Home లైఫ్ స్టైల్ నేరాలపై ఉక్కుపాదం

నేరాలపై ఉక్కుపాదం

police-image

సామాజిక అంశాలపై ప్రసన్ననేత్రం

నేరం ఏ రూపంగా ఉన్నా అణచివేయడం ఆయన నైజం… సమస్యలు ఏ కోణంలో ఉన్నా వాటిని పరిష్కరించడమే ఆయన ధ్యేయం. శాంతి భద్రతలతో సమస్యలు లేని సమాజంలో  ప్రజలంతా జీవించాలనే తపన ఆయన అంతరంగం. ఇంజనీరుగా అన్నాహజారే స్వగ్రామం రాలేగన్ సిద్దిలో వాటర్ షెడ్ నిర్మాణంలో చురుగ్గా పాల్గొన్నారు. ములసి డ్యామ్ ముంపు బాధితుల సమస్యల పరిష్కారం కోసం  మేథాపాట్కర్ తో పాటు దీక్షలు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మహేష్ మురళీధర్ భగవత్‌కు మహిళా అక్రమ రవాణా నిరోధానికి చేసిన కృషికి యు.ఎస్.ఏ ప్రభుత్వం అరుదైన అవార్డును ఇచ్చి సత్కరించింది. ప్రపంచంలోని ఎనిమిది దేశాలకు లభించిన ఈ అవార్డు భారతదేశంలో మహేష్‌భగవత్‌కు లభించడం విశేషం.   ఈ నేపథ్యంలో మహేష్ భగవత్‌తో  ముచ్చట్లు…

గతంలో సామాజిక కార్యకర్తగా అనేక కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం విధి నిర్వహణకు ఉపయోగపడుతుందా?
సామాజిక కార్యకర్తగా ప్రజలతో కలిసి పనిచేసినప్పుడు పరిశీలించిన అంశాలు విధినిర్వహణకు ఉపయోగకరంగా ఉన్నాయి. 2001లో బెల్లంపల్లి ఎస్.పిగా 2004 లో అదిలాబాద్ ఎస్.పి గా పనిచేసినప్పుడు నక్సలైట్ల సమస్యలను సామాజిక కోణంలో పరిశీలించే అవకాశం లభించింది. నక్సలైట్ల ప్రాబల్య గ్రామాలను గుర్తించి యువత తీవ్రవాద కార్యకలాపాల్లోకి వెళ్ళకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాం. విద్య,ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చాం. దొంగటీచర్ల గుట్టువిప్పి విద్యావ్యవస్థలో ప్రమాణాలు పెంచే అవకాశం లభించింది. ఆదివాసి పిల్లలకు విజ్ఞానయాత్రలు నిర్వహించి సామాజిక చైతన్యం కల్పించాం. నక్సలైట్ల సమస్యలు క్యూబింగ్‌తో పరిష్కారం కావు ప్రజల్లో చైతన్యం రగిలించాలి. ఈ చైతన్యం తోనే 26 గ్రామాల్లో నక్సలైట్లపై ప్రజలు తిరుగుబాటు చేశారు . 150 మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారు.

