Friday, March 29, 2024

రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ

- Advertisement -
- Advertisement -

Telangana cabinet to meet tomorrow

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఆగస్టు 1వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కాగా మంత్రివర్గ సమావేశం ఈ నెలలోనే రెండు సార్లు జరిగింది. 6న మంత్రివర్గ  సమావేశం జరగగా, మరోసారి13వ తేదీన కొనసాగిన సమావేశం ఏకంగా రెండురోజుల పాటు కొనసాగింది. ఈ సమావేశాల్లో రైతుబంధుతోపాటు వ్యవసాయ సంబంధమైన అంశాలపై మంత్రివర్గ సమావేశం పలు నిర్ణయాలు తీసుకున్నది. కాగా రేపటి మంత్రివర్గ సమావేశంలో యాభైవేల ఉద్యోగాల భర్తీతో పాటు దళితబంధు పథకానికి సంబంధించిన పలు అంశాలపై కూలంకషంగా చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది.

ప్రధానంగా దళిత బంధుపై ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశం, హుజూరాబాద్ దళిత ప్రతినిధుల సమావేశం సారాంశాల ఆధారంగా పథకానికి సంబంధించి మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. దళిత బంధుకు సంబంధించి రూ. 500 కోట్ల నిధులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి గత కేబినెట్‌లోనే ఆమోదం తెలపాలని భావించినప్పటికీ పలువురు పలు కారణాల వల్ల నాటి సమావేశంలో సాధ్యం కాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో మరోసారి మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. అలాగే హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళిత బందు పథకాన్ని అమలు చేయడానికి కేబినెట్ సమావేశం ఆమోదం తెలపనుందని తెలుస్తోంది.

అలాగే దళిత బీమా, చేనేత బీమా పథకాలపై కూడా చర్చించి తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా రాష్ట్రం ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద నిర్వహణా బృందం ఏర్పాటు, పంటలకు సాగునీరు, ప్రాజెక్టులు సంబంధిత అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై కూడా చర్చించే అవకాశం ఉంది. కొవిడ్ మూడో వేవ్ సన్నద్ధతపై కూడా కేబినెట్‌లో సమీక్షించే అవకాశం ఉంది. త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక, శాసనసభ్యుల కోటా కింద ఎంపిక చేయాల్సిన ఆరుగురు ఎంఎల్‌సి అభ్యర్ధులతో పాటు మరిన్ని కీలక అంశాలపై మంత్రి మండలి చర్చించే అవకాశముందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News