Home కలం తెలంగాణ గర్వించదగ్గ సిపాయి కవి

తెలంగాణ గర్వించదగ్గ సిపాయి కవి

‘అపరిచితుడు’ కవితతో విశ్వకవిగా ఎదిగినా
మనం విస్మరించిన కవి – వి.ఆర్. విద్యార్థి

“వెయ్యేళ్ళు యుద్ధం ప్రకటించినవాడు
పట్టు పాన్పుపై అప్సరసల ప్రక్కనో శయనిస్తాడు
యుద్ధం ఎందుకు వస్తుందో తెలియని వాడు
తుపాకి సైదోడుగా, కొంకర్లు పోయే చలిలో


బోర్డర్లో కాపలా కాస్తుంటాడు” అంటూ అసమానతల్లోని అసహనాన్ని తెలిపిన ఒక సిపాయి కవి గురించే నేను గుర్తు చేద్దామనుకుంటున్నాను. ఆ చైతన్యధార గురించే నేను ప్రస్తావిద్దామనుకుంటున్నాను. ఓ చెమట చెట్టు ముందు ఆగి నాకిన్ని శ్రమైక స్వప్నాలను రాల్చమని జోలెను చాపిన ఆ కవి, ఓ జెండా ముందు మోకరిల్లి జోలెలో కొన్ని ఉద్యమ స్వప్నాల్ని వేయమని నమస్కరించిన నికార్సయిన ఆ కవి గురించే నేను మీకు మరో మారు గుర్తు చేయాలనుకుంటున్నాను.
అవును… ఆయన ఒక యుద్ధ కవి. యుద్ధంలో పనిచేస్తూనే హింసలేని ప్రపంచం ఏర్పడాలన్న ఆకాంక్షతో కవిత్వం రాశానని ఘంటాపథంగా చెప్పుకున్న కవి – రెండు ప్రత్యక్ష యుద్ధాల్లో పాల్గొన్నప్పటికీ శాంతి మంత్రాన్ని మాత్రమే జపించిన సిపాయి కవి.
సిపాయి కవి అంటే గుర్తొచ్చింది. అలన్ సీగర్ గుర్తున్నాడా మీకు. ’మృత్యువుతో ములాఖాత్’ అంటూ రాసి ప్రపంచ యుద్ధ కవితల్లోని అతి గొప్ప కవితగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన విశ్వకవి సీగర్. సుశిక్షితుడైన సైనికుడు కాబట్టే సలక్షణమైన కవిత్వాన్ని సృష్టించగలిగాడు.
“ఒకానొక వివాదస్పద సరిహద్దు కంచె వద్ద / మృత్యువుతో నాకు ముఖాముఖి జరిగింది” అంటూ మొదలెట్టి
”నేను ప్రతిజ్ఞ చేసిన వాక్యాలంత నిజంగా
నా సంప్రదింపులలో నేను మృత్యువుతో రాజీ పడలేను
ఆ ములాఖాత్లో విఫలం కాలేను”అని ముగించి సమరభేరి మోగించిన సైనిక కవి సీగర్. అందుకే ప్రపంచ సాహిత్య కారులు అన్ని భాషల్లోకి ఆసక్తిగా అనువదించి చదువుతుంటారు సీగర్ కవిత్వాల్ని.
న్యూయార్క్ నగరంలో ఓ కులీన కుటుంబంలో పుట్టిన సీగర్ 1914 మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు తాను ఎంతగానో ప్రేమించిన ఫ్రెంచ్ దేశం తరఫున సైన్యంలో చేరి యుద్ధరంగంలోనే అశువులు బాశారు.
