Thursday, December 1, 2022

తెలంగాణ ఆధునిక కవిత

- Advertisement -

ద్వానా శాస్త్రి
98492 93376

     Poet

తెలంగాణలో ఆధునిక కవిత అనగానే సురవరం ప్రతాపరెడ్డి సంకలనం “గోల్కొండ కవుల సంచిక” గుర్తుకు వస్తుంది. గోల్కొండ పత్రికలో ముడుంబై వెంకట రాఘవాచార్య ఒక వ్యాసం రాస్తూ “నిజాం రాష్ట్రంలో “ఆంధ్ర కవులు పూజ్యులు” అన్నారు. ఇది సురవరం వారికి సూదిపోటు అనిపించింది. అంతే, నడుం బిగించాడు. కవుల్ని, కవితల్ని సేకరించారు. 1934లో 354 మంది కవులతో గోల్కొండ కవుల సంచిక ప్రచురించారు. ఇందులో 1100 పద్యాలకు పైగా ఉన్నాయి.

ఒద్దిరాజు సీతారామచంద్ర రావు, రాఘవ రంగారావులు ఒద్దిరాజు సోదర కవులుగా ప్రసిద్ధులు. వీరిది వరంగల్ జిల్లా ‘ఇనుగుర్తి’. వీరు పండితులు, కవులు, నాటక నవలా రచయితలు ఆయుర్వేద వైద్యులు కూడా! రుద్రమ దేవి (నవల), భక్తి సార చరిత్ర (నాటకం), నౌకాభంగం (కావ్యం) వంటి రచనలు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులుగా పని చేసిన పల్లా దుర్గయ్య రాసిన “గంగిరెద్దు” అధిక్షేప కావ్య ప్రాచుర్యం పొందింది. వీరి సిద్ధాంత వ్యాసం “ప్రబంధ వాజ్మయ వికాసం” ఉత్తమ పరిశోధనకు నిదర్శనం. వానమామలై వరదాచార్యులు “పోతన చరిత్రము” అనే మహాకావ్యం రాశారు. అందుకే ఆయనను “అభినవ పోతన” అంటారు. ‘విప్రలబ్ద’ గేయ కావ్యంతోపాటు ‘కూలిపోతున్న కొమ్మ’ అనే వచన కవిత్వం కూడా రాశారు. వీరి అన్నగారు జగన్నాథాచార్యులు “రైతు రామాయణం” రాశారు.

‘కవి రత్న” నీలాజంగయ్య రామ శతకం, కాంతి చక్రం, బుచ్చి లింగపద్యాలు, పాటల మూట” ఆలగీతాల జోలి ” వంటి పద్య, గేయ రచనలు చేశారు. వేముగంటి నరసింహాచార్యులు తిక్కన (కావ్యం), మంజీర నాదాలు, కవితా కాహళి, ఆంధ్ర విష్ణు మొదలైన రచనలు చేసిన పండిత కవి. పద్యప్రియులు. మరి కొన్ని పద్య కావ్యాలు: అనుముల కృష్ణమూర్తి సరస్వతీ సాక్షాత్కారం; పొట్లపల్లి సీతారామారావు ఆత్మ నివేదన; ముకురాల రామారెడ్డి దేవర కొండ దుర్గం; ‘కోవెల సుప్రసన్న దుఃఖ యోగిని; కోవెల సంపత్కుమార అంతర్మథనం (శతకం);ఉత్పల సత్యనారాయణ శ్రీకృష్ణ చంద్రోదయం , (సాహిత్య అకాడమీ బహుమతి పొందినది); సామల సదాశివ కావ్య సుధ, సాంబ శివ శతకం నీరీక్షణము మొ॥ ; కపిల వాయిలింగమూర్తి బహుముఖ ప్రతిభాశాలి. కవి, విమర్శకులు, పండితులు, గ్రంథ పరిష్కర్తలు, నాటక రచయితలు. పండరినాథ విఠల శతకం, దుర్గా శతకం, శ్రీమత్ప్రతాప గిరిఖండం, సాలగ్రామ శాస్త్రం, చూతపురీ విలాసం, గద్వాల హనుమద్వచనాలు వంటి వెన్నో రచించిన విద్వన్మణి కపిలవాయి. కూరెళ్ల విఠలాచార్య అనగానే “విఠలేశ్వర శతకం” గుర్తుకు వస్తుంది.

