Friday, March 29, 2024

ఒలింపిక్ సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -
Olympic-Association
జగన్మోహన్ వర్గానికే మెజారిటీ సంఘాల మద్దతు!  పోరు ఏకపక్షమేనా!  జగదీశ్వర్ ప్యానల్‌కు కష్టమే,  నేడు హైదరాబాద్‌లో టిఓఏ ఎన్నికలు

మన తెలంగాణ/హైదరాబాద్: అనూహ్య మలుపులు తిరుగుతూ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఆదివారం హైదరాబాద్‌లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. జగన్మోహన్ రావు, జగదీశ్వర్ యాదవ్ ప్యానల్‌ల మధ్య ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఒలింపిక్ భవన్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగే ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు. కాగా, ఈ ఎన్నికల్లో మెజారిటీ సంఘాలు జగన్మోహన్ రావు, జయేశ్ రంజన్ వర్గానికి మద్దతుగా నిలుస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఈ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నారు.

మరోవైపు ఆయన ప్రత్యర్థిగా ప్రస్తుత ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ నిలిచారు. మరోవైపు జగన్మోహన్ రావు ప్యానల్ తరఫున అధ్యక్ష పదవికి రాష్ట్ర ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పోటీ పడుతున్నారు. ఆయన ప్రత్యర్థిగా రంగారావు తలపడుతున్నారు. ఈ ఎన్నికల్లో జయేశ్ రంజన్‌తో పాటు రంగారావు, జితేందర్ రెడ్డిలు అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేశారు. అయితే రిటర్నింగ్ అధికారి జితేందర్ రెడ్డి, జయేశ్ రంజన్ నామినేషన్లను తిరస్కరించారు. దీంతో అధ్యక్షుడిగా రంగారావు ఎన్నిక లాంఛనమేనని అందరూ భావించారు. అయితే నామినేషన్ తిరస్కరణకు వ్యతిరేకంగా జయేశ్ రంజన్ హైకోర్టుకు వెళ్లారు.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జయేశ్ రంజన్ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. అంతేగాక ఎన్నికలు ఢిల్లీలో కాకుండా హైదరాబాద్‌లోనే నిర్వహించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామంతో జగదీశ్వర్ వర్గానికి కోలుకోలేని షాక్ తగిలింది. ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించి ఎలాగైన విజయం సాధించాలని భావించిన వారికి నిరాశే మిగిలింది. హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్‌లోనే ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఒలింపిక్ చర్యలు చేపట్టింది.

జయేశ్ రంజన్ ప్యానల్‌కే ఛాన్స్?

మరోవైపు ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు జయేశ్ రంజన్ వర్గం పకడ్బంధీ వ్యూహాలు రచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల క్రీడా సంఘాలను తమకు మద్దతుగా నిలిచేలా చేయడంలో జయేశ్ రంజన్, జగన్మోహన్ రావు సఫలమయ్యారనే చెప్పాలి. అంతేగాక వీరి మెనిఫెస్టో కూడా ప్రత్యర్థి కంటే ఎంతో బాగుండడంతో మెజారిటీ సంఘాలు జగన్మోహన్ ప్యానల్‌కే మద్దతుగా నిలిచినట్టు సమాచారం. ఇక, ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను గమనిస్తే ఈ ఎన్నికల్లో జయేశ్ రంజన్ ప్యానల్ ఏక పక్ష విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలావుండగా నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా జగదీశ్వర్ యాదవ్ వర్గం అనుసరించిన విధానం కూడా జయేశ్, జగన్మోహన్ ప్యానల్‌కు కలిసి వచ్చింది. జయేశ్ రంజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఆయన సానుభూతి మరింత పెరిగింది. ఇక, ఎన్నికల్లో గెలిచేందుకు జగదీశ్వర్ ప్యానల్ పన్నిన వ్యూహాలన్ని బెడిసి కొట్టాయి. ఈ ఎన్నికల్లో వీరికి చేదు అనుభవమే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విజయం మాదే : జగన్మోహన్ రావు

ఈ ఎన్నికల్లో తమ ప్యానల్ కచ్చితంగా గెలుస్తుందనే నమ్మకాన్ని ప్రధాన కార్యదర్శి పదవి అభ్యర్థి జగన్మోహన్ రావు వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తమ వర్గం ఏకపక్ష విజయం సాధించడం తథ్యమన్నారు. తమను గెలిపిస్తే రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి విప్లవాత్మక చర్యలు చేపడుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తెలంగాణలో అంతర్జాతీయ క్రీడలను భారీ ఎత్తున నిర్వహిస్తామన్నారు. అంతేగాక భారత ఒలింపిక్స్ సంఘం నుంచి పెద్ద మొత్తంలో నిధులను రాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తామన్నారు.

Telangana Olympic Association President Election 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News