Friday, April 19, 2024

‘విశ్వ మానవుడు సి.నా.రె’

- Advertisement -
- Advertisement -

C Narayana Reddy birth Anniversary 2020

సి.నా.రె అనే మూడక్షారాలు తెలుగు, ఉర్దూ, సంస్కృతం మూడు భాషల సంగమం. సాహిత్య లోకం, సినీ లోకం, అధ్యాపక లోకం అనే మూడు లోకాల మిశ్రమం. డా. సి. నారాయణరెడ్డి అవిభక్త కరీంనగర్ జిల్లా, వేములవాడ మండలం, హనుమాజిపేట గ్రామంలో కర్షక కుటుంబంలో (గురుపూర్ణిమ) నాడు 29.7.1931 నాడు జన్మించారు. తల్లి బుచ్చమ్మ, తండ్రి మల్లారెడ్డి. నారాయణరెడ్డి ఇంటిపేరు సింగిరెడ్డి. దేవుని మొక్కు వల్ల కొడుకు పుట్టాడని, సత్య నారాయణరెడ్డి అని పేరు పెట్టుకున్నారు. అయితే సిరిసిల్ల మాధ్యమిక పాఠశాలలో కొడుకును చేర్పించే సమయాన ‘సి.నారాయణరెడ్డి’ – అని నమోదు చేయించడం చేత, అదే పేరు స్థిరపడింది. హనుమాజి పేటలో ఆనాడు ప్రభుత్వ పాఠశాల లేనందువల్ల, వ్యక్తిగతంగా ఒక ఉపాధ్యాయుడు నడిపిన వీధి బడిలో ఆయన చదువుకు శ్రీకారం చుట్టి, ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేశారు. తరువాత సిరిసిల్లలో ఉర్దూ మాధ్యమంలో తెలుగును ఒక ఐచ్ఛిక విషయంగా గ్రహించి, మాధ్యమిక స్థాయి విద్యను అభ్యసించారు. 1948లో కరీంనగర్‌లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశారు. సినారెలో సహజంగా సృజనాత్మకశక్తి, లయాత్మకత, చిన్ననాటి నుండే ఉన్నాయి.

చిన్నప్పటినుండి మట్టిలో పుట్టిన జానపదగీతాలను ఆలపించే వారు. హరికథలు, బుర్రకథలంటే చెవి కోసుకునే వారు. హరికథా కథనాన్ని ఆశువుగా, సంగీతాత్మకంగా అనుకరించే వారు. వేములవాడ వాస్తవ్యులు చౌటి నరసయ్య హరికథా గానం ఆయనకు ఛందస్సు పట్ల మక్కువ, అభిరుచి కలగడానికి ప్రేరకమైంది. ఆరేడు తరగతుల నుండే కవితలు వ్రాయడం మొదలు పెట్టారు. ఛందస్సంటే తెలియని దశ అది. ఏడవ తరగతిలో సీస పద్యమని తెలియని దశలో ‘ఒకనాడు ఒక నక్క ఒక అడవిలో పొట్ట కోసర మెటో పోవుచుండె’ అనే పంక్తితో ప్రారంభించి పద్యం వ్రాస్తే – అది సీసపద్యమని తెలిసి ఛందస్సుకు సంబంధించిన కొన్ని మెలకువలను తెలిపారు దూపాటి వేంకట రమణాచార్యులు. తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు వ్రాసిన-‘మారుటెన్నడో విషంపు గుండెలీ జగాన మారుటెన్నడో‘ అనేది సినారె తొలి గేయం. పదవ తరగతిలో ఉన్నప్పుడు -‘వెన్నవంటి మనసున్నవానికి, అన్నమేమొ కరువాయె ఉన్నవాని కింతన్న వీడుదామన్న గుండె లేదాయె‘ వంటి పాటలు రాశారు. కరీంనగర్ విద్యార్థి మహాసభలో -విజయంబు సాధించినావా – విద్యార్థి, నీ వీర భావాలు నింగి వ్యాపించగా; నీ వైరి చిత్తాల నేల కంపించగా‘ వంటి గేయాలు రచించి పాడారు. ఉన్నత పాఠశాల విద్యాభ్యాస కాలంలోనే, నైజాం రాష్ట్రానికి స్వాతంత్య్రం రావాలని జరిపిన విద్యార్థుల సత్యాగ్రహంలో పాల్గొన్నారు. హైదరాబాదు ఛాదర్ఘాట్ కళాశాలలో ఉర్దూ మాధ్యమంలో ఇంటర్ మీడియట్ (1948-49) ముగించారు.