I have a Rendezvous with Death రాసి తాను ప్రేమించిన దేశాన్ని తన వాలెంటెన్గా భావించిన సీగర్ జాన్ కెన్నడీ ప్రశంసలు సైతం పొందిన కవి. అందుకే ఫ్రెంచ్ ప్రభుత్వం ఆ వీరసిపాయి పేరును ఒక వీధికి పెట్టడమే కాక ఆ దేశపు పురస్కారం Croie ౄeguerre, Medallie Millitaire అవార్డ్లతో సత్కరించింది. ఆ ఒరవడిలోనే మన తెలంగాణాకి అటువంటి అరుదైన సిపాయి కవి ఒకరున్నారు. వారు వి.ఆర్.విద్యార్థిగా పిలుచుకునే వేలూరి రాములు. తాను ఒక కవిత్వపు చెలిమె – జనచైతన్యఝరి. వేలూరి నరసింహ, కమలమ్మల 7వ సంతానంలో ఒక్కరిగా జన్మించిన రాములు తెలంగాణాకి తన జీవితాన్ని ముడుపుగా కట్టిన కాళోజీ గారి అత్తగారి ఊరైన గవిచర్లలోని ఒక వ్యవసాయిక కుటుంబంలో పుట్టారు. ఆ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది.కాకతీయుల రాజధాని ఆంధ్ర నగరికి 4 దిక్కులా ఉన్న మోగిలి చర్ల,గవిచర్ల,ఉనికి చర్ల,ముచ్చర్ల గ్రామాల్లో దక్షిణ గ్రామమే ఇది.కాళోజీల స్ఫూర్తితో రచనా వ్యాసాంగాన్ని చేపట్టి ”వాని కవిత్వమే అలగ్‌” అని వారితోనే అన్పించుకున్నారు. అందుకే ‘కాళోజీ తమ్ములం – ప్రజాకీయవాదులం / ఖచ్చితంగా ప్రజాకవుల జాతి మాది – నీతి మాది
అన్యాయాన్ని ఎదిరించినవాడు మాకు ఆరాధ్యుడు’ అంటూ కవిత్వీకరించాడు.
నిజానికి ప్రతి కవీ ఒక సామాజిక సిపాయే. కానీ విద్యార్థి సిపాయి అయ్యాక కవిగా మరింత రాటుతేలాడు. మేనత్త భర్త జయసేన చెప్పిన సైన్యపు విశేషాలు విన్న స్ఫూర్తితో తన 12వ ఏటనే సైనికుడిపై తొలి కవితను రాసి – సైనికుడిగా జీవికను మొదలెట్టి కవిత్వాన్ని ఔపోసన పట్టిన కార్యసాధకుడు విద్యార్థి. నిజం చెప్పాలంటే తెలుగు సాహిత్యంలో వైమానిక దళ కవులు లేకుండా లేరు. ప్రముఖ కవి ఆరుద్రగారు, సినీగీత రచయిత భువనచంద్ర, కథకులు కాటూరి త్రివిక్రములు ఎయిర్ఫోర్స్ వారే కావటం గమనార్హం. కాకపోతే వి.ఆర్. లాగా 1965, 1971 పాకిస్తాన్, బంగ్లా వియోచన యుద్ధాల్లో మిస్సైల్స్, రాడార్లతో ప్రత్యక్షంగా పనిచేస్తూ దేశానికి సేవలందించలేదు.
విశ్వకవితల సరసన చేరదగ్గ కవితల్లా డా. ఎన్.గోపిగారు పేర్కొన్న ’అపరిచితులు’ కవితను విద్యార్థి పఠాన్ కోట రన్వే మీద విమానరెక్కల కింద కూర్చుని రాశారట – ఆ కవిత మీదనే 84 పేజీల భాష్యం రాసిన ’వియోగి’ తెలుగు సాహిత్యంలో ఒక కవితలోని మొదటి పాదం మీద అంత పెద్ద విశ్లేషణ రావటమే సరికొత్త రికార్డ్గా నమోదు గావించారు.అలాగే 1971 లో యుద్ధ రంగం నుండి తన శ్రీమతికి రాసిన సైనికుడి ఉత్తరం కూడా ఎంతో ప్రాచుర్యం పొందిందే.. ప్రపంచం మొత్తం మీద హింస మాత్రమే నిషేదించాల్సిన అంశం అని ప్రగాఢంగా నొక్కి చెప్పే ఈ కవి హింసకు మూలం స్వార్ధం అని,అది లేకుండా ఉన్ననాడు మానవాళి సుభిక్షంగా ఉంటారంటారు. యుద్ధం రకాల్ని వివరిస్తూ –
”ఒక యుద్ధం బానిసల దండయాత్ర పీడితుల తిరుగుబాటు
ఇంకో యుద్ధం నియంతల నిలకడ కోసం – దళారుల రక్షణ కోసం…అన్యాయమై పోతారు అమాయక ప్రజలు – ఎడారులౌతాయి ఊళ్ళకు ఊళ్ళు” అంటారు.
మనిషికి ’శాంతి’ మంచి పనుల్లో దొరుకుతుంది. తుపాకీకి శాంతి కావాలంటే… అంటూ ద్వంద్వ ప్రవృత్తిగల నరహంతకుల సామ్రాజ్యవాదాన్ని ఎండగట్టారు మరో కవితలో “శాంతి కపోతాల్ని చూసి ప్రతి బందూకూ లొట్టలేస్తుంది /ఆదమరిచి నిద్రించిందా చాలు తూటా వికటాట్టహాసం చేస్తుంది. పావురం విలవిలా తన్నుకుంటూ నేలరాలితే / తుపాకి శాంతిస్తుంది” అంటారు.
చావుని ఎంతో సులువుగా స్వీకరించగల్గిన వృత్తిగల ఈ కవి నీటి బుడగ జీవితమే అంటూ జిడ్డు కృష్ణమూర్తి ఆత్మజ్ఞానాన్ని ఔపోసన పట్టిన జ్ఞానంతో ఎన్నో కవితలు రాశారు.
“ జీవితాంతం పోరాడవలసి వస్తే రానీ / రాలిపోవాల్సి వస్తే పోనీ / జీవితానికర్థం స్వేచ్ఛే కదా” అని స్వేచ్ఛా బావుటాని ఎగురేశారు – పైగా బాంబులు విసిరేవాడికి వున్న కమిట్మెంట్ పావులరాను ఎగరేసే వాడిలో వున్నదా అని సూటిగా ప్రశ్నిస్తాడు – తన కవిత్వపు ముడిసరుకును విశ్వం నుండి తీసుకున్న ఈ కవి నిత్య ప్రయాణకవి, నిరంతర పరిశీలనా కవి కావటంతో కవితా వస్తువులో వైవిధ్యం కనిపిస్తుంది – సామాజిక అనుభవాలతో రంగరించి కవిత్వపు కాన్వాస్ను స్వంతంగా పేర్చుకుని పేరెన్నిక గన్న కవితల్ని రాశారు – వృత్తి యాత్రలు, వైయక్తిక యాత్రలు తనకొక గొప్ప కవిత్వపు చూపును ఇచ్చిందని చెప్పాలి. వి.ఆర్.గారు జిడ్డు కృష్ణమూర్తిగారితో సంభాషించిన తీరే అందుకు నిదర్శనం. దాంట్లో జె.కె.గారు వి.ఆర్. గారిని అడిగిన ప్రశ్న – మీరు నిజంగా కవిగా స్థిరపడాలనుకున్నారా లేక ఒక రాజ్యానికి మంత్రి కాదల్చుకున్నారా అని . వి.ఆర్ ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా ’నేను కవిగానే ఉండదల్చుకున్నాను’ అని దృఢస్వరంతో చెప్పారని మిత్రులు నాతో అన్నారు. అది జిడ్డు కృష్ణమూర్తి గారికి ఎంతో నచ్చిందని అదే మిత్రులు సంభాషించుకున్నారు. విద్యార్థిలో ఒక కలల బేహారిని, ఒక సాహసిని, ఒక సిపాయి, ఒక తాత్వికున్ని తలపోతల్లో మునిగిన తాపసిని చూస్తాం – అలాంటి గొప్ప సుగుణవంతుడైన కవి రాసిన కవితలు ఎలా వుంటాయను కుంటున్నారు? “ గుండె మడతలో కదిలి / మెదడు శిఖరం తట్టి / మీట రెక్కలు తొడిగి / గొంతు వేణువునూదె అలవోలే లేచేనులే నా కవిత / అవనినే ఏలెనులే” అంటూ తాను రాసుకున్నట్టే ప్రజాకవిగా జన హృదయాల్లో నిల్చిపోయారు. పోతన, జిడ్డు కృష్ణమూర్తి, ఖలీల్ జిబ్రాన్లను అమితంగా ఇష్టపడి చదివి, అనర్ఘళంగా వారి గురించి మాట్లాడగల్గిన ఈ కవి 77 ఏళ్ళ వయస్సులోనూ నిత్య చైతన్యంతో రాస్తూ ఆధునిక తెలుగు కవిత్వంలో ప్రత్యేక ముద్రను వేశారు.
