Thursday, April 25, 2024

ఉద్యోగులకు పిఆర్‌సి ప్రకటించాలి

- Advertisement -
- Advertisement -

CS-Somesh-Kumar

 సిఎస్‌ను కలిసిన తెలంగాణ ఉద్యోగుల జెఎసి నాయకులు
సిఎం త్వరలోనే మీ సమస్యలను పరిష్కరిస్తారు : సిఎస్
కెసిఆర్‌పై నమ్మకం ఉందన్న జెఎసి నేతలు కారం రవీందర్ రెడ్డి, మమత

హైదరాబాద్ : ఉద్యోగులకు వెంటనే పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగుల జెఎసి చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ మమతలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను కలిసి బుధవారం వినతిపత్రం అందించారు. సిఎస్‌ను కలిసిన అనంతరం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ మంగళవారం వచ్చిన పీఆర్సీ గడువు పొడిగింపు జిఓతో చాలామంది ఉద్యోగులు ఆందోళనలు చెందుతున్నారని, ఈ నేపథ్యంలో తాము సిఎస్ కలిశామని ఆయన పేర్కొన్నారు. అన్ని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సోమేష్‌కుమార్‌ను కలిశామని ఆయన తెలిపారు.

పీఆర్సీ కమిషన్ అనేది వేతన సవరణ కోసమే ఏర్పాటు చెయ్యలేదని, ఉద్యోగులకు సంబంధించిన అనేక విషయాల కోసం, స్టడీ కోసం ఈ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఉద్యోగుల ఇతర సమస్యల స్టడీ కోసం దీనిని పొడిగించినట్టు సిఎస్ పేర్కొన్నారని ఆయన పేర్కొన్నారు. పీఆర్సీ నివేదిక సిద్ధంగా ఉందని, నెల లోపల కమిషన్ రిపోర్ట్ అందించనున్నట్టు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవీందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అనేక సమస్యలపై పోరాటం చేసిందని, రాష్ట్రం గొప్పగా ఉండేందుకు తమవంతు సాయం చేయాలన్నారు.

ఉద్యోగులకు అండగా సిఎం కెసిఆర్

ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యోగులకు అండగా ఉన్నారని, ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన తాను ఉన్నానని సిఎం అనేక సార్లు అనేక సందర్భాల్లో చెప్పారన్నారు. త్వరలోనే పీఆర్సీ వస్తుందని సిఎస్ కూడా తమకు హామినిచ్చారన్నారు. మార్చి నెలలో పీఆర్సీ వస్తుందని, త్వరలోనే మన ఉద్యోగ సంఘాలను పిలిచి సిఎం మాట్లాడాతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గౌరవప్రదమైన పీఆర్సీ వస్తుందని ఆశిస్తున్నాం, ఏ ఉద్యోగి కూడా నష్టపోకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, ఈహెచ్‌ఎస్ కూడా ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా కింది స్థాయి ఉద్యోగులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. గతంలో తెలంగాణ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌తో పిఆర్సీని సిఎం కెసిఆర్ మంజూరు చేశారని, దేశంలోనే అత్యధిక జీతాలు చెల్లించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆయన తెలిపారు. ఈసారి కూడా గౌరవప్రదమైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని మంజూరు చేయాలని సిఎస్‌కు ఇచ్చిన వినతిపత్రంలో తాము పేర్కొన్నట్టుగా ఆయన తెలిపారు.

సిఎం కెసిఆర్ తమకు పీఆర్సీ ఇస్తారు: టిజిఓ అధ్యక్షురాలు మమత

మమత, టిజిఓ అధ్యక్షురాలు మాట్లాడుతూ పీఆర్సీ గడువు పెంచుతూ జిఓ జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందారన్నారు. ఈ సంవత్సరం కూడా జీతాలు పెరగవన్న ఆవేదనలో ఉద్యోగులు ఉన్నారని, దీనిపై సిఎస్‌ను కలిశామని, సిఎస్ కూడా గడువు పెంపుపై ఆందోళన వద్దని తమతో చెప్పారన్నారు. సిఎం కెసిఆర్ తమకు పీఆర్సీ ఇస్తామని చెప్పారని, పీఆర్సీకి ఈ గడువు పొడిగింపుతో సంబంధం లేదన్నారు. ఏప్రిల్ నుంచి పీఆర్సీ ఇవ్వాల్సిందిగా తాము విజ్ఞప్తి చేశామన్నారు. ఉద్యోగుల సమస్యలపై సిఎం కెసిఆర్ సానుకూలంగా స్పందిస్తారని తాము ఆశిస్తున్నామన్నారు.

పీఆర్సీ కమిషన్ వేతన సవరణకు మాత్రమే పరిమితం కాలేదు

పీఆర్సీ కమిషన్ వేతన సవరణకు మాత్రమే పరిమితం కాలేదని సిఎస్ సోమేష్‌కుమార్ ఉద్యోగుల జేఏసి నాయకులతో పేర్కొన్నట్టుగా ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలు శాఖల మధ్య సమన్వయం, సర్వీస్ రూల్స్ సవరణ తదితర పనులను పీఆర్సీ కమిటీకి అప్పగించామని, ఈ నేపథ్యంలోనే కమిటీ గడువును పొడిగించాల్సి వచ్చిందని సిఎస్ తెలిపారని వారు పేర్కొన్నారు.

వేతన సవరణకు సంబంధించిన నివేదికను వెంటనే తెప్పించుకుంటానని, ఉద్యోగులు భయాందోళనకు గురికావద్దని సిఎస్ ఉద్యోగుల జేఏసి నాయకులకు హామినిచ్చారని, త్వరలో హామీలను సిఎం తప్పకుండా నెరవేరుస్తారని సిఎస్ వారితో పేర్కొన్నట్టుగా జేఏసి నాయకులు తెలిపారు. సిఎస్‌ను కలిసిన వారిలో పద్మాచారి, డా.మధుసూదన్‌రెడ్డి, మధుకర్, శ్రీకాంత్, శ్రీనివాస్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Telangana Employees JAC Meet CS Somesh Kumar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News