ఇంటర్ చదువుతున్న సమయంలో జువ్వాడి గౌతమరావు సంపాదకత్వంలో వెలువడే ‘జనశక్తి’ పత్రికలో ఆయన కవిత తొలిసారిగా ప్రచురితమైంది. ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం అనే పద్య నాటికలను రాశారు. ‘భలే శిష్యులు’ వంటి సాంఘిక నాటికలను రచించారు, ప్రదర్శించి, నటులుగా తామూ పాత్రధారణ చేశారు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఉర్దూ మాధ్యమం లోనే ‘బి.ఏ.’ (1952) చదివారు. బి.ఏ. ద్వితీయ సంవత్సరంలో ఉన్నప్పుడు, ఉస్మానియా విశ్వ విద్యాలయం ఆరట్స్ కళాశాల విద్యార్థుల సాహితీ సంచిక – ‘శోభ’కు సంపాదకత్వం నిర్వహించారు. 1954లో ఎం.ఏ. పట్టా పొందారు. ఎం.ఏ. విద్యార్థిగా ‘సినీ కవి’ అనే నాటికను వ్రాసి, ‘మకరంద మూర్తి’ అనే పాత్రను ధరించి, దర్శకత్వం వహించి, ఉత్తమ బహుమతిని అందుకున్నారు. ‘ఆచార్య కె. గోపాలకృష్ణారావు, ఆచార్య పల్లా దుర్గయ్య, ఆచార్య దివాకర్ల వేంకటావధాని తదితరులు ఆయన గురువులు. ఎం.ఏ. పూర్తి చేసి, 1954-55లో కొంతకాలం, సికింద్రాబాద్ ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరరుగా పనిచేసి, అదే కాలేజీలో 1955లో ఆంధ్రోపన్యాసకులుగా ఉద్యోగం ఆరంభించారు. 1958-59లో నిజాం కళాశాలలో ఉపన్యాసకులుగా పనిచేస్తునే 1957 నుండి 1962వరకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి సూచనను అనుసరించి, ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో – ‘ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు, ప్రయోగములు’ అనే విషయంపై పరిశోధన సాగించి, 1962లో పిహెచ్.డి. పట్టా పొందారు.

1963లో ఉస్మానియా విశ్వ విద్యాలయం తెలుగు శాఖలో ‘రీడర్’ అయ్యారు. 1976లో ఆచార్యులై, 1981 వరకు బోధన సాగించారు. నారాయణరెడ్డి భార్య సుశీల కాగా, నలుగురు కూతుళ్ళకు – గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి అని పేర్లు పెట్టు కున్నారు. ఆయన 50వ జన్మ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికార భాషా సంఘాధ్యక్ష పదవిని అందించింది. ఆ జన్మదినోత్సవ సన్మాన సభలో నారాయణరెడ్డి -‘ఎవరికి ఈ సన్మానం, ఎందుకు ఈ సన్మానం, చెట్టంతటి పేరొందిన చిగురుకు ఈ సన్మానం‘ అని ప్రారంభించి…‘పేరేమో సింగిరెడ్డి నారాయణరెడ్డి కాని, కులం కీళ్ళు విరిచే నాకలానికీ సన్మానం‘ అంటూ ఒక గేయ కవిత చదవగా; సభంతా హర్ష ధ్వానాలతో మారుమ్రోగింది. అధికార భాషా సంఘం అధ్యక్షులుగా 4-9-1981 నుండి 7-8-1985 వరకు, సార్వత్రిక విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులుగా, తర్వాత దేశంలో ప్రథమ సార్వత్రిక విశ్వ విద్యాలయమైన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షులుగా నియమితులై, 8.8.1985 నుండి 20.6.1989 వరకు, విధులను నిర్వహించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఉపాధ్యక్ష పదవిని 21.6.1989 నుండి 4.11.1992 వరకు నిర్వహించారు. విశ్వ విద్యాలయంలో ప్రథమ స్నాతకోత్సవం తెలుగులో నిర్వహింప బడిన సందర్భంలో, అప్పటి ఛాన్స్ లర్, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పాల్గొనగా, ఉప రాష్ట్రపతి డా. శంకర్ దయాళ్ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. 7.7.1991నాడు జరిగిన రెండవ స్నాతకోత్సవంలో, నాటి ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. 1990 మార్చి 10, 11, 12 తేదీలలో బెంగుళూరులో ‘మూడవ అఖిల భారత తెలుగు మహాసభలు’ నిర్వహింప బడ్డాయి. అంతేకాక, మారిషస్ లో 1990 డిసెంబర్ లో “మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు”నిర్వహించింది ఈ తెలుగు విశ్వవిద్యాలయమే. సినారె

