Friday, April 26, 2024

తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారాలి: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Telangana is agriculture state says by KCR

 

హైదరాబాద్: లక్షలాది మంది రైతులతో కోటికి పైగా ఎకరాలతో విస్తారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ శాఖ మొండి పట్టుదలతో, నిరంతర పరిశ్రమతో పని చేయాలని అధికారులకు సిఎం కెసిఆర్  సూచించారు. ప్రగతి భవన్‌లో వ్యవసాయ శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్షలు జరిపిన సందర్భంగా మాట్లాడారు. సంప్రదాయక వ్యవసాయ పద్ధతుల స్థానంలో గొప్ప పరివర్తన రావాలని పిలుపునిచ్చారు. అసంఘటిత రంగంలో ఉన్న రైతులకు సంఘటిత శక్తిలోని బలమెంతో చూపించేందుకు మేలైన సాగు విధానాలు, లాభదాయక పద్ధతులు చెప్పేందుకు వ్యవసాయ శాఖ మార్గదర్శనం చేయాలని, నాయకత్వం వహించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతుందని, దానికి తగ్గట్టు వ్యవసాయ శాఖ కూడా సంస్థాగతంగా బలోపేతం కావాలని కెసిఆర్ ఆదేశించారు.

అవసరమైతే వ్యవసాయ శాఖకు మరిన్ని పోస్టులు మంజూరు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో రైతులు నూటికి నూరు శాతం పంటలే వేశారని ప్రశంసించారు. ఏ గుంటలో ఏ రైతు పంట పండిస్తున్నారో ఖచ్చితమైన వివరాలు తీసుకోవాలన్నారు.  వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడానికి స్వతంత్య్ర భారతదేశంలో గతంలో ఎన్నడూ, ఎక్కడా జరగనంత ప్రయత్నం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందన్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మాణం జరిపి రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తున్నామన్నారు. ఒక్క రూపాయి కూడా భూమి శిస్తు తీసుకోవద్దనే లక్షంతో నీటి తీరువా విధానాన్నే రద్దు చేయడంతో పాటు పాత బకాయిలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల కరెంటును ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందన్నారు.

వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడిని రైతు బంధు పథకం కింద ప్రతీ పంటకు రైతుల ఖాతాల్లోనే జమ చేస్తున్నామన్నారు. ఏ కారణం చేత రైతు మరణించినా అతడి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల రైతు బీమా ప్రభుత్వం అందిస్తుందని కెసిఆర్ తెలిపారు. కరోనా కష్ట కాలంలోనూ రైతులు పండించిన ప్రతీ పంటను నూటికి నూరు శాతం ప్రభుత్వం కొనుగోలు చేసిందని, రైతులను సంఘటిత పరిచేందుకు ప్రభుత్వమే పూనుకొని రైతు బంధు సమితులను ఏర్పాటు చేసిందని కెసిఆర్ వివరించారు. క్లస్టర్ల వారీగా నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణం కూడా మూడు నెలల్లో పూర్తి అవుతాయని, రైతు వేదికలు రైతు చైతన్యానికి వేదికలుగా మారాయన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఎవరైనా సరే నేరుగా రైతులతో మాట్లాడే వెసులుబాటు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News