Home కలం ధిక్కార స్వరం కాళోజీ

ధిక్కార స్వరం కాళోజీ

Kaloji Narayana Rao

 

కాళోజీ అక్షరాలకు గెరిల్లా శిక్షణ యిచ్చాడు. ఆయన కవిత్వమంటే అన్యాయంపై అక్షరాయుధం అందుకే… ‘అన్యాయాన్ని ఎదురిస్తే నాగొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు’ అంటాడు. ఆంధ్ర వలస వాదాన్ని వ్యతిరేకిస్తూనే తెలంగాణ నాయకులను కూడా హెచ్చరించాడు. ‘ప్రాంతేతరులు దోపిడి చేస్తే పొలిమేరదాకా తన్ని తరుముతాం, ప్రాంతంవాడే దోపిడి చేస్తే ప్రాణంతోనే పాతరవేస్తాం’ అన్నాడు. ఆకలి, ఆధిపత్యం, అన్యాయం, అసమానత్వం లేని తెలంగాణ సమాజాన్ని కాళోజీ కోరుకున్నాడు.  ఆ దిశగా మనమంతా పయనిద్దాం.

నిజాం వ్యతిరేక పోరాటంలో పలుమార్లు జైలు శిక్ష అనుభవించాడు. వరంగల్ జిల్లా భైరాన్‌పల్లిలో రజాకార్లు ఒకే రోజు 90మందిని కాల్చి చంపారు. ఈ ఘటన కాళోజిని తీవ్రంగా కలవరపర్చింది. ఈ సందర్భంలో యిలా అంటాడు. “మనకొంపలార్పిన మన స్త్రీల చెరిచిన/ మన పిల్లలను జంపి మనల బంధించిన / మానవాధములను మండలాధీశులను / మరచిపోకుండా గుర్తుంచుకోవాలి/ కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలె/ కాలంబు రాగానే కాటేసి తీరాలి.

‘నూటికో కోటికో ఒక్కరు, ఎక్కడో ఎప్పుడో పుడతారు’ ఓ సినీ కవి చెప్పిన మాట అక్షరాల కాళోజీ నారాయణరావుకు వర్తిస్తుంది. వారు తెలంగాణ భూమి పుత్రుడుగా జన్మించడం మన అదృష్టం. తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఎలుగెత్తి చాటిన అతి తక్కువ మంది కవుల్లో కాళోజి అగ్రగణ్యులు. వేమన తర్వాత ‘ప్రజాకవి’గా పేరొందినది కాళోజి మాత్రమే. అందుకే పద్మవిభూషణ్ బిరుదుకన్నా ‘ప్రజాకవి’ అన్న బిరుదే గొప్పదని తెగేసి చెప్పాడు.

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్రం గూర్చి పోరాడిన రూసో, మాంటెస్కూ, ఓలేటర్‌ల తర్వాత అంతటి గొప్ప వ్యక్తి కాళోజీ. రాజకీయాల్ని, ‘ప్రజాకీయం ’చేయాలని , రాజకీయాలు ప్రజాకీయాలుగా మారితేనే ప్రభుత్వాలు ప్రజలలో భాగమవుతాయని ఆయన దృఢంగా విశ్వసించారు. సంపూర్ణ విప్లవానికి పిలుపునిచ్చిన సర్వోదయ నాయకుడు లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ దివంగతులైనప్పుడు కాళోజి ఈ విధంగా అంటాడు. ‘పుట్టుక నీది, చావు నీది, బ్రతుకు దేశానిది’ అక్షరాలా యిదే వాక్యం ఆయన జీవితానికి వర్తిస్తుంది. ఇక్కడ బ్రతుకు తెలంగాణది.

తెలుగు ప్రజలందరూ ఒకే రాష్ట్రంగా అవతరించాలని నిండు మనస్సుతో విశాలంధ్రకు మద్ధతిచ్చాడు. తర్వాత కాలంలో ఆంధ్రపెత్తందారీ వ్యవస్థను, ప్రాంతాల మధ్య అసమానతలను తీవ్రంగా ఖండిస్తూ 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. “వానాకాలంలోనూ చేనులెండిపోతాయని, మండే వేసవిలో వలే ఎండలు కాస్తుంటాయని ఎవరనుకున్నారు, ఇట్లౌనని ఎవరనుకున్నారు? ” అని ఆంధ్రపాలకుల వంచనను ఎండగట్టాడు.

