Wednesday, April 24, 2024

లాక్‌డౌన్ సక్సెస్ చేద్దాం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ చరిత్రలో ఆదివారం అద్భుతమైన, అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు జనతా కర్ఫూను విజయవంతం చేశారు. హైదరాబాద్ మొదలుకొని మారుమూల గ్రామాల వరకు ప్రధాన రహదారులతో పాటు, చిన్న గల్లీల వరకు నిర్మానుష్యంగా మారిపోయాయి. కరోనా వైరస్‌కు కళ్లెం వేయడానికి దేశ వ్యాప్తంగా 14 గంటలపాటు జనతా కర్ఫూకు ప్రధాని మోడీ పిలుపు నివ్వగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దీనిని 24 గంటల సేపు ప్రజలంత ఇళ్లకే పరిమితం కావాలని ఇచ్చిన పిలుపుకు ప్రజలు అపూర్వ రీతిలో స్పందించారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ప్రజలంతా జనతా కర్ఫూను సామాజిక బాధ్యతగా, స్వీయ రక్షణ చర్యగా గుర్తించి ఆచరించి గడప దాటక పోవడంతో దేశం యావత్తు స్తంభించిపోయింది. కరోనా మహమ్మారీ నివారణకు అవిశ్రాంతంగా పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బంది చేస్తున్న కృషికి చప్పట్లతో సంఘీభావం తెలపాలనే సూచన మేరకు సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలంతా తమ గృహాల నుంచి బయటకొచ్చి తమ చప్పట్ల ద్వారా వారి సేవలను కొనియాడుతూ అనూహ్య స్పందనను తెలియచేశారు.
ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ ఆదివారం నాటి జనతా కర్ఫూ స్ఫూర్తిని ప్రజలు ఈ నెల 31 దాకా ప్రదర్శించాలని కోరారు. కరోనా రక్కసిని తుద ముట్టించి తెలంగాణ ప్రజలను రక్షించడానికి ముఖ్యమంత్రి 9 రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వానికున్న నిబద్ధతను ఈ లాక్‌డౌన్ ప్రకటన తెలియచేస్తున్నది. కరోనా నివారణకు 1897 ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధి విధానాలను తెలియచేస్తూ జిఒ ఎంఎస్ నెం 45ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో నెలాఖరు వరకు అంతరాష్ట్ర సరిహద్దులు మూసి వేయబడతాయి. ప్రజా రవాణకు సంబంధించిన టిఎస్‌ఆర్‌టిసి బస్సులు, సెట్విన్ బస్సులు, హైదరాబాద్ మెట్రో, టాక్సీ, ఆటోరిక్షాలు రోడ్లపైకి అనుమతించరు. అత్యవసర వైద్య సర్వీసులను, నిత్యావసర వస్తువుల రవాణాను అనుమతిస్తారు. అంతర్రాష్ట్ర బస్సు సేవలు అనుమతించరు. బహిరంగ ప్రదేశాలలో ఐదుగురికి మించి

