Home తాజా వార్తలు హైకోర్టు ముందుకు సమ్మె

హైకోర్టు ముందుకు సమ్మె

KCR

తాత్కాలిక ఉద్యోగుల నియామకం, అద్దె, ప్రైవేటు బస్సుల ఏర్పాటు తదితర అంశాలపై వివరణ
ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ సమీక్ష, హాజరైన మంత్రులు, అధికారులు .. రవాణా శాఖ అధికారులతో మంత్రి పువ్వాడ భేటీ

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి సమ్మెపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై చర్చించారు. హైకోర్టుకు సమర్పించాల్సిన నివేదిక, ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సమీక్షించారు. సమ్మె చేయకుండా కార్మికులను ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలతో పాటు ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేపట్టిన ప్రత్నామ్నాయ ఏర్పాట్లపై బలంగా ప్రభుత్వ వాణిని కోర్టులో వినిపించాలని సిఎం స్పష్టం చేశారు. అలాగే, ఈ నెల 15న హైకోర్టులో జరిగిన విచారణలో 18కి వాయిదా వేస్తూ.. ప్రభుత్వానికి జారీచేసిన సూచనలపై సిఎం చర్చించారు. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వానికున్న ఇబ్బందులతో పాటు వారి సంక్షేమానికి ఇప్పటి వరకు తీసుకున్న సమగ్ర సమాచారాన్ని నివేదికలో పొందుపరచాల్సిందిగా రవాణా శాఖ మంత్రి, సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. మంత్రి పువ్వాడ కొనసాగింపుగా రాత్రి వరకు రవాణా శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. హైకోర్టు తెలిపినట్లుగా ఆర్‌టిసి ఎండి నియామక అంశంతో పాటు కార్మికులకు చెల్లించాల్సిన జీతభత్యాలు వ్యవహారం, సమ్మె విరమణకు తీసుకున్న చర్యలు, ప్రజలకు కల్పిస్తున్న రవాణా సౌకర్యలు, ఇతరత్రా అంశాలపై సమగ్రంగా విశ్లేషించారు.

ఆర్‌టిసిలోని వాస్తవ పరిస్థితులను హైకోర్టుకు వివరించే దిశగా ఈ సమావేశం నిర్వహించారు. క్లిష్ట సమయమైన దసరా దగ్గరల్లో ఈ నెల 5న మొదలైన ఆర్‌టిసి సమ్మెను ఎదుర్కొన్న తీరుతెన్నుల నివేదికను సిద్దం చేశారు. పండక్కి ఊళ్లకు వెళ్లేవారి కోసం ప్రైవేట్, అద్దె వాహనాలు ఏర్పాటుచేయడంతో రద్దీని బట్టి వాహనాల మళ్లింపు జరిగిన విధానాన్ని పరిశీలించారు. రవాణా రద్దీని నియంత్రించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి బస్సులు తెప్పించి ఇక్కడి సమస్యను పూడ్చిన విషయాన్ని తెలియజేయనున్నారు. సిఎం కెసిఆర్‌తో పాటు రవాణా శాఖ అధికారులు, సిబ్బంది అంతా కలిసి పూర్తిస్థాయిలో రవాణా వ్యవస్థపై దృష్టి సారించిన విషయాలు నివేదించనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లను కేవలం రెండు, మూడు రోజుల్లో ఆరువేల మంది సిబ్బందిని నియమించి బస్సులు నడిపించి సమ్మె లోటు తెలియకుండా చేపట్టిన చర్యలు చెప్పనున్నారు. పండుగ సందర్భంగా సమ్మె వాయిదా వేసుకోమని చెప్పినా.. కార్మికుల వినకుండా మొదలైన సమ్మెలో యుద్ధప్రాతిపదికన చేపట్టిన చర్యలతో సమ్మె ప్రభావం తెలియకుండా రవాణా సేవలు అందించిన వివరాలు తెలియజేయనున్నారు.

హైదరాబాద్ వంటి నగరంలో ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థలను పునరుద్ధరించి వినియోగించిన తీరుతెన్నులు వివరించనున్నారు. ఎంఎంటిఎస్, మెట్రో రైళ్ల ద్వారా అత్యధిక మంది నగరవాసులు గమ్యస్థానాలకు చేరుకున్నారు. సమ్మె ప్రారంభమైన వారంలోనే సగం వాహనాలు నడిపిస్తూ రవాణా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన విధానం తెలియజేయనున్నారు. ప్రైవేట్, అద్దె వాహనాలు సమకూరుస్తూ ప్రయాణికుల సమస్యను పరిష్కరించిన అంశాలను క్రోడీకరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల ప్రజల నుంచి ఎటువంటి సముఖుత వ్యక్తం కావడం అంశాలను తెలియజేయనున్నారు. ఆర్‌టిసి సమ్మెపై పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నప్పటికీ కార్మికుల మొండివైఖరి వల్లే సమ్మె కొనసాగుతుందనే తెలియజేయనున్నారు. సమ్మె మొదలైన తరువాత కూడా కార్మికులను విధుల్లోకి రావాలని సిఎం సూచించినప్పటికీ కార్మికులకు పట్టు వీడలేదన్న విషయం తెలియజేయనున్నారు.

ఆర్‌టిసి ఎండి సునీల్‌శర్మ, ఆర్‌టిఏ అధికారులతో సమ్మె నేపథ్యంలో తీసుకున్న గట్టి చర్యల నివేదికలను మంత్రి అజయ్ కుమార్ సిద్ధం చేశారు. గురువారం సిఎం కెసిఆర్ హుజూర్‌నగర్ పర్యటన రద్దయిన క్రమంలో పూర్తిగా ఆర్‌టిసి సమ్మెపైనే దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. త్వరలోనే దసరా సెలవులు ముగించుకుని విద్యాలయాలు తెరుచుకోనున్న నేపథ్యంలో పూర్తిస్థాయి రవాణాకు సిఎం కసరత్తు చేస్తున్నారు. అంతకుముందు పార్టీ ఎంపి కె.కేశవరావుతో సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు. కార్మికు సమ్మె విరమణకు సంబంధించి చర్చించారు. ఇప్పటికే 75 శాతానికి బస్సులు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్నా గణాంకాలు పట్టికను నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తున్నది.

Telangana High court enquiry on rtc strike