1914లో మొదటి ప్రపంచ యుద్ధంతో పాటే కాళోజీ పుట్టారు. రెండు ప్రపంచ యుద్ధాల నడుమ ఆయన ఉద్యమ జీవితం కొనసాగింది. హైదరాబాద్ సంస్థానంలో నివసించే కన్నడ మరాఠి భాషల కలయికతో కాళోజీ పుట్టారు. తల్లి కన్నడిగ, తండ్రి మహారాష్ట్రీయులు. తెలంగాణలో స్థిరపడ్డారు. తద్వారా ఆయనకు కన్నడం, మరాఠీ, తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం వుంది. ఆయనకు భాషా సంకుచితత్వం లేదు. నేనింకా ‘నా’ నుండి ‘మా’ వరకు రాలేదు. ‘మనం’ అన్నప్పుడు కదా ముందడుగు అంటాడు కాళోజీ.

ఉద్యమమే ఆయన ఊపిరి. సమస్త ప్రజా ఉద్యమాలతో ఆయన మమేకమయ్యారు. గణపతి ఉత్సవాలు, ఆర్య సమాజ ఉద్య మం, గ్రంథాలయోద్యమం, ఆంధ్రమహాసభలు, రజాకార్ల వ్యతిరేక ఉద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, విశాలాంధ్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం…… ఇలా ప్రతి దాంట్లో పాలుపంచుకున్నారు. ఒకసారి ఓ పోలీసు అధికారి “ పోచమ్మ దగ్గర నీవే వుంటావు, గణపతి దగ్గర నీవే వుంటావు. ఆర్య సమాజంలో వుంటావు, ఆంధ్ర మహాసభలో పాల్గొంటావు. ఏది నీ కథ?” అని ప్రశ్నిస్తే కాళోజీ యిలా జవాబిచ్చాడు… పౌర సమాజానికి ఎక్కడ అన్యాయం జరిగినా, ప్రజలపై ఎక్కడ దౌర్జన్యం జరిగినా అక్కడ నేనుంటాను. వాటిని ప్రతిఘటిస్తాను. ప్రజల పక్షాన పోరాడుతానన్నాడు.

కాళోజీ పూర్తి పేరు ‘రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాజా కాళోజీ నారాయణరావు’, ఉదార ప్రజాస్వామ్యవాది, ఆశావాది. “ఉదయం కానే కాదనుకోవడం నిరాశ ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ” అని సందేశమిచ్చాడు. వ్యక్తి స్వేచ్ఛపై రాజ్య ఆంక్షలను ససేమిరా సహించేవారు కాదు. కాళోజి వరంగల్‌లో కాలేజియేటో స్కూల్‌లో చదివేటప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలకు నాటి నిజాం ప్రభుత్వం సెలవు నిరాకరించిన సందర్భంలో 1200 మంది విద్యార్థులతో సెలవు చీటీలు రాయించి తరగతులను బహిష్కరించాడు. 1944లో ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రథమ వార్షికోత్సవం వరంగల్‌లో జరుగుతున్న సందర్భంలో కవి సమ్మేళనం కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లను రజాకార్లు తగులబెట్టినప్పుడు మళ్ళీ పందిళ్ళు వేయించి అక్కడే కవి సమ్మేళనం నిర్వహింపజేశాడు.

పౌర హక్కుల కోసం ఉద్యమించిన ప్రతివారిని ప్రోత్సహించాడు. 1946లో బత్తిని మొగిలయ్యను ఒంటరిని చేసి రజాకార్లు కత్తులతో దాడి చేసి చంపినప్పుడు కాళోజీ బహిరంగ నిరసన ప్రకటించిన కుట్ర కేసులో బహిష్కరించబడ్డాడు. దీనిపై విచారణ జరుపమని నిజాం రాజు తన ప్రధాని మీర్జాయిస్మాయిల్‌ను వరంగల్‌కు పంపినప్పుడు తనను బహిష్కరించి జరిపే విచారణ బూటకమని నిర్ధందంగా ప్రకటించిన ధీశాలి. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు హన్మకొండలోని బ్రాహ్మణవాడలో జాతీయ పతాకం ఎగురవేసి నిర్భంధానికి గురయ్యాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు రావి నారాయణ రెడ్డి కాళోజీకి రాసిన ఉత్తరాన్ని రాజరాజ నరేంద్ర భాషా నిలయంలో పోలీసులు స్వాధీనం చేసుకుని కాళోజిపై దేశ ద్రోహం కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

