Home తాజా వార్తలు అపురూప సౌధం

అపురూప సౌధం

Telangana new Secretariat building design released

 

శ్రావణ మాసంలో నిర్మాణం ప్రారంభం!
సకల హంగులతో సమీకృత నూతన సచివాలయం
దక్షిణ భారతీయ సంప్రదాయం, దక్కన్ కాకతీయ శైలిలో భవన నిర్మాణం
ఫ్రాన్స్‌లోని వర్సయిల్స్ ప్యాలెస్ స్ఫూర్తితో పచ్చికబయళ్లు
తంగేడు పువ్వు ఆకారంలో వాటర్ ఫౌంటెన్లు
తెలంగాణకు కలికితు రాయిలా పెద్ద గవాక్షం
సిఎం, మంత్రులు, అధికారుల సమావేశాలకు అధునాతన టెక్నాలజీతో హాళ్లు
వందలాది కార్ల పార్కింగ్‌కు వెసులుబాటు
ఏడాది నుంచి ఏడాదిన్నరలో కట్టడం
చెన్నైకి చెందిన ఆస్కార్&పొన్ని ఆర్కిటెక్చర్స్ డిజైన్‌ను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం పాత సచివాలయ భవనాన్ని కూల్చేసి దాని స్థానంలోనే అన్ని హంగులతో సమీకృత నూ తన సచివాలయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. శ్రావణ శుద్ధ పంచమి అంటే జూలై 25 లేదా రాఖీ పౌర్ణిమ అంటే ఆగస్టు 3న కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. కొత్త భవన నిర్మాణాన్ని ఏడాది నుంచి ఏడాదిన్నర పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోం ది. ఆరు లక్షల చదరపు అడుగుల్లో నూతన సచివాలయం నిర్మాణం జరగనుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల సమావేశాలకు కోసం అ ధునాతన హాల్స్ దీనికోసం నిర్మించనున్నారు. మంత్రుల పేషీల్లోనే ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్ ఆఫీసులను ఏర్పాటు చేయబోతున్నారు.

భవనం కోసం10 కంపెనీలు నమూనాలను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను ప్రభుత్వానికి సమర్పించాయి. అన్ని ఆధునిక హంగులతో నిర్మించబోయే కొత్త సచివాలయం కోసం రూ. 450 కోట్ల నుంచి రూ.500 కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం అం చనా వేస్తోంది. ఈ మొత్తానికి బడ్జెట్ విడుదల ఉ త్తర్వుల జారీ చేసేందుకు ఆర్‌అండ్‌బి విభాగం త్వరలో ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపనున్నట్టుగా తెలిసింది. డెక్కన్ కాకతీయ శైలిలో సమీకృ త సచివాలయ భవన నిర్మాణానికి సంబంధించి 20 శాతం సమీకృత భవనానికి, మిగిలిన 80 శా తం ఉద్యానవనం, ఫౌంటేన్ల కోసం స్థలాన్ని కేటాయించనున్నట్టు అధికారులు తెలిపారు. దీర్ఘచతురస్రాకారంలో 6 అంతస్థులు, 7లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో భవన నిర్మాణం జరగనుంది. భవనానికి అత్యంత విశాలంగా 2 మీటర్ల మేర ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ద్వారం మధ్యలో తెలంగాణ కలికితురాయిలా ఓ పెద్ద గవాక్షాన్ని నిర్మించనున్నారు. పెద్దపెద్ద కారిడార్లు, గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా భారీ వరండాలతో డిజైన్లను రూపొందించారు. కొత్త భవన ముఖ ద్వారం తూర్పు వైపుగా ఉండి, ముఖ్యమంత్రి కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉండేలా ఈ నిర్మాణం జరగనుంది. భవనం మధ్యలో చెట్లు, పచ్చికబయళ్లతో కూడిన రెండు పెద్ద వరండాలు లోపల వెలువడే కర్భన వ్యర్థాలను తగ్గించే విధంగా ఉంటాయి. హుస్సేన్‌సాగర్ మీదుగా వీచే గాలులు లోపలికి ప్రవేశించి భవనం ఎల్లప్పుడూ చల్లగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కర్బన రసాయనాలను నియంత్రించే విధంగా…
సైట్లో 60 శాతం స్థలం అందమైన పచ్చికబయళ్లతో కర్భన రసాయనాలను నియంత్రించే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరిచేలా ఉంటుంది. ఫ్రాన్స్‌లోని ప్యాలెస్ ఆఫ్ వర్సెల్స్ స్ఫూర్తిగా పచ్చికబయళ్లు భవనానికి ఈశాన్యం, ఆగ్నేయం మూలాల్లో ఉండేలా నిర్మాణం జరుగుతుంది. రెండు ల్యాండ్‌స్కేప్‌ల్లో రెయిన్‌వాటర్ హార్వెస్టర్లతో పాటు మధ్యలో తెలంగాణ అధికారిక పువ్వు తంగేడు ఆకారంలో వాటర్ ఫౌంటెన్లను ఏర్పాటు చేయనున్నారు. కృత్రిమ విద్యుత్ అవసరం లేకుండానే సహజమైన వెలుతురుపడేలా ఈ నిర్మాణం జరుగుతోంది. భవనం మొత్తం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్ బిల్డింగ్‌కాన్సెప్ట్‌లో నిర్మితమవుతోంది. స్మార్ట్ లైటింగ్ కంట్రోళ్లు, మోషన్ సెన్సార్లు, ఆటోమెటిక్ స్విచ్చులు, టైమర్లు, డిమ్మింగ్ కంట్రోళ్లు లాంటి హంగులన్నింటిని ఏర్పాటు చేస్తారు.