గుమికూడరాదు. ఇంటి అవసరాల కోసం కావాల్సిన మందులు, పాలు, కూరగాయలు నిత్యావసర వస్తువుల సేవకరణ కోసం కుటుంబానికి ఒక వ్యక్తికి మాత్రమే అనుమతి ఇస్తారు. అన్ని దుకాణాలు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు, వర్క్‌షాపులు, వ్యాపార సముదాయాలు, గోదాములు పూర్తిగా మూసి ఉంచాలి. ఔషధ తయారీ కంపెనీలు, ఆహార ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమలకు మినహాయింపు ఉంటుంది. బ్యాంకులు, మీడియా, టెలికం, పోస్టల్, ఇంటర్‌నెట్ సర్వీసులు, ఆసుపత్రులు, పెట్రోలు పంపులు, గ్యాస్ ఏజెన్సీలు పని చేస్తాయి. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం 2005, అంటురోగాల నివారణ చట్టం 1897 ప్రకారం చర్యలు తీసుకుంటారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు నిలిచిపోనుండటంతో తెల్లరేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఉచితంగా 12 కె.జిల బియ్యం, సరుకుల కోసం రూ. 1500 నగదు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం తక్షణమే రూ. 2,417 కోట్లు విడుదల చేయడం సాహసోపేతమైన నిర్ణయంగా చెప్పవచ్చు. అదే విధంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు చెల్లిస్తామని, ప్రైవేటు ఉద్యోగులకు, కార్మికులకు ఆయా సంస్థలు వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. ఇలాంటి విపత్కర సమయంలో యాజమాన్యాలు తమ ఉద్యోగులను ఆదుకోవడం సామాజిక బాధ్యతగా గుర్తెరగాలన్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 360కి చేరడం, మొత్తం మరణాల సంఖ్య ఏడుకు చేరడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశ వ్యాప్తంగా 80 జిల్లాల్లో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ విధించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి గూడ్స్ రైళ్లు మినహా మిగతా అన్ని రకాల రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీలు నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో 17 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 80 జిల్లాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కేంద్రం లాక్‌డౌన్ విధించింది. తెలంగాణతో పాటు పంజాబ్, చంఢీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు లాక్‌డౌన్ (స్వీయ నిర్బంధం) ప్రకటించాయి.
నేడు కరోనా వైరస్‌ను అంతమొందించటానికి ప్రపంచంలోని అనేక దేశాలు అనుసరిస్తున్న అనేక మార్గాల్లో లాక్‌డౌన్ చాలా ప్రధానమైంది. కరోనా రక్కసి శరవేగంఆ ఒకరి నుంచి మరొకరికి ప్రబలుతుండటంతో ప్రజల మధ్య సామాజిక దూరాన్ని పెంచడానికే లాక్‌డౌన్‌ను వివిధ దేశాలు చేపడుతున్నాయి. ప్రజల ప్రాణాలను రక్షించడానికి జన సంచారాన్ని నియంత్రించడం, సరిహద్దుల్ని మూసేసి వాహనాల రాకపోకల్ని నిలిపివేయడం, అత్యవసర వస్తువులు మినహా మిగతా దుకాణాలను మూసివేయటం, ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ప్రపంచ దేశాలు కట్టుదిట్టమైన చర్యలను లాక్‌డౌన్‌లో చేపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా 3,08,130 మందికి సోకగా మరణాలు 13,444 కు చేరుకున్నాయి. ఆదివారం ఒక్క రోజే 1702 మంది మృతి చెందగా వీరిలో ఒక్క ఇటలీ దేశంలోనే 651 మంది ఉన్నారు. సుమారు 170 దేశాలకు వైరస్ వ్యాపించగా దాదాపు 35 దేశాలు తమ సరిహద్దులను మూసేశాయి.

కరోనా జన్మించిన చైనాలోని వుహాన్‌లో తొలిసారిగా లాక్‌డౌన్ ప్రారంభమైంది. జనవరి 23న వుహాన్‌లో ప్రారంభమైన లాక్‌డౌన్ నేటికి కొన్ని సడలింపుల ద్వారా నిర్బంధంగా అమలవుతోంది. దీంతో వుహాన్‌లో నేడు కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చింది. వుహాన్ అనుభవంతో ప్రపంచంలోని అనేక దేశాలు స్వీయ నిర్బంధాన్ని అమలు చేస్తున్నాయి. ఇటలీలో పరిస్థితి విషమించిన తర్వాత మార్చి 8న లాక్‌డౌన్ ప్రకటించింది. అమెరికాలోని కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షికాగో, లాస్ ఎంజెల్స్ నగరాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో బయటకు వచ్చిన వారిపై జరిమానాలు విధిస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ముందుస్తు చర్యలు చేపట్టింది. కరోనా నోడల్ కేంద్రాలైన గాంధీ, ఫీవర్, ఛాతీ దవాఖానాలు కార్పొరేట్ వైద్యశాలలకు మించిన వైద్య సేవలందిస్తున్నాయి. కరోనా బాధితుల కోసం గాంధీ దవాఖానాలో 40, ఫీవర్ దవాఖానాలో 40, ఎర్రగడ్డ ఛాతీ దవాఖానాలో 20, ఉస్మానియాలో 10 బెడ్లతో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐసోలేషన్ గదుల్లో సెల్‌ఫోన్లు వాడుకునే వైఫై సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం ఏ ర్పాటు చేసింది. కరోనా వైరస్‌పై అధ్యయనం, ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది. కరోనా వైరస్ నివారణకు ఈ కమిటీ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సూచనలు అందిస్తుంది. నిపుణుల కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రమాదభరితమైన కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన లాక్‌డౌన్ కార్యక్రమానికి ప్రతి పౌరుడు సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలు ప్రదర్తిస్తే వేగంగా మనుషులను కబళిస్తున్న రక్కసి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకున్నవారమవుతాం. జనతా కర్ఫూ స్ఫూర్తితో లాక్‌డౌన్ (స్వీయ నిర్బంధం)ను విజయవంతం చేద్దాం.

బిల్లిపల్లి లక్ష్మారెడ్డి
9440966416

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News