Home తాజా వార్తలు అన్నం పెట్టే రైతు నోట్లో సున్నం

అన్నం పెట్టే రైతు నోట్లో సున్నం

Telangana govt to regulate paddy farming
దొడ్డు బియ్యంపై కేంద్రం
దొడ్డ మనసు ప్రదర్శించాలి
రాష్ట్రంలో కోటీ 12 లక్షల మెట్రిక్
టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు
వానా కాలం పంట వస్తే నిల్వ చేసే
జాగే లేదు, ఎగుమతులు చేయాలంటే
పొరుగు దేశాల రేట్లే తక్కువ, దేశీయ
వినియోగంలో దొడ్డు బియ్యం
తినేవారు కేరళ తప్ప ఎక్కడా లేరు,
ప్రపంచ మంతటా పుష్కల పంటలతో
దిగుమతులే పెరుగుతున్నాయి,
ఉత్తరాది గోధుమకు ఇచ్చిన మద్దతు
బియ్యానికి లేదు
సంక్షోభ నివారణ మార్గాలు
నియంత్రిత పంటల సాగు తప్పదు
ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి
పంటల నిల్వకు అవసరమైన గోడౌన్లు శీతలీకరణ వ్యవస్థలు, కనీస మద్దతు ధరపై నిర్ణయం
బియ్యం అనుబంధ ప్రాసెసింగ్ పరిశ్రమలు భారీగా పెంచడం
(మిట్టపల్లి శ్రీనివాస్)

రాష్ట్రంలో వానా కాలం సీజన్‌లో వచ్చే వరి దిగుబడుల తర్వాత ఏర్పడబోయే దొడ్డు బియ్యం సంక్షోభం పై కేంద్రమే దొడ్డ మనసును ప్రదర్శించి రైతులు రోడ్డున పడకుండా ధాన్యం సేకరణ నిషేధాన్ని ఎత్తి వేసి సమస్యను పరిష్కరించడమే మార్గంగా కనిపిస్తున్నది. ఈ విషయంలో కేంద్రానికి విస్తృత వనరులు, అవకాశాలు ఉన్నా సహాయ నిరాకరణ వైఖరిని అవలంబించడం, రాష్ట్రానికి అనేకానేక పరిమితులు ఉండడంతో మునుపెన్నడూ లేని విధంగా ధాన్యం సేకరణలో ఈ దఫా పలు సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తరాదిలో అత్యధికంగా పండించే గోధుమల కొనుగోలు విషయంలో కేంద్రం ఎంతో మద్దతు ఇస్తున్నా అలాంటి సానుకూల మద్దతు మన బియ్యానికి లభించడం లేదు.

అన్నం పెట్టే రైతు నోట్లో సున్నం కొట్టేలా ధాన్యం సేకరణలో రాజకీయాలకు స్వస్తి పలికి సామాజిక బాధ్యతగా కేంద్రం ఈ ఒక్కసారికైనా ధాన్యం నిల్వలను కొనుగోలు చేయకపోతే ఉపద్రవాలు తప్పని పరిస్థితి కనిపిస్తున్నది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో నిల్వ ఉండబోయే కోటీ 12 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేసి వచ్చే సీజన్‌కు ఈ రకాల పంటలకు సెలవు ముందే ప్రకటిస్తే తప్ప బియ్యం కొనుగోలు సమస్య పరిష్కారం అయ్యేట్లు కనిపించడం లేదు. గడిచిన యాసంగి , ప్రస్తుత వానా కాలం సీజన్‌లో కేంద్రం కొనుగోలు చేస్తామని చెప్పిన పరిమాణం కాక మిగులుగా రాష్ట్రంలో యాసంగిలో 37 లక్షలు, వానా కాలంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు పేరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో ప్రాజెక్టుల సాగు గణనీయంగా పెరగడంతో తొలిసారిగా కోటి 40 లక్షల టన్నుల ధాన్యం రాబోతున్నది. ఇందులో కేవలం 60 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని అంతకు మించి కిలో బియ్యం కూడా కొనుగోలు చేయమని కేంద్రం కరాఖండిగా చెప్పడంతో రైతుల్లో, మిల్లర్లలో తీవ్ర ఆందోళన నెలకొన్నది. ఎగుమతులు లేక రాష్ట్రంలో, దేశంలో డిమాండ్‌ను మించి సరఫరా పెరిగిన పరిస్థితుల్లో కేంద్రం కూడా అర్ధాంతరంగా చేతులెత్తేయడం ప్రస్తుత సంక్షోభానికి కారణమైంది. దేశ వ్యాప్తంగా గోడౌన్లలో ఐదేళ్లకు సరిపడా నిల్వలుంటే కొనుగోలు చేసి ఏమి చేసుకోవాలని కేంద్రం ప్రశ్నిస్తున్నది.

