Home తాజా వార్తలు కోల్‌కత్తాలో తెలంగాణ ఉద్యోగి విజయం

కోల్‌కత్తాలో తెలంగాణ ఉద్యోగి విజయం

Telangana employee victory in Kolkata

నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల్లోకి తెచ్చిన చంద్రయ్య

చిన్న స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగి అత్యున్నత శిఖరాలకు చేరుకున్నాడు. చదువుకోవడానికి సరైన అవకాశాలు లేని కాలంలో కిలోమీటర్లు కాలినడకన బడికి వెళ్లి కష్టపడి చదువుకున్నాడు. పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు.  నాన్న కోరికను నెరవేర్చి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే పట్టుదలతో క్లిష్టమైన ఉన్నత కోర్సులను చదివి ఎకౌంట్స్ ఆఫీసర్‌గా, ఫైనాన్స్ హెడ్‌గా, డైరెక్టర్‌గా పనిచేశాడు.  ప్రస్తుతం  బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాసిటికల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా (ఎండీ)గా  పనిచేస్తున్నాడు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రుల ఆధ్వర్యంలో నడిచే ఈ కంపెనీ వ్యవహారాలను చూసుకోవడానికి  ఓ తెలంగాణకు చెందిన వ్యక్తిని సమర్ధుడిగా భావించిన బెంగాల్ కెమికల్స్ బోర్డు ఈ పోస్టుకు చంద్రయ్యను ఎంపిక చేసింది. 60 సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్న ఆ కంపెనీ, తాను బాధ్యతలు తీసుకున్న సంవత్సరంలోపే లాభాల బాటలో నడిచేలా కృషి చేశాడాయన. బోర్డు అనుకున్న విధంగా సంస్థను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ కష్టాల కడలిని దాటుకొని, ఆయన సాధించిన విజయాలు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. జగిత్యాల జిల్లాకు చెందిన పిల్లలమర్రి చంద్రయ్య నష్టాల్లో ఉన్న కంపెనీ లాభాల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఎండీ  స్థాయికి ఎలా చేరుకోగలిగారో ఆయన మాటల్లోనే…

మాది జగిత్యాల జిల్లా కల్లెడ గ్రామం. నాన్న శంకరయ్య, అమ్మ లక్ష్మి. ముగ్గురం అన్నదమ్ముళ్లం, ముగ్గురు చెల్లెళ్లు. ఒకటో తరగతి నుంచి 10 వ తరగతి వరకు కల్లెడలోని ప్రభుత్వ పాఠశాలలో నా చదువు కొనసాగింది. అనంతరం సిరిసిల్లలోని పాలిటెక్నిక్ కళాశాలలో డిసిపి చేశాను. ఆ సమయంలోనే నాన్న పాముకాటుకు గురయ్యారు. నాన్నకు నేను మొదటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న కోరిక ఉండేది. దానిని సాధించాలన్న పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాను. డిగ్రీ చదువుతున్న సమయంలోనే 1984లో రామగుండం ఎన్టీపీసీలో క్లర్క్‌గా చేరగానే విజిలెన్స్‌లో విధులు నిర్వహించాల్సి వచ్చింది. ఉద్యోగం చేస్తూనే బీకాం పూర్తి చేశాను. 1991లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా సీసీడబ్లు కరస్పాండెంట్ కోర్సులో చేరాను. అత్యంత కష్టమైన కోర్సును 1996లో ఒకేసారి రెండు గ్రూపుల్లో పాసు కావడంతో పాటు ఐసీడబ్లూఏలో ర్యాంకు సాధించాను.

చిన్నతనంలోనే ఆర్థిక సమస్యలు
చిన్నతనంలోనే అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాను. 10వ తరగతి చదువుతున్నప్పుడే నాన్న శంకరయ్య మృతి నన్ను కలచివేసింది. పెద్ద కొడుకుగా కుటుంబ భారాన్ని మోస్తూ చెల్లెళ్లను చదివించి పెళ్లి చేశాను. మా అమ్మ ఇచ్చిన ధైర్యంతో ముందుకెళ్లాను. అమ్మతో పాటు గురువు కనకయ్య నాకు ప్రోత్సాహం ఇచ్చారు. ఆ సమయంలో ఉన్నత కోర్సును పూర్తి చేసినప్పటికీ ఎలాంటి పదోన్నతి రాలేదు. దీంతో ఆవేదనకు గురయ్యాను. 1997 సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్‌లో అసిస్టెంట్‌గా 1997లో ఉద్యోగం సాధించాను. తరువాత 1998 సంవత్సరంలో ఇండియన్ రైల్వే కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఇల్‌కాన్ ఇంటర్నేషనల్) ఫైనాన్స్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా చేరాను. 2010 సంవత్సరంలో ఇర్కాన్‌లో ఏఎం, డీజీఎం, ఏజీఎం హోదాల్లో పనిచేశాను. 2010సంవత్సరంలోనే ఎన్టీపీసీ, సెయిల్ జాయింట్ వెంచర్ (ఎన్ ఎస్ పీసీఎల్)లో డిప్యూటీ జీఎం ఉద్యోగం సాధించాను.