“సాహితీ కుటీరం” కూరెళ్ల వారి విలక్షణ పద్య ఖండిక “గో విలాపం”, రాళ్లబండి కవితా ప్రసాద్ అవధాని. వీరి “సప్తగిరిధామ! కలియుగ సార్వభౌమ” అనే పద్య కావ్యం ప్రసిద్ధి కెక్కింది. పలకరిస్తే పద్యం, పద్యరత్నాల బండి రాళ్లబండి అనటం నిజమే. తెలుగు విశ్వ విద్యాలయం ఉప కులపతిగా పనిచేసిన అనుమాండ్ల భూమయ్య ‘వేయి నదుల వెలుగు”, ‘వెలుగు నగల హంస’, అగ్నివృక్షము’, ‘జ్వలిత కౌసల్య’ వంటి పద్య కావ్యాలతో విలక్షణ, విశిష్ట కవిగా పేరొందారు.తెలంగాణలో ఆధునిక కవిత్వం అనగానే యుగకర్తగా మార్గదర్శిగా కాళోజీ నారాయణ రావును పేర్కొనాలి. 1914 సెప్టెంబర్ 9న జన్మించిన కాళోజీ అసలు పేరు రఘువీర్. వరంగల్‌లో స్థిరపడ్డారు. “వైతాళిక సమితి” వ్యవస్థాపకులలో ఒకరుగా, స్వాతంత్య్ర సమర యోధుడిగా, పౌర హక్కుల ఉద్యమశీలిగా, ప్రజా కవిగా మన్ననలు అందుకున్నారు. తను రాసిన కవిత్వమంతా కలిపి “నా గొడవ” గా ప్రచురించారు.

“నా గొడవనునది నఖరాలు లేనట్టిది / నాజూకుది కానట్టిది / నా గొడవనునది అక్షరాల జీవనది” అన్నారు.
కాళోజీ ప్రజల మనిషి. ప్రజల గొడవే తన గొడవ. సామాన్యమైన భాషలో కవిత్వం రాసి అసామాన్యుడనిపించుకున్నారు. నా భాష నా యాస నా నేల నా శ్వాస” అని నినదించారు. శ్రీశ్రీ కాళోజీని “నిఖిలాంధ్రకవి” అన్నాడు. “తెలియక ప్రేమ, తెలిసి ద్వేషము”, “ఎన్నిక కథ”, “రెండు గింజలు వంటి కథలు రాశారు. “జీవన గీత” ఖలీల్ జిబ్రాన్‌కి తెనుగు సేత. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులయ్యారు. కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. కాళోజీ కవిత్వ పంక్తుల్లో ముఖ్యమైనవి కొన్ని.

కాళోజీ తర్వాత “నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అని గొంతెత్తి పలికిన కవి దాశరథి కృష్ణమాచార్యులు 1927లో ఖమ్మం జిల్లా మానుకోట తాలూకాలోని గూడూరు గ్రామంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా, “కళా ప్రపూర్ణ” గా “అభ్యుదయ ఉద్యమ నాయకుడు” గా తెలంగాణ రచయితల సంఘానికి అధ్యక్షుడిగా సుస్థిర స్థానం సంపాదించారు. నిజాం నిరంకుశ పాలనకి ఎదురొడ్డి జైలు పాలయ్యారు. అగ్నిధార, రుద్రవీణ, దాశరథి శతకం, ఆలోచనాలోచనాలు, గాలిబ్ గీతాలు, కవితా పుష్పకం, యాత్రా స్మృతి ( జీవిత చరిత్ర) వంటి రచనలతో ఆధునిక కవిత్వానికి పుష్టి కలిగించారు. “తిమిరంతో సమరం” వచన కవితా సంపుటికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