కాని 2001 , 2002 సంవత్సరాల్లో కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు బియ్యం డిమాండ్ మించి సరఫరా ఏర్పడింది. అప్పుడు వాజ్‌పేయి ప్రభుత్వం రైతులు నష్టపోకుండా మొత్తం మిగులు నిల్వలను కొనుగోలు చేసి మానవతా దృక్పథాన్ని ప్రదర్శించింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపించని రీతిలో కేంద్రం కఠినాతికఠినంగా వ్యవహరించడం వెనుక రాజకీయాలు తప్ప మరొకటి కనిపించడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం దొడ్డు బియ్యం పంటకు విధాన నిర్ణయాన్ని సీజన్‌కు ముందే ప్రకటించాలి. కాని ఈ ఏడాది సీజన్ ప్రారంభమైన తర్వాత జనవరిలో బాయిల్డ్ రైస్ కొనమని ప్రకటించారు. అప్పటికే రైతు నారు వేశారు. ఆ తర్వాత ప్రస్తుత సీజన్‌లో కూడా ప్రభుత్వం ప్రకటించిన అనేకానేక వ్యవసాయ అనుకూల విధానాలతో రైతులు భారీగా ధాన్యం పండించి దేశంలోనే రికార్డు సృష్టించారు. ఇందులో ముఖ్యమంత్రి కెసిఆర్ గడిచిన రెండు సీజన్ల నుంచి నియంత్రిత సాగు, దొడ్డు రకాలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. ఫలితంగా కొంత దొడ్డు రకాల సాగు తగ్గి సన్న రకాలు పెరిగినా కేంద్రం ఉరుములేని పిడుగులా హఠాత్తుగా దొడ్డు బియ్యం సేకరణ పై నిషేధం విధించడంతో అంతటా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుత మిగులు ధాన్యం కొనుగోలుకు కేంద్రం పరిష్కారం చూపకుండా బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టివేసి రైతులను రోడ్లపైకి వచ్చేలా దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తున్నది.

అమ్మాలన్నా కొనేవారు లేరు, తినేవారు లేరు

ప్రభుత్వమే కొనుగోలు చేసి దేశీయ మార్కెట్‌లో అమ్మాలంటే కొనేవారే లేరు. ఉప్పుడు బియ్యాన్ని కేరళ, తమిళనాడులో ఎక్కువగా వినియోగించేవారు. ఇప్పుడు కేరళ తప్ప దేశంలో ఎక్కడా దొడ్డు బియ్యం తినడానికి వాడడం లేదు. సన్న రకాలనే తింటున్నారు. పోనీ ప్రపంచ మార్కెట్‌లో విక్రయిద్దామంటే మన పొరుగున ఉన్న పాకిస్తాన్, వియత్నాం, థాయ్‌లాండ్ దేశాలు మనకంటే తక్కువ రేటుకు ప్రపంచ మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి. మనం కేజి బియ్యాన్ని పోర్టులో కిలో రూ. 32 లకు విక్రయిస్తుంటే థాయ్‌లాండ్, వియత్నాం, పాకిస్తాన్‌లు రూ. 26 లకే విక్రయిస్తున్నాయి. ఇక్కడ కనీస మద్దతు ధర ఉండడంతో పొరుగు దేశాలతో రేటు విషయంలో పోటీ పడలేకపోతున్నాము. వియత్నాం లాంటి చిన్న దేశాలు ముందు చూపుతో యూరోపియన్ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకొని దిగుమతి సుంకాల భారాలు లేకుండా అక్కడ భారీగా విక్రయిస్తున్నాయి. ఇలాంటి దూరదృష్టి ఇక్కడి కేంద్ర పాలకుల్లో కనిపించడం లేదు. గడిచిన మూడేళ్లలో మన దేశం నుంచి ఇతర దేశాలకు మనం పండించిన బియ్యంలో 10 శాతం కూడా ఎగుమతి చేయలేని దయనీయ పరిస్థితిలో ఉంటే పాకిస్తాన్‌లో 50 శాతం, థాయ్‌లాండ్‌లో 30 శాతం, వియత్నాంలో 30 శాతం అక్కడ పండిన పంటలో ఎగుమతులు అవుతున్నాయి. ఆ దేశాల్లో ధాన్యం ఎగుమతులకు ఆంక్షలు లేకపోవడం, ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉండడం ఎగుమతులు పెరగడానికి కారణంగా కనిపిస్తున్నాయి.