సెక్రటేరియట్ రూఫ్‌టాప్‌పై, పార్కింగ్ రూఫ్‌టాప్‌లపై సోలార్ ప్యానళ్ల అమరిక
కొత్త సెక్రటేరియట్ రూఫ్‌టాప్‌పై, పార్కింగ్ రూఫ్‌టాప్‌లపై సోలార్ ప్యానళ్ల అమరికతో సౌర విద్యుత్ వాడుకునేలా నిర్మాణం జరుగనుంది. భవనం మొత్తం ధారాళంగా ఉండేలా గాలి ప్రసరించి సహజమైన చల్లదనం ఉండేలా, లోపల ఉండే భారీ వరండాల్లో స్వచ్ఛమైన గాలి పీల్చేందుకు దోహదపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయం పార్కింగ్‌లో 500ల కార్లు, విజిటర్స్ పార్కింగ్‌లో 300ల కార్లు పార్కింగ్ చేసేలా వెసులుబాటు కల్పిస్తూ కొత్త సచివాలయ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. గుడి, బడి, బ్యాంకు, ఎటిఎంలు, క్యాంటీన్ల ఏర్పాటుకు సరిపోయే స్థలాన్ని సైతం ఈ నిర్మాణంలో కేటాయించనుంది.

చెన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్చర్స్ డిజైన్‌ను..
సమీకృత కొత్త సచివాలయం కోసం చెన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్చర్స్ డిజైన్‌ను ప్రభుత్వం ఖరారు చేసినట్టుగా సమాచారం. మొత్తం 10 డిజైన్లకు గాను మూడింటిని ఆర్‌అండ్‌బి శాఖ మూడు డిజైన్లను సిఎంకు పంపించగా అందులోంచి ఒక డిజైన్‌ను సిఎం ఎంపిక చేసినట్టుగా తెలిసింది. ఇక కొత్త నిర్మాణంలోని ఫీచర్స్‌ను చూస్తే ఇది పూర్తి వాస్తు ప్రకారం రూపొందించిన డిజైన్. అత్యుత్తమ దక్షిణభారతీయ సంప్రదాయంలో డెక్కన్ కాకతీయ శైలిలో సమీకృత సచివాలయ భవన నిర్మాణం తెలంగాణకు తలమానికంగా నిలవనుందని అధికారులు పేర్కొంటున్నారు. మనోహరమైన కాకతీయుల నిర్మాణశైలిలో విలక్షణ స్మారక చిహ్నంగా సమీకృత సచివాలయం నిర్మాణం జరగనున్నట్టుగా సమాచారం.

రాజప్రసాదంలా కొత్త సచివాలయ భవన నమూనా
ఇదిలా ఉంటే తెలంగాణ కొత్త సెక్రటేరియట్ డిజైన్ ఖరారైందని అధికారికంగా సిఎంఓ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త సచివాలయ భవన నమూనా చారిత్రక కట్టడాన్ని పోలి ఉంది. చూడడానికి రాజప్రసాదంలా ఉన్న ఈ నమూనా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. భవనం ముందున్న నీటి కొలనులో ఈ భవనం ప్రతిబింబిస్తోంది. ఆరు అంతస్థుల్లో సచివాలయ భవన నిర్మాణం చేపట్టనున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, పర్యావరణహిత భవన దీని నిర్మాణం జరగనుంది.

Telangana new Secretariat building design released