Thursday, April 25, 2024

టాలీవుడ్‌పై సిఎం కెసిఆర్ వరాల జల్లు

- Advertisement -
- Advertisement -

 

సినిమా పరిశ్రమపై సిఎం కెసిఆర్ వరాల జల్లు కురిపించారు. కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమను ఆదుకోవడానికి ఆయన వరాలు ప్రకటించారు. ఇటీవల సినీపరిశ్రమ పెద్దలు కెసిఆర్‌ని కలిసి కరోనా క్రైసిస్ వల్ల పరిశ్రమ ఎంతగా నష్టపోయిందో ఆయనకు వివరించారు. దీనికి స్పందనగా ఇప్పుడు కెసిఆర్ నుంచి వరాల జల్లు కురిసింది. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో భాగంగా టిఆర్‌ఎస్ మెనిఫెస్టోలో టాలీవుడ్‌కు స్థానం కల్పించారు. సినిమా పరిశ్రమను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పిన కెసిఆర్… 10 కోట్ల్లలోపు నిర్మించే సినిమాలకు జీఎస్టీ రియంబర్స్‌మెంట్‌ను కల్పిస్తున్నట్లుగా చెప్పారు. అదేవిధంగా కొన్ని ఇతర రాష్ట్రాలలో ఉన్న మాదిరిగా థియేటర్ల వారు ఇష్టప్రకారం షోలు పెంచుకునేందుకు అనుమతినిచ్చారు. సినిమా టికెట్ రేట్స్‌లో సవరణలు చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లుగా కెసిఆర్ ప్రకటించారు.

ఇంకా సినిమా పరిశ్రమలో ఉన్న దాదాపు 40 వేల కార్మికులకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అందజేసి వారిని ఆదుకుంటామని తెలియజేశారు. టాలీవుడ్‌ను కాపాడుకోవటానికి ప్రభుత్వపరంగా రాయితీలు, మినహాయింపులు ఇస్తామని సిఎం ప్రకటించారు. అలాగే థియేటర్లకు కనీస విద్యుత్తు ఛార్జీలను కూడా రద్దు చేస్తామని ఆయన తెలిపారు. థియేటర్లను ఎప్పుడైనా తెరుచుకోవచ్చని చెప్పిన సిఎం… ఈ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు సినీ పరిశ్రమకు పూర్తి అధికారమిస్తున్నామని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో సినిమా థియేటర్లు, మల్లీప్లెక్స్‌కు అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది.
కంటైన్‌మెంట్ జోన్‌లో లేని ప్రాంతాల్లో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లు ప్రారంభించుకోవాలని సూచించింది. పూర్తిగా ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ నిబంధనలను పాటించాలని ఆదేశించింది. సినిమా థియేటర్లు, మల్లీప్లెక్స్‌లలో పనిచేసే సిబ్బంది, ప్రేక్షకులు, క్యాంటీన్ నిర్వాహకులు తప్పని సరిగా మాస్క్ ధరించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రవేశ ద్వారాల వద్ద, వెళ్లేసమయంలో, ముఖ్యమైన చోట్ల హ్యాండ్‌శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని సూచించింది. ఇక క్రౌడ్ మేనేజ్‌మెంట్, భౌతిక దూరం తప్పని సరిగా పాటించాలన్నారు. ప్రతి షో పూర్తయిన వెంటనే హాల్‌ను పూర్తి శానిటైజ్‌చేయాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే షో టైమింగ్, ఇంటర్వెల్ సమయాలను కూడా ఎప్పటికప్పుడు మార్చుకునేలా వెసులుబాటు కల్పించారు.
సినీ ప్రముఖుల హర్షం…
సీఎం కెసిఆర్ వరాలు ప్రకటించినందుకు టాలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కెసిఆర్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. సినీ పరిశ్రమలో వ్యాపారాన్ని పునరుద్ధరించడానికి సిఎం కెసిఆర్ చొరవ చూపినందుకు చిరు తన ట్విట్టర్‌లో ప్రశంసించారు. సినీ పరిశ్రమను ఆదుకోవడానికి కెసిఆర్ చర్యలు చేపట్టినందుకు హృదయపూర్వక ధన్యవాదాలని చిరంజీవి చెప్పారు. కెసిఆర్ నేతృత్వంలో ఆయన విజన్‌కి తగ్గట్టుగా టాలీవుడ్ అభివృద్ధి సాధించి… దేశంలోనే మొదటి స్థానాన్ని పొందుతుందన్న పూర్తి విశ్వాసం తమకుందని తెలిపారు. ఇక నాగార్జున మాట్లాడుతూ “కరోనాతో సినీ పరిశ్రమలో చీకటి అలుముకుంది. ఈ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ కోలుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నందుకు సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు”అని అన్నారు. అదేవిధంగా సీనియర్ స్టార్ వెంకటేష్, స్టార్ హీరో రామ్‌చరణ్ కూడా సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు చెప్పారు.
ఫిలిం ఛాంబర్ ధన్యవాదాలు…
టాలీవుడ్‌ను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలియజేసింది. థియేటర్లు తెరవడానికి, చిత్ర పరిశ్రమ నిలదొక్కుకోవడానికి సిఎం కెసిఆర్ ప్రకటించిన వరాలు తోడ్పడతాయని ఛాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ కృష్ణదాస్ నారంగ్, కార్యదర్శులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, ఎం.రమేష్ తెలిపారు. ఇక సిఎం వరాలు ప్రకటించేందుకు కృషిచేసిన చిరంజీవి, నాగార్జునలకు కూడా వారు ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News