ప్రత్యామ్నాయ పంటలే పరిష్కారం

వచ్చే సీజన్ నుంచి బియ్యం నిల్వల సంక్షోభం ఏర్పకుండా ఉండాలంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ విషయంలో సమన్వయంతో విధాన నిర్ణయాలు ప్రకటించాలి. ముందుగా దేశంలో, ప్రపంచంలో డిమాండ్‌లేని దొడ్డు బియ్యం లాంటి పంటలపై ముందుగానే విరామ నిర్ణయం ప్రకటించాలి. ఆ రైతులు క్రమంగా పప్పు దినుసులు, నూనె గింజలు, పండ్లు, పూలు, కూరగాయలు వేసేలా రైతుల్లో చైతన్యాన్ని తీసుకు రావాలి. ఏ పంటకు ఎలా డిమాండ్ ఉందో, పంట మార్పిడి లాభాల పంట ఎలా పండిస్తుందో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్ర స్థాయిలో రైతులకు అర్థమయ్యే రీతిలో చైతన్యవంతం చేయాలి. అప్పుడే రైతులు పంట మార్పిడికి ముందుకు వస్తారు. మన కంటే చిన్న దేశాలు పంటలు ఎగుమతులు చేసి ఎలా లాభాలు ఆర్జిస్తున్నాయో, రైతులకు మద్దతు ధర కన్నా ఎక్కువ ధర ఎలా వస్తుందో వివరించగలగాలి. అంతకు మించి ఎగుమతులకు, నిల్వలకు తగినట్లుగా శీతలీకరణ గోడౌన్లు పెద్ద సంఖ్యలో నిర్మించాలి. పండ్లు, కూరగాయలు, పూలు రవాణాలో చెడిపోకుండా కోల్డ్ చైన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఎగుమతులకు వీలుగా విమాన సౌకర్యాలు కల్పించాలి. ఇలాంటి చర్యలన్నీ రైతుల్లో భరోసాను నింపి పంటలు మార్చుకునేలా చేస్తాయి. కాని బలవంతుపు చర్యలతో రైతులు పంట మార్పిడికి ముందుకు రారని గత అనుభవాలు రుజువు చేస్తున్నాయి.

పంటల మార్పిడిపై రైతుల్లో చైతన్యం ఉద్యమంలా సాగాలి

ప్రస్తుత దొడ్డు బియ్యం సంక్షోభ సమస్యకు పరిష్కారం ఆ పంటకు సెలవు ప్రకటించడమే. అయితే అది ముందస్తుగా ప్రభుత్వం ప్రకటించాలి. రైతులకు పరిస్థితిని వారికి అర్థమయ్యే రీతిలో వివరించాలి. దొడ్డురకం బియ్యం నుంచి రైతులు కొంత సన్నాలు మరికొంత పప్పుదినుసులు, నూనె గింజలు, పండ్లు, పూలు, కూరగాయల పంటలు వేసేలా చైతన్యం ఉద్యమంలా కొనసాగాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో సమన్వయంతో రైతులకు ప్రతి సీజన్ ముందు మార్గనిర్దేశం చేయాలి. ఎగుమతుల విషయంలో కేంద్రం యూరోపియన్ దేశాలతో వియత్నాం మాదిరిగా ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు చేసుకోవాలి. దీనివల్ల ఇతర దేశాల కన్నా మనం తక్కువ రేటుకు ఎగుమతులు చేయవచ్చు. మంచుకొండ వెంకటేశ్వర్లు, ప్రముఖ కమోడిటీ ఎగుమతిదారు