“నా వచనం బహువచనం / నా వాదం సామ్యవాదం కవిత్వం నా మాతృభాష / ఇతివృత్తం మానవత్వం” అని చాటి చెప్పిన నిరంతర కవి, మానవతా వాది, సినీకవి, వక్త, ఉత్తమ అధ్యాపకుడు పరిపాలకుడు, జ్ఞానపీఠ్ బహుమతి గ్రహీత సినారె. అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి. 29.7.1931 కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హనుమాజీపేటలో జన్మించి రాజ్యసభ సభ్యుడయ్యారు. “ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు” అనే సినారె సిద్ధాంత గ్రంథం నేటికీ శిరోధార్యం. భారత ప్రభుత్వం “పద్మభూషణ్‌” తో గౌరవించింది. వీరి మంటలూ మానవుడు కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వస్తే, “విశ్వంభర” అనే తాత్విక దీర్ఘ కావ్యేతిహాసానికి జ్ఞానపీఠం లభించింది. తెలంగాణలో తొలి జ్ఞానపీఠ్ పురస్కారం పొందింది సి. నారాయణ రెడ్డి. వీరి “కర్పూర వసంత రాయలు” గొప్ప గేయ కావ్యం. కొన్ని ముఖ్యమైన సినారె రచనలు. మధ్య తరగతి మందహాసం నాగార్జున సాగరం మట్టి మనిషీ ఆకాశం, ప్రపంచ పదులు, ప్రయోగాత్మక రచన), శిఖరాలూ లోయలు ( అనుసృజన); పగలే వెన్నెల (సినీ గీతావళి) మొదలైనవి. ఉర్దూ గజల్ ప్రక్రియను స్వంతంత్ర తెలుగు ప్రక్రియగా రూపొందించి “తెలుగ గజళ్లు” గా ప్రకటించారు. కొందరు కాళోజీ, దాశరథి, సినారెలను తెలంగాణ ఆధునిక కవిత్రయం అంటారు.

“కొండలు పగలేసినం బండలను పిండినం /మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినం /శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో” “ఓ నా ప్రియమైన మాతృదేశమా… వంటి విప్లవ కవిత్వం రాసి చైతన్యం తీసుకువచ్చిన చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. దిక్సూచి, గమ్యం వంటి కావ్యాలతో పేరొందిన ఈ కవి రాసిన “వందేమాతరం” కవిత సంచలనం కలిగించింది. ఈయన దిగంబర కవిగా ప్రసిద్ధులు. “ఓటమి”, “తిరుగుబాటు” కవితా సంపుటి వెలువరించిన జ్వాలా ముఖి వీర రాఘవాచార్యులు దిగంబర కవిగా విప్లవ కవిగా నిలిచాడు. “తంగేడు పూలు”కవితా సంపుటితో ప్రారంభించి నిత్య నూతన కవిగా “కాలాన్ని నిద్రపోనివ్వను” తో సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన గోపి, చిత్ర దీపాలు, చుట్ట కుదురు, ఎండపొడ వంటి కావ్యాలు అందించి, “జల గీతం” అద్భుతమైన దీర్ఘ కావ్యం రాశాడు. ఇది ఇంచుమించుగా భారతీయ భాషలన్నింటిలోకి అనువదించబడింది. వేమనపై పరిశోధన చేశాడు. “నానీలు” సృష్టించి ‘నానీల నాన్న’ అనిపించుకున్నాడు.

