Thursday, March 28, 2024

జీవితాన్ని కవిత్వీకరించిన నవల

- Advertisement -
- Advertisement -

కను రెప్పల కింద బాష్పాలకే కాదు, కలలకీ చోటు ఉందని.. వాడిన పువ్వు మూగ వేదనే కాదు, స్వచ్ఛమైన పచ్చదనం సాక్షిగా రేపు విచ్చుకోబోతున్న మొగ్గ తెచ్చే ఆశల వర్ణాలనీ గుండె నిండా నింపుకోవాలనీ..”
ఒక ఆదర్శమైన వాస్తవిక జీవితానికి నవలీకరణే ‘ఊసులాడే ఒక జాబిలటా’. గొప్ప భావుకుడైన కవికి, ఆదర్శాలతో జీవితాన్ని మలుచుకునే ఉపాధ్యాయురాలికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాయణమే ఈ నవల. ఈ నవల ఉప్పల లక్ష్మణరావు ‘అతడుఆమె’ నవల రూపాన్ని పోలి ఉంది. ‘అతడుఆమె’లో డైరీలో ఒక పేజీని బారిష్టరు చిదంబర శాస్త్రి రాసుకున్నదయితేే, మరొక పేజీ అతని భార్య శాంతమ్మ రాసుకున్నది. ఈ డైరీలో రెండవ ప్రపంచయుద్ధం నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు చర్చకు వస్తాయి. ‘ఊసులాడే ఒక జాబిలటా’లో ఒక ఉత్తరం వంశీ రాస్తే, మరొక ఉత్తరం కార్తీక రాస్తుంది.
అసలు ఉత్తరాలు ఎలా ఉంటాయో తెలియని నేటి వాట్సప్ తరానికి వాటి సౌందర్యాన్ని నిషిగంధ చక్కగా చూపించారు. అవి ఎలా మనసు విప్పుతాయో, అంతరంగాన్ని ఎలా ఆవిష్కరిస్తాయో ఈ తరం కళ్ళముందుంచారు.
మచిలీపట్నం సమీపంలోని మాజేరిలో అమ్మమ్మ, తాతయ్యల ఇంట్లోనే కార్తీక పెరుగుతుంది. వారిది మోతుబరి రైతు కుటుంబం. తాతయ్య లాగానే తండ్రి కూడా ఇల్లరికం వస్తాడు. ఇంట్లోనే కాదు, బైట కూడా అమ్మమ్మ పెత్తనం. ఆమె దర్పం అందరినీ శాశిస్తుంద. అమ్మమ్మ దగ్గర పెరిగినా కార్తీకకు ఆ పెత్తనం వంటబట్టించుకోవడం ఇష్టం లేదు. అమ్మానాన్నల మధ్య ఉన్న వైరుద్యంతో పెళ్ళిపట్ల వైముఖ్యం ఏర్పరచకుంటుంది.
కార్తీక తన స్నేహితురాళ్ళ కుటుంబ జీవితాలలో ఉన్న వైరుధ్యాలను వంశీకి రాసిన ఉత్తరాలలో చర్చిస్తుంది. ‘మన కుటుంబం ఎప్పుడూ చుట్టూఉన్నవారు గీసిన పరిధిలోనే బ్రతకాలనుకుంటుంది’ అంటూ కుటుంబంలోని అందమైన సంకెళ్ళలో ఉన్న స్వేచ్ఛారాహిత్యాన్ని వెల్లడిస్తుంది.
కార్తీక మోతుబరి కుటుంబంలో పుట్టినా, వారి ఆధిపత్య జీవితానికి పూర్తి భిన్నమైన వాతావరణాన్ని కోరుకుంటుంది. కార్తీక పనిచేసే స్కూలుకు బదిలీపై వచ్చిన భూషణం తీసుకునే చొరవతో పిల్లల కోసం మరింత కష్టపడుతుంది. స్కూల్లో ఫొటోలు తీయడానికి వచ్చిన వికాస్ చేసే హడావుడి చూసి తొలుత చిరాకుపడినా, భూషణం ఇంట్లోనే ఉంటూ అందరికీ సేవ చేసే వికాస్‌ను అపార్థం చేసుకున్నానని బాధపడుతుంది. కష్టాల్లో ఎవరున్నా వారిని వికాస్ ఆదుకుంటుంటాడు. మచిలీపట్నం నోబుల్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తూ రోజూ అనాథ శరణాలయానికి వెళ్ళి వారికి సేవచేయడం కర్తీకను