Home తాజా వార్తలు విత్తనోత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానం

విత్తనోత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానం

Singireddy

వేరుశనగ, వరి విత్తనాలు పండించే ప్రాంతం వనపర్తి జిల్లా
విత్తనాభివృద్ధి వ్యవసాయం వల్ల రైతుకు ఎక్కువ లాభం
గోదాంను ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మన తెలంగాణ/వనపర్తి కలెక్టరేట్ : ప్రపంచంలోని అన్ని ప్రాంతాల వారు తెలంగాణ రాష్ట్ర విత్తనాన్ని వాడే విధంగా రాష్ట్రంలో విత్తనాభివృద్ధిని చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్షమని రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, పౌరసరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రానికి సమీ పంలో ఉన్న మర్రికుంటలో రూ. 2 కోట్ల 80 లక్షల వ్యయంతో నిర్మించిన విత్తన గోదాంను మంత్రి సింగి రెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నాణ్యమైన విత్తన ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రపంచంలో రెండవ స్థానంలో ఉందని మంత్రి వెల్లడించారు. విత్తనాభివృద్ది వ్యవసాయం వల్ల రైతుకు ఎక్కువ లాభం వస్తుందన్నారు. తెలంగాణ రైతు విత్తనాలు పండించే రైతుగా పేరు సంపాదించాలని కోరారు. కంది, పెసర, విత్తనాల అవసరాలను తీర్చే ప్రాంతంగా ఉమ్మడి జిల్లాకు పేరు పొందగా, వేరుశనగ, వరి విత్తనాలు పండించే ప్రాంతంగా వనపర్తి జిల్లా పేరు గాంచిందన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పత్తివిత్తనాలకు ప్రసిద్ది అని మంత్రి తెలిపారు.

గ్రామాల్లో విత్తనాలు ఉత్పత్తి చేసే రైతుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు గాను పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపడుతామని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ప్రారంభించిన గోదాం పక్కనే కోల్డ్ స్టోరేజిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుత గోదాం అవసరమైన అవసరమైన ప్రహరి నిర్మాణానికి కలెక్టర్ శ్వేతామహంతికి ప్రతిపాదనలు పంపాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్‌రావు, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ ఎండి. కేశవులు, టిఆర్‌ఎస్ నాయకులతో కలిసి గోదాం ఆవరణలో మంత్రి నిరంజన్‌రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు బి.లక్ష్మయ్య, ఎంపిపి కిచ్చారెడ్డి, జిల్లా గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షులు కురుమూర్తియాదవ్, ఇటిక్యాల జడ్పిటిసి హన్మంత్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్, విత్తన అభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు.

Telangana number one in seed Producing in country