Saturday, April 20, 2024

మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నిక నేడే

- Advertisement -
- Advertisement -

mayors-and-chairpersons

హైదరాబాద్: కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్, డిప్యూటీ ఛైర్ పర్సన్‌లను పరోక్ష పద్ధతిలో సోమవారం ఎన్నుకోనున్నారు. రాష్ట్రంలోని 120 మున్సిపాల్టీలు, తొమ్మిది కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. వారంతా తమ మేయర్, ఛైర్ పర్సన్‌లను ఎన్నుకోనున్నారు. ముందుగా సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల లో ఎన్నికైన వార్డు సభ్యులు ప్రమాణం చేస్తారు. ఆ తరువాత జిల్లా కలెక్టర్ నియమించిన గెజిటెడ్ స్థాయి హోదా కలిగిన ప్రిసైడింగ్ అధికారి మేయర్, ఛైర్ పర్సన్ల ఎన్నికకు సంబంధించి ప్రత్యేక సమావేశం కోసం నోటీస్ జారీ చేస్తారు.

అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు జరి గే ప్రత్యేక సమావేశంలో వారిని ఎన్నుకుంటారు. కార్పొరేషన్లలో ముందు మేయర్, మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్ల ఎన్నికను ముందుగా పూర్తి చేయాలి. ఎన్నిక పూర్తయ్యాకనే డిప్యూటీ మేయర్, డిప్యూటీ ఛైర్ పర్సన్ల ఎన్నిక కోసం ప్రక్రియను చేపడుతారు. ఏదేనీ కారణంతో సోమవారం ఎన్నికను పూర్తి చేయలేనిపక్షంలో మరుసటి రోజు 28న ఎన్నిక నిర్వహించాలి. పరోక్ష ఎన్నికలో ఓట్లు సమానంగా వస్తే లాటరీ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. పదవులకు సంబంధించి ఆదివారం ఉదయం 11 గంటల్లోపు ఎ ఫారం పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, 27న ఉదయం 10 గంటల్లోపు బి ఫారం అభ్యర్థి పేరుపై ఇస్తారు.

చేతులెత్తడంతోనే.. విప్ ధిక్కరిస్తే వేటు

ఎన్నికైన వారిలో ఒక మెంబర్ మేయర్, చైర్‌పర్సన్ క్యాండిడేట్‌ను ప్రతిపాదించాలి, మరో మెంబర్ మద్దతు ఇవ్వాలి. పోటీలో రిజర్వుడ్ పర్సన్ ఒకరే ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఎక్కువ మంది ఉంటే చేతులెత్తే ప్రక్రియలో ఓటింగ్‌నిర్వహించి విజేతను ప్రకటిస్తారు. ఇక పార్టీలు విప్‌ను జారీ చేసుకోవచ్చు. ఒక సభ్యుడు పార్టీ విప్‌ను ధిక్కరించినా, ఆవిధేయత చూపినా కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం సదరు సభ్యుడిని పదవీ నుంచి తొలగించాల్సి ఉంటుంది. కో ఆప్షన్ సభ్యులుగా ఓటు వేయాలనుకునే ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు ఏ మున్సిపాలిటీ ఛైర్ పర్సర్, మేయర్‌ను ఎన్నికలో పాల్గొంటారో ముందుగానే నమోదు చేసుకున్నారు. ఒక్కసారి ఇచ్చిన ఆప్షన్ మార్చాడానికి వీల్లేదు.

ఎక్స్ ఆఫీషియోలు.. స్వతంత్రులే కీలకం

ఎక్స్ అఫిషియో సభ్యులున్నప్పటికీ ఇంకా మెజారిటీ తక్కువగా ఉన్న వాటితో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులు లేని చోట ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టేందుకు గులాబీ రాష్ట్ర నాయకత్వం మంత్రులు, జిల్లా నాయకులను రంగంలోకి దించింది. ఇతర పార్టీల సభ్యులను కూడా ఆకర్షించేందుకు మంతనాలు జరుపుతోంది. నిజామాబాద్‌లో టిఆర్‌ఎస్ మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి మెజారిటీలో ఉండగా, మెజారిటీ రాని కార్పొరేషన్లు రామగుండం, బడంగ్ పేట్, మీర్ పేటను తన ఖాతాలో వేసుకునేందుకు ఎత్తులు వేసింది. రామగుండంలో మొత్తం 50 స్థానాలకుగాను మేయర్ కోసం 25 స్థానాలు అవసరం కాగా టిఆర్‌ఎస్ 18 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఆ పార్టీకి ఇంకా 7 స్థానాలు అవసరం.ఇక్కడ 15 మంది ఇతరులు గెలవడం గమనార్హం. అదే విధంగా బడంగ్ పేట్ లో 32 స్థానాలుండగా మేయర్ కోసం 16 స్థానాలు అవసరం. కాగా టిఆర్‌ఎస్ 13 గెలుచుకోగా మరో మూడు కావాల్సి ఉంది మీర్ పేటలో 46కు 24 అవసరం కాగా 19 దగ్గరే ఆగిపోయింది. ఇంకా ఐదుగురు సభ్యులు కావాలి.

మున్సిపాలిటీల్లో ఇలా…

అయిజ మున్సిపాల్టీలో 20కి గాను కేవలం ఆరు మంది సభ్యులే ఉన్నా టిఆరఎస్ చైర్ పర్సన్ స్థానం కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. ఆ పార్టీ జిల్లా నాయకులు రంగంలో దిగి ఇండిపెండెంట్లను సంప్రదిస్తోంది. జనగామలో మొత్తం స్థానాలు 30 ఉండగా టిఆర్‌ఎస్ 13, కాంగ్రెస్ 10, బిజెపి 4, ఇతరులు 3 గెలుచుకున్నారు. ఖానాపూర్‌లో 12 స్థానాలకు టిఆర్‌ఎస్, కాంగ్రెస్ చెరి ఐదు చొప్పున గెలుచుకోగా బిజెపి నుంచి ఒకరుండగా,ఇతరులు ఇంకొకరున్నారు. నస్పూర్ లో 25 స్థానాలకు టిఆర్‌ఎస్ 10, కాంగ్రెస్ 6, బిజెపి 3, ఇతరులు 4, సిపిఐ నుంచి ఇద్దరున్నారు.

మణికొండలో టిఆర్‌ఎస్ 5, కాంగ్రెస్ 8, బిజెపి 6, ఇతరులు ఒక స్థానాల్లో ఉండడంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. భూత్పూర్ లో టీఆర్‌ఎస్, బిజెపిలు చెరి నాలుగేసి చొప్పున గెలుచుకోగా కాంగ్రెస్ కు రెండు సీట్లు వచ్చాయి. కొస్గిలో రెండు సీట్లు గెలుచుకున్న ఇతరులు కీలకంగా మారారు. టిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఏడేసి వార్డుల చొప్పున సమానంగా గెలుచుకోగా మెజారిటీకి 8 సీట్లు అవసరమున్నాయి. ఇక వనపర్తి జిల్లాలోని 10 స్థానాలున్న అమరచింత అంతుచిక్కడం లేదు. ఇక్కడ టిఆర్‌ఎస్ మూడు స్థానాలతో సరిపెట్టుకోగా సిపిఐ(ఎం) రెండు స్థానాలు, కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, తెలుగుదేశం ఒక్కో స్థానాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. మిగిలిన ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దీంతో ఇక్కడ ఎవరు ఎవరికి మద్దతిస్తారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

Telangana Mayors And Chairpersons Election Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News