ఒక ఉద్యమ కవిగానో, విప్లవ కవిగానో ముద్ర వేయించుకోవటం ఇష్టపడని వి.ఆర్. మానవీయ సమాజంలో తప్పిపోయిన శాంతి గురించి, చేజారిపోతున్న విలువల గురించి ఆరు థశాబ్దాలుగా కలంతో యుద్ధం చేస్తూనే వున్నాడు. చిత్రంగా చెప్పాల్సిన అంశం ఏమిటంటే యవ్వనదశలో విప్లవం గురించి మాట్లాడని వాడు కవే కాడన్న వాదనను తోసివేస్తూ దిగంబర కవిత్వం పుట్టిన దశలో కవిత్వంలోకి అడుగుపెట్టినప్పటికీ విప్లవోద్యమ ప్రభావం ఎక్కువగా వున్న పోరాటగడ్డ వరంగల్లో ఎదిగినప్పటికీ మానవీయత తన కవిత్వపు అంతిమ లక్ష్యంగా భావించిన అరుదైన కవి వి.ఆర్. తన 7 సంపుటాలలోని 400 పై చిలుకు కవితలలోని ప్రతి కవితను ఆణిముత్యం అని చెప్పలేము కానీ కవిత్వం గురించి, శాంతి అవసరం గురించి అతి ఎక్కువగా రాసి ఆలోచింప చేసిన సిపాయి కవి మాత్రం ఖచ్చితంగా వి.ఆర్.విద్యార్థినే.
గమనిస్తే విద్యార్థి ఒక అంతర్ముఖుడు. వితభాషి. ఒంటరీకరణను ఆస్వాదించే వ్యక్తి. నిరంతర పథగామి. ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం వల్ల దేశమంతా తిరిగిన అనుభవంతో వైవిధ్యభరితంగా కవితాంశాన్ని చెప్పగల్గిన శైలికి స్వంతదారుడు. యుద్ధ అసంబద్ధత, వైవాహిక జీవన సందిగ్ధత, ఆధునికత తెచ్చిన పరాయీకరణ, ప్రకృతిలోని పారవశ్యత, మనిషిలోని డొల్లతనం, వివాహంలోని తండ్లాటల గురించి నిజాయితీగా రాయగల్గిన స్వచ్ఛమైన అక్షర ప్రేమికుడు. అక్షరబద్ధం చేయగల్గిన చేయి తిరిగిన కవి. పర్యటనలు తన ఆలోచనా పరిధిని మరింత పెంచటంతో చిక్కని కవిత్వాన్ని ఖండాంతర, మంచుమైదానాల నిండా పరిచారు.“ యుద్ధం చించిన సరిహద్దు ముందు నిల్చుని నాకిన్ని స్వాతంత్య్ర స్వప్నాల్ని పంచమని యాచిస్తాను. వో సిపాయితో కరచాలన చేస్తూ / నా ఛాతీ నలంకరించ టానికి ఓ నాలుగు యుద్ధ పతకాలనర్థిస్తాను” అంటూ సేవ చేసిన దేశాన్ని, దేశాల్ని నిలబెట్టే దేహాల్ని అమితంగా ప్రేమించాడు. ఆరోగ్యవంతుల మెదడు మడుల్లో రేపటి తరానికి అవసరమైన శాంతి పుష్పాలే కదా వికసించాలి అనుకుంటాడు.
“ హింసకు నిర్వచనం అహింస అయినప్పుడు
ప్రపంచమా నీ దారెటు?” అని అందుకే ప్రశ్నించగలిగాడు.
