Home తాజా వార్తలు కామ్రేడ్ బూర్గుల కన్నుమూత

కామ్రేడ్ బూర్గుల కన్నుమూత

Telangana Freedom Fighter Burgula Passes Awayమన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు, అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు, ఎఎస్‌ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు కామ్రేడ్ బూర్గుల నర్సింగరావు(89) కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన నగరంలోని కేర్ ఆసుపత్రిలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బూర్గుల నర్సింగరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ, తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్లోనూ నర్సింగ రావు పాత్ర మరువలేనిదని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నో కమ్యూనిస్టు, ప్రగతిశీల ఉద్యమాలను బూర్గుల నర్సింగరావు ముందుండి నడిపించారని సిఎం కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
బూర్గుల సేవలు చిరస్మరనీయం : కెటిఆర్
సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు బూర్గుల నర్సింగరావు మృతి పట్ల రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. హైద్రాబాద్ సంస్థానంలో విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిన యోధుడు బూర్గుల అని కొనియాడారు. తెలంగాణ తొలిదశ పోరాటం నుండి మలిదశ పోరాటం దాకా అలుపెరుగకుండా పోరాడారని అన్నారు. బూర్గుల నర్సింగరావు మృతి తెలంగాణకు తీరని లోటు -అని పేర్కొన్నారు. తెలంగాణకు ఆయన సేవలు చిరస్మరణీయమైనవని కెటిఆర్ వ్యాఖ్యానించారు.
సంతాపం తెలిపిన వామపక్ష పార్టీల నాయకులు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలోనూ తనవంతు పాత్ర పోషించిన నర్సింగరావు మృతి పట్ల వామపక్ష పార్టీల నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి, డాక్టర్ కె. నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, అజీజ్ పాషా, పల్లా వెంకట రెడ్డి, కూనంనేని సాంబశివరావు, తెలంగాణ అమరవీరుల ట్రస్టు కార్యదర్శి కందిమల్ల ప్రతాపరెడ్డి, ఆరుట్ల ఫౌండేషన్ అధ్యక్షురాలు ఆరుట్ల సుశీల తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు. సిపిఐ సీనియర్ నేత నారాయణ మాట్లాడుతూ, బూర్గుల నర్సింగరావు అహర్నిశలు కమ్యూనిస్ట్ ఉద్యమ పురోభివృద్ధికి కృషి చేశారన్నారు. తమకు పెద్దదిక్కుగా ఉండేవారని, వారిమరణం కమ్యూనిస్ట్, ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు.