Home తాజా వార్తలు విరాళాల వెల్లువ

విరాళాల వెల్లువ

 Telangana leaders to donate salary to flood-hit Kerala

కెసిఆర్ పిలుపుతో బాధిత కేరళకు భారీగా సాయం

సిఎం సహాయనిధికి టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల నెల జీతం
టాలీవుడ్ తారలు చిరంజీవి, రామ్‌చరణ్, మెగాస్టార్ తల్లి అంజనాదేవి, ఉపాసన, నాగార్జున, మహేశ్‌బాబు, జూ.ఎన్‌టిఆర్, అల్లు అర్జున్, ప్రభాస్,కల్యాణ్‌రామ్,విజయ్ దేవరకొండ, గీతగోవిందం నిర్మాతలు, మా భారీ విరాళాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రకృతి సృష్టించిన ప్రళయంతో తల్లడిల్లుతున్న కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు పెద్దఎత్తున విరాళాలు ప్రకటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పిలుపునకు పెద్దఎత్తున స్పందన లభిస్తోంది.  రాష్ట్రంలో విరాళాల వెల్లువ కొనసాగుతోంది. టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపిలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులంతా తమ నెల రోజుల జీతాన్ని విరాళంగా ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే  డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, మంత్రులు కెటిఆర్, హరీష్‌రావు, ప్రభుత్వ చీఫ విప్  కొప్పుల ఈశ్వర్, ఆందోల్ ఎంఎల్‌ఏ బాబు మోహన్, దేవరకద్ర ఎం ఎల్‌ఏ ఆలవెంకటేశ్వర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్  శాసనసభ్యుడు కెపి. వివేక్, తుంగతుర్తి ఎంఎల్‌ఏ  గ్యాదరి కిషోర్‌కుమార్  తదితరులు తమ నెల రోజుల జీతాన్ని  కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్‌రూపంలో పంపుతున్నట్లు స్పష్టం తెలిపారు.అలాగే తెలుగు సినిమా రంగానికి చెందిన   హీరోలు, హీరోయిన్లు, పలువురు వ్యాపార, వాణిజ్య వేత్తలు కూడా స్పందిస్తున్నారు.

కేరళ రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకువస్తున్నారు. చిరంజీవి, రామచరణ్‌లు రూ.25 లక్షలు చొప్పున, చిరంజీవి తల్లి అంజనాదేవి రూ. 10లక్షలు, ఉపాసన రూ.10 లక్షల విలువ చేసే మందులు, ఆహార పదార్ధాలను పంపుతున్నారు. నాగార్జున రూ. 28 లక్షలు, మహేశ్‌బాబు రూ. 25 లక్షలు, జూనియర్ ఎన్‌టిఆర్ రూ.25 లక్షలు, అల్లుఅర్జున్ రు. 25 లక్షలు, ప్రభాస్ రూ. 25 లక్షలు, విజయ దేవర కొండ రూ. 5లక్షలు,నందమూరి కళ్యాణ్‌రామ్ రూ. 10లక్షలు, గీతా గోవిందం చిత్ర నిర్మాతలు ఒక రోజు సినిమా కలెక్షన్ల మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు ప్రకటించా రు.‘మా’రూ.10లక్షలను విరాళాన్ని ప్రకటించింది.

దేవ భూమికే ప్రళయం బాధాకరం : కె.కె., జితేందర్‌రెడ్డి : దేవుళ్ళు ఉండే ప్రాంతంగా పిలుచుకునే కేరళ రాష్ట్రం భారీవర్షాలు, వరదలతో అతలాకుతలంగా మారడం బాధాకరమని టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు డాక్టర్ కె.కేశవరావు,లోక్‌సభ పక్ష నాయకులు జితేందర్‌రెడ్డిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కేరళలో మొత్తం 15 జిల్లాలు ఉంటే అందులో 14 జిల్లాలు వరద ప్రళయంలో మునిగిపోవడం దురదృష్టకరమన్నారు. చిన్నారులు పాలు కోసం తపిస్తుం టే తల్లిదండ్రులు పడే బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అందుకే కేరళ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తక్షణమే రూ. 25 కోట్ల విరాళాన్ని ప్రకటించగా, టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ పక్షాన ఎంపీలమంతా నెల రోజుల జీతాన్ని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపుతున్నామని వారు వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోడీ ఎరియల్ సర్వే చేసి రూ. 500 కోట్ల మంజూరు చేశారన్నారు. దీనిని దేశ విపత్తుగా భావించి మనవాతవాదులంతా ముందుకు వచ్చి కేరళ రాష్ట్రానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశా రు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎంపి బాల్కసుమన్ కూడా పాల్గొన్నారు.

టిఆర్‌ఎస్ ఎంపిల విరాళం: కాగా టిఆప్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు కూడా తమ నెల రోజుల జీతాన్ని కేరళ రాష్ట్ర బాధితులను ఆదుకునేందుకు పంపుతున్నట్లు వారు వెల్లడించారు. పార్టీ పక్షాన లోక్‌సభ, రాజ్యసభలో మొత్తం 20 -మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారంతా తమ నెల రోజు ల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. వారిలో కె. కేశవరావు, ఎ. జితేందర్‌రెడ్డి, వినోద్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, జె. సంతోష్‌కుమార్, బండా ప్రకాశ్ ముదిరాజ్, బి. లింగయ్య, బూర నర్సయ్యగౌడ్, నాగేశ్, కె, కవిత, బిబి. పాటిల్, ప్రభాకర్‌రెడ్డి, మల్లారెడ్డి, పి. శ్రీనివాస్‌రెడ్డి, ప్రొఫెసర్ సీతారాం నాయక్, పి. దయాకర్, కె. విశ్వేశ్వర్‌రెడ్డి, బాల్కసుమన్, సుఖేందర్‌రెడ్డిలు లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.20 లక్షలను కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపుతున్నట్లు తెలిపారు.