Home తాజా వార్తలు వీరప్పన్లకు పదేళ్లు జైలు?

వీరప్పన్లకు పదేళ్లు జైలు?

 

పది లక్షల వరకు జరిమానా, కొత్త అటవీ నేరాల చట్టం, ముసాయిదా సిద్ధం

మన తెలంగాణ/ హైదరాబాద్: అటవీ నేరాలను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త అటవీ చట్టాన్ని తీసుకొస్తోంది. ఇప్పటికే అటవీ, న్యాయశాఖలు ఈ చట్టం ముసాయిదాను రూపొందించాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ పరిశీలించిన తర్వాత అవసరమైన మార్పులు చేర్పులు, సవరణలు చేసిన తర్వాత తుది బిల్లు తయారవుతుంది. ఈ నెల చివర్లో ఔటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నందున ఆ సమయంలోనే ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ఐదు దశాబ్దాల క్రితం పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినందున మొత్తం దేశానికే ఆదర్శంగా ఉండేలా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన మేరకు రాష్ట్ర అటవీ శాఖ ముసాయిదాను రూపొందించింది. అటవీ నేరాలకు పాల్పడేవారికి మూడేళ్ళనుంచి పదేళ్ళ వరకు జైలు శిక్ష పడడంతో పాటు గరిష్టంగా పది లక్షల రూపాయల జరీమానా విధించే విధంగా ఈ చట్టంలో నిబంధనలు ఉండనున్నట్లు తెలిసింది.

నేరాలకు పాల్పడేవారితో పాటు ప్రోత్సహించేవారిని, పలు రూపాల్లో సహకరించేవారిని, ప్రేరేపించేవారిని కూడా ఈ చట్టం ద్వారా శిక్షించే విధంగా ముసాయిదాలో సెక్షన్లను పొందుపర్చినట్లు సమాచారం. నిర్దిష్ట అడవి నుంచి కలప లేదా వన్య ప్రాణులకు సంబంధించినవి అక్రమంగా రవాణా అవుతూ ఉంటే వాటికి కేవలం రవాణా చేస్తున్నవారిని మాత్రమే బాధ్యులను చేయడంతో సరిపెట్టకుండా విధుల్లో నిర్లక్షంగా ఉన్నందుకు అటవీశాఖ అధికారులను, ఆ పరిధిలో ఉండే పోలీసు అధికారులను కూడా జవాబుదారీ చేసేలా (శిక్షార్హులు కాకపోయినా) ఈ చట్టంలో నిబంధనలు ఉండే అవకాశం ఉంది. అడవులను సంరక్షించడం, అటవీ సంపదను కాపాడడం, కలప అక్రమ రవాణాను నిరోధించడంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల వరుస సమీక్షలు నిర్వసించి పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ ఆలోచనలకు అనుగుణంగా ఈ కొత్త చట్టం రూపొందుతున్నట్లు సమాచారం. చట్టంలో కఠిన నిబంధనలను పెట్టడం ద్వారా ప్రభుత్వం ఆశించిన లక్షం నెరవేరడంతో పాటు నేరాలకు పాల్పడేవారికి భయం పుట్టేలా ఉండాలన్నది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అటవీ సంపద అక్రమంగా తరలిపోతూ ఉన్నప్పుడు ఆ పరిధిలో ఉండే ప్రజా ప్రతినిధులను కూడా బాధ్యులుగా చేసే అంశాన్ని కూడా ఈ చట్టంలో పొందుపర్చనున్నట్లు తెలిసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల పెద్దపులి వేట కోసం విద్యుత్ కంచెలను ఏర్పాటుచేయడం, స్థానికంగా ఉండే విద్యుత్ సిబ్బందికి ఈ సమాచారం ముందుగానే తెలిసినా స్పందించలేదనే ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నేరం జరుగుతున్నప్పుడు ప్రేక్షకపాత్ర వహించినా, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నేరం జరగడానికి సహకరించినా వారు కూడా నేరంలో భాగస్వాములేనని, శిక్షను అనుభవించేందుకు అర్హులని ఈ కొత్త చట్టంలో ప్రభుత్వం పేర్కొననున్నట్లు తెలిసింది.

కొత్తాగా 1856 మంది బీట్ ఆఫీసర్లు, 66 మంది ఫారెస్టు రేంజ్ ఆఫీసర్లు,
90 మంది సెక్షన్ ఆఫీసర్లు

 రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకే రోజున 1856 మంది ఫారెస్టు బీట్ ఆఫీసర్ల నియామకానికి వీలుగా ఫలితాలను, అర్హులైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో త్వరలో వీరంతా శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరనున్నారు. వీరితో పాటు 66 మంది ఫారెస్టు రేంజ్ ఆఫీసర్లు, 90 మంది ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు కూడా త్వరలోనే విధుల్లో చేరనున్నారు. త్వరలోనే రాష్ట్ర అటవీ శాఖలో మొత్తం 2012 మంది సిబ్బంది కొత్తగా అందుబాటులోకి వచ్చినట్లయిందని, వీరి ద్వారా అటవీ చట్టాలను పకడ్బందీగా అమలుచేయడానికి మార్గం సుగమమైందని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పి.కె. ఝా ఒక ప్రకటనలో సంతోషం వ్యక్తం చేశారు.
వీరంతా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులవుతున్నారని, సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్న అటవీ శాఖకు ఒకేసారి రెండు వేల మందికి పైగా అందుబాటులోకి రావడం పెద్ద ఊరట అని వ్యాఖ్యానించారు. కొత్త సిబ్బంది రాకతో అటవీశాఖలో నైతిక బలం మరింత పెరిగిందని, ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించిన అటవీ సంరక్షణా చర్యలు, హరితహారం లాంటి కార్యక్రమాలను మరింత పకడ్బందీగా చేపట్టేందుకు దోహదం కలిగిందన్నారు. సెక్షన్ ఆఫీసర్లు, బీట్ అధికారులు స్వల్పకాలిక శిక్షణ పూర్తిచేసుకుని త్వరలోనే విధుల్లో చేరుతారని తెలిపారు.

Telangana Govt imposes New Forest Act in Next Budget