎల్‌ఎ విద్యాసాగర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ తదితరులున్నారు.