సామాజిక కార్యకర్తగా సేవ చేయాలనే ఆలోచన ఎలా కలిగింది?
ఇంజనీరింగ్ పూర్తి కాగానే టాటామోటర్స్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరాను. మహారాష్ట్రలో టాటామోటర్స్ దత్తత తీసుకున్న 18 గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, పాఠశాలలు, చెక్ డ్యాంల నిర్మాణాలు చేస్తూ ప్రజల సమస్యలను సున్నితంగా అవగాహన చేసుకున్నాను. ఆ రోజుల్లో ప్రజల్లో మూఢనమ్మకాలు అధికంగా ఉండేవి.ప్రజల అమాయకత్వాన్ని దొంగస్వాములు ఉపయోగించుకునేవారు. స్వాములు చేసే దొంగ విద్యలు ప్రజలకు చేసి చూపించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నించాను. సామాజిక మార్పు కోసం ఎంత ప్రయత్నించినా అధికారం ఉంటేనే సాధ్యం అనే ఆలోచనతో ఉద్యోగం వదిలి సివిల్స్ వైపు దృష్టి సారించాను. తొలి ప్రయత్నంలో నిరాశ ఎదురైనా చరిత్రను ఆప్షనల్ గా తీసుకుని మరాఠి సాహిత్యాన్ని అంశంగా చేసుకుని తిరిగి సివిల్స్ కు చేసిన ప్రయత్నం ఫలించింది. 1995 లో మణిపూర్ క్యాడర్ లో చేరాను. 1997 నుంచి 1999 వరకు మణిపూర్ ఎస్.పిగా విధులు నిర్వహించి తీవ్రవాద సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశాను. అక్కడే మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారాన్ని అణిచివేసి ప్రశంసా పత్రాన్ని సొంతం చేసుకున్నాను. ఆ తర్వాత ఏలూరులో పనిచేసేటప్పుడు ఒకపాత హత్యఫైల్ ఓపెన్ చేసి ప్రజల నుంచి సమాచారం సేకరించి దోషులను శిక్షించడంతో పాటు అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టవడం ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. అనంతరం 2004 లో హైదరాబాద్ సౌత్ జోన్ డి.సి.పి గా పదోన్నతి లభించింది. మనీలెండర్స్,దొంగస్వాములు,మహిళా అక్రమ రవాణా ముఠాలు,దోపిడీ దొంగలను పట్టుకోవడమే కాకుండా చట్టపరిధిలో వారికి శిక్షపడింది.
మహిళా అక్రమ రవాణాను తీవ్రంగా అణిచివేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
సమాజంలో కొంతమంది మహిళలను అక్రమంగా రవాణాచేసి వ్యభిచార కూపంలోకి నెడుతున్నట్లు వచ్చిన సమాచారంతో నేరపరిశోధన వేగవంతం చేశాం. నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడు యాదగిరి గుట్టపై కొందరు వ్యభిచారగృహాలను నిర్వహిస్తున్నట్లు వచ్చిన ప్రాథమిక సమాచారాన్ని లోతుగా పరిశీలించి దోషులను జైలుపాలు చేశా. వందలాది మందికి ఆశ్రయం కలించడంతో పాటు పాఠశాలల్లో చేర్పించాం. అలాగే నిర్భయ సంఘటన కంటే ఘోరమైన సంఘటన కొత్తగూడెంలో జరిగింది. ఒక అమ్మాయిపై 9 మంది లైంగికదాడికి పాల్పడగా నలుగురు వీడియో తీశారు. ఒకడు కాపలాగా ఉన్నాడు. తొలుత ఈ కేసుపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ప్రజల సహకారంతో14 మందిపై కేసు నమోదు చేయగా 9 మందికి యావజ్జీవ కారాగార శిక్షపడింది. 2007 లో ఈ సంఘటన జరిగితే 2009 లో వెలుగుచూసింది. సమాజంలో కొంతమేరకు చైతన్యం వస్తోంది. షీ టీంలు బాగా పనిచేస్తున్నాయి. ప్రతి కళాశాల నుంచి ఒకరికి షీ టీం శిక్షణ ఇస్తోంది. ఇప్పటికి ౩౦౦ మంది విద్యార్థినులు షీటీంకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ప్రజల్లోనూ ఈ చైతన్యం రావాలి. ప్రజాచైతన్యంతో నేరాలను అదుపుచేసే మార్గాలు సులువు అవుతాయి. ప్రస్తుతం సమాజంలో వేగవంతమైన టెక్నాలజీ ఉంది. క్షణాల్లో ఫింగర్ ప్రింట్స్‌ను కనిపెట్టవచ్చు. సి.సి. టివీల్లో నేరస్తుల కదలికలు తెలుసుకోవచ్చు.

ఇటీవల మీకు అమెరికా ప్రభుత్వం అరుదైన అవార్డును ప్రదానం చేసింది. ఏ రంగానికి ఈ అవార్డు లభించింది.
స్వతంత్య్ర భారతదేశంలో ఇప్పటికీ మనుషులను రవాణాచేసే దారుణం నన్ను కలిచివేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా మహిళల అక్రమరవాణాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి అనేక ముఠాలను కోర్టు ముందు నిలిపాను. సామాజిక కార్యకర్తగా ఆనాడు నేను పరిశీలించిన సమాజాన్ని ఈనాటి ఉద్యోగానికి మేలు చేస్తుంది. మహిళా అక్రమ రవాణాను తీవ్రంగా అణచి వేస్తున్నందుకు అమెరికా ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. వైట్ హౌజ్ ప్రపంచదేశాలన్నింటిని పరిగణలోకి తీసుకుని ఎనిమిది దేశాలకు అవార్డులను ప్రదానం చేసింది. ఆ ఎనిమిది దేశాల్లో భారతదేశం నుంచి నాకు ఈ అవార్డు లభించింది. అవార్డు బాధ్యతలను గుర్తు చేస్తుంది. గతంలో భారత రాష్ట్ర పతి నుంచి అవార్డును అందుకునే అవకాశం వచ్చింది. అవార్డులు రివార్డులు బాధ్యతలను పెంచుతాయనేది నా ప్రగాఢ విశ్వాసం. ప్రస్తుతం రాచకొండ పోలీసు కమిషనర్ గా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. శాంతి భద్రతలను కాపాడుతూనే ఉత్సాహవంతులైన 1250 మంది యువతకు పోలీసు నియామకాల కోసం జరిగే రాతపరీక్షకు శిక్షణ ఇస్తున్నా.

మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ నుంచి ఉపాధ్యాయుల కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి మహిళా అక్రమ రవాణాలపై లాఠీ ఝుళిపిస్తున్న మహేష్ మురళీధర్ భగవత్ రాసిన పుస్తకాలు ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం యాంటీ ట్రాఫికింగ్ డిప్లొమా కోర్సుకు పాఠ్యాంశాలు కావడం గమనార్హం… ఆయన మరికొంతమంది అధికారులకు ప్రేరణగా నిలిచి మహాత్ముని కలలను సాకారం చేస్తారని ఆశిద్దాం….

వి. భూమేశ్వర్