ఎందుకే వి.ఆర్.విద్యార్థి కవిత్వం చదువుతుంటే ఫాదర్ ఆఫ్ కమ్యూనిజం కారల్ మారక్స్ చెప్పిన ఒక అద్భుత వాక్యం గుర్తొస్తుంది. The unchanging truth in the world is the – change – మారని సత్యమంటూ ఈ ప్రపంచంలో ఉంటే అది మార్పు మాత్రమే అన్న నిత్య సత్యం జ్ఞాపకం వస్తుంది.
కాళోజీ సోదరులు స్థాపించిన మిత్రమండలిలో ప్రారంభమైన తన సాహితీ ప్రస్థానం జయమిత్రను ప్రధానంగా భావిస్తూ తెలంగాణ రచయితల వేదికను, తెలంగాణ రచయితల సంఘానికి వ్యవస్థాపక సభ్యులుగా సాగి ఇప్పుడు కాళోజీ ఫౌండేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా సేవలందిస్తున్నారు. జయమిత్ర వారు విద్యార్థి కవిత్వం పేరిట కవితా సర్వస్వంగా తన 6 కవితా సంపుటాలను బృహత్ పుస్తకంగా వేసి ఈ తరానికి పరిచయం చేయటం ముదావహం. అందులోని కవితల్ని చూశాక దేశాన్ని ఎంతగా పూజించాడో, కవిత్వాన్ని అంతగా ప్రేమించడాని – యుద్ధాన్ని ఎంతగా ద్వేషించాడో శాంతిని అంతగా ఆరాధించాడని అర్థం అవుతుంది. సమాజ అసమానతల్ని పంచుకోవటం, ప్రశ్నించే దృక్పథాన్ని కవితల్లో నింపుకోవటం, స్వేచ్ఛని వాంచిస్తూ కవితాశిల్పాలు చెక్కటం విద్యార్థి నిరంతరం చేసిందే.
బహుశా బి.తిరుమలరావుగారు అందుకే అన్నారు ”రెండు యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తికి కవిత్వం పట్ల ఇంత వ్యామోహం ఉండడం, ఇన్ని సంపుటాలు అచ్చు వేయటం ఆశ్చర్యం. వరడ్స్ వర్త్ లా ఉన్నాయి తన కవిత్వపు ధార.ఒక యంత్రంలా పని చేయించిన వాతావరణంలో వుంటూ అద్భుతమైన భావుకతను నిలబెట్టుకుని చిక్కటి కవిత్వం రాయటం అభినందించదగ్గ అంశం” అని.
వి.ఆర్. విద్యార్థి స్వయంగా తాను రాసుకున్నట్టు …. తన చిరునామా తాను నిర్మించుకున్న ఇల్లు కాకుండా లిఖించిన కవితలు అయ్యాయి. తాను నిజంగా తెలంగాణ గర్వించదగ్గ సిపాయి కవి.3 అనువాద గ్రంధాలు,2 వ్యాస సంపుటాలు,7 కవిత్వ సంకలనాలే కాక తన కవిత్వం మీద వచ్చిన 2 పిరియాడికల్స్,4 విశ్లేషణలు ఉన్నాయి.’శాంతిని’ యుద్ధ తుపాకి తూటాలో పేర్చి పఠితుల గుండెల్లో పేల్చిన కవి – అవార్డ్ల కోసం అక్షరాలు పర్చకుండా – సుకవి ప్రజల నాల్కల మీద నివసిస్తాడని జాషువా చెప్పినట్టు ప్రజల నాల్కలమీద, విమర్శకుల సమీక్షల్లోనూ శాశ్వతంగా నిలదొక్కుకునే కవిత్వం రాశారు –
“తిరుగుబాటు ప్రకటించే కవికే గదా నేను మోకరిల్లేది
అక్షరాల చెకుముకి రాళ్ళతో నక్షత్ర మండలాన్ని సృష్టించే
కవిని గదా నేను కీర్తించేది” అంటూ జీవన మేనిఫెస్టోని తయారు చేసుకున్న ఈ సైనిక కవి తలెత్తి నిలబడిన ఆత్మగౌరవ జెండాలా తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలబడే వుంటాడు…

శ్రీలక్ష్మి ఐనంపూడి
99899 28562