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో భాషా సాంస్కృతిక సలహాదారుగా, సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా, ఆ తరువాత 1997 జులై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా పని చేశారు. ఆ సమయం లోనే భారత రాష్ట్రపతి రాజ్యసభ సభ్యునిగా నామనిర్దేశం చేయగా, 27.8.1997 నుండి 26.8.2003 వరకు కొనసాగారు. దక్షిణ భారతం నుండి రాజ్యసభ సభ్యులుగా నియమింప బడిన ప్రథమకవి ఆయనే కావడం విశేషం. నవ్వని పువ్వు” (1953) మొదలుకొని, – ‘అలలెత్తే అడుగులు’ (2013), నింగికెగిరే చెట్లు (2014) వరకు 18 ప్రక్రియలలో సుమారు 90 గ్రంథాలు రచించారు. మాకందా’లను అందించడంలో, వచన కవిత్వంలో వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో ‘ప్ర’పంచ పదులను నిర్మించడంలో – తెలుగు గజళ్ళకు మానవీయ దృక్పథాన్ని అనుసంధించడంలో, ప్రతీకాత్మకంగా వచన కవితలో ‘ఇతిహాస కావ్యాన్ని’-‘విశ్వంభర’ను నిర్మించడంలో, ‘మట్టీ – మనిషీ – ఆకాశం’ వంటి వచన కవితా ‘కావ్యేతి హాసాన్ని’ సంవిధాన సంపన్నంగా సృజించడంలో, ‘పాటలో ఏముంది నా మాటలో ఏముంది’ వంటి స్వీయ చలన చిత్ర గీతికా వ్యాఖ్యా రచనలో, ఋతు వర్ణనలను జీవితానికి సమన్వయిస్తూ ‘ఋతుచక్రం’ వంటి కావ్య రచనలో, గేయ కావ్యాలకు పద్య కావ్య ప్రౌఢిని, ప్రామాణికతనూ సంతరించడంలో, శతశతాధిక నూతన పదబంధ కల్పనంలో మహాకవి సినారె ప్రయోగశీలం ప్రస్ఫుట మవుతుంది.

ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపన్యాసకులుగా ఉంటూనే, 1962లో ఎన్టీ రామారావు ఆహ్వానంపై చలనచిత్ర రంగంలో ప్రవేశించారు. తొలి సినీ గీతం – “నన్ను దోచుకొందువటే”. ‘గులేబకావళి కథ’ చిత్రంలోని పాటలన్నీ ఆయన వ్రాసినవే. ఆనాటి ‘గులేబకావళి కథ’ చిత్రం నుండి ఇటీవలి ‘అరుంధతి’, ‘మేస్త్రీ’ సినిమాల వరకు, మూడున్నర వేలకు పైగా సినిమా పాటలు రచించి, చలన చిత్ర జగత్తులో తమ ప్రత్యేక స్థానాన్ని భద్రపరచు కున్నారు. ‘ఏకవీర’, ‘అక్బర్ సలీమ్ అనార్కలీ’ అనే రెండు చిత్రాలకు సంభాషణలు కూడా రచించారు. తెలుగువారే కాక శంకర్ జైకిషన్, సి. రామచంద్ర, ఓ.పి. నయ్యర్, రవీంద్ర జైన్, ఉషా ఖన్నా, బప్పీ లహరి – వంటి ప్రముఖ హిందీ సంగీత దర్శకులు 50 మందికి పైగా కలిసి పనిచేశారు. ఘంటసాల గళం నుండి సినారె గీతాలధికంగా జాలు వారాయి. మూగజీవులు, శభాష్ పాపన్న, మొగుడా పెళ్ళామా, తూర్పు పడమర చిత్రాలలో కావ్య సంబంధమైన పాత్రలలో ఆయన కనిపించారు.

(జూన్ 12 జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత సినారె వర్ధంతి)

రామ కిష్టయ్య సంగనభట్ల
94405 95494

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News