2016లో పూర్తి స్థాయి ఎండీగా బాధ్యతలు
రెండేళ్లు అక్కడ పనిచేసిన తరువాత ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఇండియా లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ సంస్థలో ఏజీఎంగా విధుల్లో చేరాను. 2014 వరకు ఈసీఐఎల్‌లో పనిచేశాను. తరువాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యాను. నేను డైరెక్టర్‌గా ఈ కంపెనీలో చేరే సమయానికి పరిస్థితి అధ్వానంగా ఉంది. పశ్చిమబెంగాల్‌లో సాధారణంగా వామపక్ష కార్మిక సంఘాల పెత్తనం ఎక్కువ. కార్మిక సంఘాల జోక్యం కారణంగా సంస్థ ఖాయిలా పరిశ్రమల జాబితాలోకి చేరింది. నేను తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు కంపెనీ లాభాల బాటలోకి వెళ్లడానికి దోహదపడ్డాయి. నాలుగు కెమికల్స్ ఫార్మాస్యూటికల్స్ ఫ్యాక్టరీలు ప్రస్తుతం సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. దీంతో 2016 జూన్‌లో పూర్తి స్థాయి ఎండీగా బెంగాల్ కెమికల్స్ బాధ్యతలను తీసుకున్నాను.

పార్లమెంటరీ బృందం నుంచి ప్రశంసలు
1901 సంవత్సరంలో బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్‌ను నెలకొల్పారు. ఈ కంపెనీలో దాదాపు వంద రకాల యాంటీ బయాటిక్స్, యాంటీ వీనం (పాముకాటు) మందులు తయారవుతాయి. కాలక్రమేణా ఈ కంపెనీ సిక్ ఇండస్ట్రీ జాబితాలో చేరిపోయింది. నేను కంపెనీలో చేరేటప్పుడు ఈ కంపెనీని లాభాలబాట పయనించేలా చేయడంతో పాటు కార్మికులు రోడ్డున పడకుండా చూసే బాధ్యత నా కళ్ల ముందు కనిపించింది. 5 నెలల్లో నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల బాటలో నడిపించాను. పార్లమెంటరీ బృందం ఒకసారి ఈ కంపెనీని క్షేత్రస్థాయిలో పరిశీలించి తాను తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు కురిపించింది. బెంగాల్ కెమికల్స్‌కు సంబంధించి ఉత్పత్తులు తయారీకి సంబంధించి హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో కూడా కంపెనీ ఉంది. 15 రాష్ట్రాలకు ఈ కంపెనీ నుంచి ఉత్పత్తులను పంపిణీ చేస్తాం. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈఎస్‌ఐ ఆస్పత్రి, డిఫెన్స్, ఎయిర్‌పోర్ట్, రైల్వేలకు ఈ కంపెనీ నుంచే మందులను సరఫరా చేస్తాం. ఈ కంపెనీ టర్నోవర్ సంవత్సరానికి రూ.100 నుంచి రూ.200 కోట్ల మధ్యలో ఉంటుంది. గతంలో నష్టాల్లో ఉన్న కంపెనీ ప్రస్తుతం సంవత్సరానికి రూ.10 నుంచి రూ.25 కోట్ల మధ్య లాభాల బాటలో నడుస్తోంది.

అవార్డులు అనేకం
కుమారుడు మల్లికార్జున్ సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు శివానీ పీహెచ్‌డీ చేస్తోంది. ఇప్పటివరకు చాలా అవార్డులు అందుకున్నాను. 2002 సంవత్సరంలో ఇర్కాన్‌లో డీజీఎం స్థాయిలో పనిచేసినప్పుడు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డుతో పాటు 2012 సంవత్సరంలో అడిషనల్ జీఎంగా ఉన్నప్పుడు అకౌంట్స్ ఫైనలేజేషన్ అప్రిషేషన్ ఫర్ డైరెక్టరేట్ ఫైనాన్స్ అవార్డు అందుకున్నాను. 2015లో లాంగ్ పెండింగ్ అకౌంట్స్ క్లియర్ చేసినందుకు బెస్ట్ ఇండస్ట్రీస్- అకాడమిక్ కోలాబరేషన్ అవార్డు 2016లో వచ్చింది. నా భార్య శకుంతల ప్రోత్సాహంతో ఈ విజయాలన్నీ సాధించాను.

                                                                                                                                                           – ఎల్.వెంకటేశం