తెలంగాణలో ఆధునిక కవిత్వాన్ని పండించిన ప్రముఖ కవులలో కొందరు. పేర్వారం జగన్నాథం వృషభ పురాణం; వరవరరావు సముద్రం, భవిష్యత్తు చిత్రపటం; సిధారెడ్డి భూమి స్వప్నం, ఒక బాధ గాదు; దర్భశయనం శ్రీనివాసా చార్య జీవన వీచిక , ఆట, నాగేటి చాళ్లు, నేల గంధం; సుద్దాల అశోక తేజ నెమలి కన్నోడ, శ్రమ కావ్యం; అలిశెట్టి ప్రభాకర్ అక్షర నక్షత్రం మీద; జూకంటి జగన్నాథం పాతాళ గరిగే , బొడ్డు తాడు, గంగడోలు, తల్లి కొంగు; నాళేశ్వరం శంకరం దూది మేడ; ఆశారాజు నేపథ్యం, ఒక తడి గీతం, గల్లీ, పాగల్ షాయిర్, ఒగరు , ఇప్పుడు; జూలూరి గౌరీ శంకర్ పాదముద్రలు; జింబో హాజరి హై, లోపలి వర్షం; సుంకిరెడ్డి నారాయణ రెడ్డి దాలి, కందుకూరి శ్రీరాములు కవ్వం, సందర్భం, వయోలిన్ రాగమో వసంత మేఘమో; వి.ఆర్.విద్యార్థి అలలు, ఘర్మ సముద్రం, ఖండాంతర; షాజహానా నఖాబ్; దేవరాజు మహారాజు గుడిసె గుండె, గాయపడ్డ ఉదయం; ప్రజా గాయకులుగా తెలంగాణలో చైతన్యం కలిగించిన కవులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వీళ్లదే అగ్రస్థానం. గుమ్మడి విఠల్ ‘గద్దర్’ గా మారి ప్రభంజనం సృస్టించాడు. “ఓరోరి అమీనోడా ఓరోరి సర్కరోడ”, “సిరిమల్లె సెట్టు కింద లచ్చమ్మమ్మో లచ్చమమ్మ” వంటివి, బండి యాదగిరి “నైజాం సర్కరోడ నాజీల మించినోడ” అంటూ నిప్పులు కురిపించినాడు. ఏకునాదం మోత, రేల పూతలు, అలసెంద్ర వంక వంటి పాటలతో దేశి కవి గోరటి వెంకన్న. “ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అని ప్రజా కవి గూడ అంజయ్య, “మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు” అన్న పాటతోపాటు మరికొన్ని మంచి పాటలతో అందెశ్రీ వెలుగొందుతున్నారు.

బుక్కపట్టణం రామచంద్ర కవి, నేరెళ్ల వెంకటాచార్యులు, బాలబ్రహ్మాచారి, చంద్రమౌళి శాస్త్రి మొదలయిన వారు అవధాన విద్యలో ఆరితేరినారు. సిరిసిన హళ్ కృష్ణమాచార్యులకు “నిజాం రాష్ట్ర అద్యతనాంధ్ర శతావధాని” అని పేరు. దోర్బల ప్రభాకర శర్మ, రాళ్లబండి కవితా ప్రసాద్, గౌరీ భట్ల రామకృష్ణ శర్మ, జి.ఎం. రామశర్మ, అందె వెంకట రాజం, అష్టకాల నృసింహ రామశర్మ మొదలయిన వారు అవధాలు చేస్తూ పద్య పరిమళాన్ని సుసంపన్నం చేస్తున్నారు. సుప్రసన్న , సంపత్కుమార, పేర్వారం జగన్నాథం, వే. నరసింహారెడ్డి కలిసి చేతనావర్త కవులుగా పేరుగాంచారు.

తెలంగాణ ఉద్యమ కవిత్వం ఒక కొత్త యుగంగా నిలుస్తుంది. పాట తెలంగాణ కవిత్వానికి ఊపిరి. తెలంగాణ చరిత్రను సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, గుమ్మన్నగారి బాల శ్రీనివాస మూర్తి, కె.శ్రీనివాస్, ద్వానా మొదలయిన వారు వెలుగులోకి తెచ్చారు. రవ్వా శ్రీహరి, నలిమెల భాస్కర్ తెలంగాణ పదకోశం నిర్మించారు. తెలంగాణ వచన కవులు తెరపైకి వచ్చారు. కవయిత్రులు, విమర్శకులు, స్వేచ్ఛగా సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. కథా, నవలా సాహిత్యంలో కూడా తెలంగాణ భాషకు పట్టంకడుతున్నారు. మొత్తం మీద ఆధునిక తెలంగాణ సాహిత్యం పోరాట దశ నుంచి అస్తిత్వ దిశగా పయనిస్తుంది.

Related Articles

- Advertisement -

Latest Articles