అబ్బురపరుస్తుంది. వికాస్ చదువుకునే రోజుల్లో విద్యార్థి సంఘాలలో చురుగ్గా పనిచేసేవాడు. ఇప్పుడు విద్యార్థి కాకపోయినా పౌరులకు అన్యాయం జరిగినప్పుడు అడ్డుపడుతుంటాడు. ఆపదలో ఉన్న వారికి తన డబ్బు ఖర్చు చేస్తుంటాడు. గొడవలు, ఆందోళనలో దెబ్బలు తినడం వికాస్‌కు రివాజు. వికాస్ కార్మికుల పక్షాన నిలబడి, వారి ఆందోళనకు సహాయ సహకారాలు అందిస్తుంటాడు. వికాస్ విప్లవ భావాలున్న యువకుడు. తాను వికలాంగుల కోసం ప్రత్యేకంగా పాఠశాల పెట్టలేకపోయినా, వారి కోసం వికాస్ చేసే సేవలను, అతని నిజాయితీని కార్తీక ఇష్టపడుతుంది. తొలుత కుటుంబ బంధాలలో ఇరుక్కో దలుచుకోకూడదనుకున్న కార్తీక, వికాస్‌లకు ఆలోచనలు కలవడంతో గుళ్ళోపెళ్ళిచేసుకుంటారు.
పూజలు, సుప్రభాతాలు, చన్నీటి స్నానాలు, దేవేరులతో స్వామి జలకాలాటలు వంటి అనుభూతులతో ఓలలాడే కార్తీక కంటే, సమాజం పట్ల నిబద్దతో విప్లవ భావాలున్న వికాస్‌ది మానసికంగా ఎదిగిన గొప్ప పాత్ర. ఈ నవలలో రచయిత్రి నిషిగంధ తన ఆలోచనలకు అనుగుణంగా ఉన్న కార్తీక పాత్రలకు ప్రాధాన్యత నిస్తూ తీర్చిదిద్దారు. నిషిగంధ ఆలోచనలు కార్తీకతోపాటు వంశీలో కూడా ప్రతిబింబిస్తాయి. వికాస్ వల్ల ఏర్పడిన చైతన్యంతో స్త్రీల అర్ధనగ్న ప్రదర్శనలకు వ్యతిరేకంగా పోరాడి కార్తీక వాటిని నిలుపుదలచేయిస్తుంది. “ఈచైతన్య లాహిరిలో మునిగి తేలుతున్న మాకు ఇంక హానీమూన్ లాంటి వేవీ గుర్తు లేదు” అనడం వికాస్ సహచర్యం వల్ల ఆమెలో ఏర్పడిన ఆచరణాత్మక మార్పుకు చిహ్నం. బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ పట్ల కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది కార్తీక.
తమకు పుట్టిన హర్షతో కార్తీక, వికాస్‌లు జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న సమయంలో కార్తీకకు లివర్ క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ అని ఆమెకు చెప్పకుండానే విశాఖలో వైద్యం చేయిస్తుంటాడు వికాస్. రేడియేషన్ పెట్టించుకోవడమంటేనే భరించరాని బాధ “ఇక ఈ నొప్పి భరించే శక్తి నాకు లేదు. మీరు, హర్ష జాగ్రత్త” అని రాసిపెట్టి కార్తీక ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. ‘వసం త ఆత్మహత్య చేసుకోవడమేమిటసలు, జీవితమంటే అంత చులకనా!’ అని ప్రశ్నించిన కార్తీకేనా చివరికి ఇలా ఆత్మహత్య చేసుకున్నది! నిజం గా ఆశ్చర్యమే. కాని వాస్తం గా జరిగిన సంఘటన ఇది. ఒక అర్థవంతమైన జీవితా న్ని గడిపిన కార్తీక హర్షను ఒదిలేసి వెళ్ళిపోయింది. వికాస్ విప్లవ సంస్థలతో మమేకమవుతాడు. ‘ఊసులాడే ఒక జాబిలటా’ నవల కాదు, విషాదాంతమైన ఒక జీవన కావ్యం.

రాఘవ శర్మ,
94932 26180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News