Home తాజా వార్తలు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి చెక్

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి చెక్

land survey నిషేధిత భూములపై మళ్లీ సర్వే
హైదరాబాద్, నిజామాబాద్ మినహా పాత 8 జిల్లాల్లో రీ సర్వే

హైదరాబాద్: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రాథమిక దశలోనే నిలువరించేలా రెవెన్యూ శాఖ పకడ్భందీ చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే  ప్రస్తుతం అమల్లో ఉన్న 112 చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. భవిష్యత్తులో భూ వివాదాలకు తావు ఇవ్వకుండా కొత్త చట్టం ఉండేలా నిపుణుల కమిటీ జాగ్రత్తలు తీసుకుంటోంది. కొత్త చట్టం అమలుకు ముందే రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమిని లెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫైలట్ ప్రాజెక్టుగా మూడు గ్రామాల్లోని భూములను సర్వే చేయడానికి అధికారులు సిద్ధం అయ్యారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని తుర్కగూడ ఎర్రకుంట, లకా్ష్మపూర్ గ్రామాల్లో అమలు చేస్తున్నారు. భూ సర్వేకు సంబంధించి రూ.525 కోట్లు కావాలని కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు పంపగా దీనిపై సానకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం రూ.267 కోట్లు విడుదల చేయగా, అందులో తొలివిడతగా రూ.83 కోట్లను మంజూరు చేసింది.

ప్రైవేటు భూములను ఆనుకొని ఉన్న,  ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం

కొందరు ప్రైవేటు వ్యక్తులు తమ భూమితో పాటు పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని సైతం ఆక్రమించుకొని కబ్జాలకు తెరతీస్తున్నారు. దీనికితోడు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సైతం సహకారం అందిస్తుండడంతో ప్రభుత్వ భూములు చాలావరకు అన్యాక్రాంతం అయ్యాయి. దీనిపై కోర్టుల్లో కేసులు నడుస్తుండగా మరికొన్ని చోట్ల వాటిని ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో నిషేధిత జాబితాలో ఉన్న భూములతో పాటు ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా చూడాలని రిజిస్ట్రేషన్‌కు శాఖ గతంలో రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు చాలాచోట్ల ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములతో కలుపుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో వాటిని మరోసారి సర్వే చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించినట్టు సమాచారం.

నోటిఫై జాబితా పంపించడంలో జాప్యం

రాష్ట్రంలో దేవాదాయ, వక్ఫ్, అసైన్డ్, ప్రభుత్వ, అటవీ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా గత ప్రభుత్వాల హయాంలో చట్టాన్ని రూపొందించాయి. దీని ప్రకారం ఆయా భూములు రిజిస్ట్రేషన్ కాకుండా ప్రాథమిక దశలోనే నిలువరించేలా రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ల్ శాఖకు భూముల వివరాలను పంపించింది. అప్పడు పంపించిన వివరాలు మరోసారి నవీకరించకపోవడంతో కబ్జాదారులు వాటిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. రెవెన్యూ శాఖ నోటిఫై చేసిన జాబితా పంపించడంలో జాప్యం చేస్తుండడంతో సబ్ రిజిస్ట్రార్లు చేసేది ఏమీ లేక రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరాధీనం అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ల చట్టం 1908 కింద రెవెన్యూ శాఖ ప్రభుత్వ భూములను సెక్షన్ 22 ఎ నుంచి ఇ వరకు విభజించింది.

ఆయా ఉప సెక్షన్ల పరిధిలోకి వచ్చే సర్వే నెంబర్లలోని భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఈ జాబితాను జిల్లాల కలెక్టర్లు రూపొందించి రిజిస్ట్రేషన్ల శాఖకు పంపాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ జాబితాలోని భూములను కొనుగోలు చేస్తే దానిని అడ్డుకోవడానికి తగిన చర్యలు తీసుకునే వీలు ఉంటుంది. కొన్నిచోట్ల కలెక్టర్లు ఈ భూములకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ పంపించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రెవెన్యూ శాఖ గుర్తించింది. రానున్న రోజుల్లో సర్వేపై దీని ప్రభావం ఉంటుందని కూడా త్వరగా ఈ భూములకు సంబంధించిన జాబితా పంపించాలని కూడా రెవెన్యూ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.

సెక్షన్ 22 (ఎ) పరిధిలోకి వచ్చే భూములు
అటవీ భూములు 41.74 లక్షల ఎకరాలు
దేవాదాయ భూములు 74 వేలు, వక్ఫ్ భూములు 45 వేలు
ప్రభుత్వ భూములు 21.04 లక్షల ఎకరాలు
అసైన్డ్ భూములు 44.42 లక్షల ఎకరాలు
ఇవన్నీ 22 (ఎ) సెక్షన్ పరిధిలోకి వస్తాయి. వీటి కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిషిద్ధం.

1940 దశకంలో జరిగిన సర్వే వివరాలను
అప్‌డేట్ చేసేందుకు
అయితే ఇవన్నీ కొలిక్కి రావాలంటే రాష్ట్రంలో ఉన్న భూములపై స్పష్టత రావాల్సి ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే మరోసారి సర్వే చేసి రికార్డులను తయారు చేయాలని ఆ తరువాతే కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని కెసిఆర్ ఆలోచనగా అధికారులు పేర్కొంటున్నారు. అందులో భాగంగానే ఆర్‌ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) విధానంలో మార్పులు, పహాణీలో అక్కరలేని, నిబంధనలను తొలగించడంతో పాటు ప్రతి అంగుళం భూమికి అసలు యజమానులు ఎవరో నిర్ధారించి వాటిపై భూ హక్కులను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

దశాబ్ధం కాలం నాటి భూ రికార్డులను ఆధునీకరించాలని అందులో భాగంగానే భూములను సమగ్రంగా రీ సర్వే చేయాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. పాత రికార్డులను సంస్కరించడం ద్వారా రాష్ట్రంలోని వివాదాలు లేని సరిహద్దులను నిర్ధారించాల్సి ఉంది. రాష్ట్రంలో 1940 దశకంలో జరిగిన సర్వే వివరాలను అప్‌డేట్ చేసేందుకు రీ సర్వే చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. అందులో భాగంగా తెలంగాణలోని పాత జిల్లాలైన హైదరాబాద్, నిజామాబాద్ మినహా మిగతా 8 పాత జిల్లాల్లో పునః సమగ్ర భూ సర్వే చేయాలని రెవెన్యూ శాఖ ప్రభుత్వాన్ని కోరిందని, దీనికి ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ అందడంతో వారు సర్వేకు అన్ని సిద్ధం చేసుకున్నారు.

Telangana government to conduct land survey