అంటరాని తనమనే సాంఘిక దురాచారం ప్రబలంగా వున్న రోజుల్లో హన్మకొండ సమీపగ్రామంలో తొమ్మిదవ ఆంధ్రమహసభ నిర్వహించినప్పుడు ఖమ్మంలోని హరిజన బాలికల పాఠశాల నుండి విద్యార్థినులను పిలిపించి వారితోనే సభకు వచ్చిన వారికి మంచినీళ్ళు యిప్పించిన సంఘ సంస్కర్త. నిజాం వ్యతిరేక పోరాటంలో పలుమార్లు జైలు శిక్ష అనుభవించాడు. వరంగల్ జిల్లా భైరాన్‌పల్లిలో రజాకార్లు ఒకే రోజు 90మందిని కాల్చి చంపారు. ఈ ఘటన కాళోజిని తీవ్రంగా కలవరపర్చింది. ఈ సందర్భంలో యిలా అంటాడు. “మనకొంపలార్పిన మన స్త్రీల చెరిచిన/ మన పిల్లలను జంపి మనల బంధించిన / మానవాధములను మండలాధీశులను / మరచిపోకుండా గుర్తుంచుకోవాలి/ కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలె/ కాలంబు రాగానే కాటేసి తీరాలి.
ప్రశ్నించడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. నిజాం రాజును, ఆయన భోగలాలసత్యాన్ని కలంతో ప్రతిఘటించాడు. ‘ఓరాజా’ కవితలో “రాణివాసంలోన రంజిల్లు రాజా /రైతు బాధలు తీర్చి రక్షింపలేవా/ పట్టణపు సొగసుకై పాటుపడురాజా/ పల్లెకందము గూర్చు ప్రతిభయే లేదా/ పోషించువాడవని పూజించు జనులు/ పీఠమెక్కినదాది పీడించుటేనా” అని ప్రశ్నించాడు.

తెలంగాణ భాషను, యాసను వెక్కిరించిన వారికి చురకలంటించేవాడు. రెండున్నర జిల్లాల భాషే అసలైన తెలుగు భాష కాదన్నాడు. రాయప్రోలు సుబ్బారావు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షలుగా వున్నప్పుడు తెలంగాణ భాషను కించపరుస్తూ మాట్లడమే గాక నిజాం రాజును పొగుడుతుండేవాడట, అతన్ని ఉద్దేశించి “లేమావి చివురులను లెస్సగా మేసేవు
రుతురాజు వచ్చెనని అతి సంభ్రముతోడ
మావికొమ్మల మీద మైమరచి పాడేవు
తిన్న తిండెవ్వనిదే కోకిలా.. పాడు పాటెవ్వనిదే కోకిలా” అని
ఉగాది కవిసమ్మేళనంలో వినిపించాడు.
తెలుగు ప్రజలందరూ ఒకే రాష్ట్రంగా అవతరించాలని నిండు మనస్సుతో విశాలంధ్రకు మద్ధతిచ్చాడు. తర్వాత కాలంలో ఆంధ్రపెత్తందారీ వ్యవస్థను, ప్రాంతాల మధ్య అసమానతలను తీవ్రంగా ఖండిస్తూ 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. “వానాకాలంలోనూ చేనులెండిపోతాయని, మండే వేసవిలో వలే ఎండలు కాస్తుంటాయని ఎవరనుకున్నారు, ఇట్లౌనని ఎవరనుకున్నారు? ” అని ఆంధ్రపాలకుల వంచనను ఎండగట్టాడు.

నెహ్రూ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో చేరి 1952లో తొలి సాధారణ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానానికి పోటీపడి పిడిఎఫ్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు చేతిలో ఓటమి పాలయ్యాడు. 195860 మధ్య ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి విధాన మండలి సభ్యులగా సేవలందించాడు. ప్రజావ్యతిరేక విధానాల ఖండిస్తూ ‘ నా గొడవ’ పేరుతో 12 సంపుటాలు రచించాడు. ప్రజల గొడవను తన గొడవగా భావించాడు.

1969 నుండి ప్రజాసమితి తరఫున ఊరూరా కన్వెన్షన్లు పెట్టి తెలంగాణ భావజాలాన్ని ప్రచారం చేశాడు. అదే సం॥ హన్మకొండలోని ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీలో పెద్ద ఎత్తున సదస్సులు నిర్వహించాడు. ఫలితంగా ప్రభుత్వం వరంగల్ సెంట్రల్ జైల్లో నిర్భంధించింది. 1997 డిసెంబర్‌లో ప్రజాసంఘాలు నిర్వహించిన బహిరంగసభలో రెండు లక్షల మంది సమక్షంలో ‘వరంగల్ డిక్లరేషన్’ ప్రకటించాడు. జీవితాంతం తెలంగాణ విముక్తికై ఉద్యమాలు నిర్వహించారు. కాళోజీ ఏ పార్టీకో, ఏ సంఘానికో కట్టుబడి ఉండే వ్యక్తి కాదు.

ఒక పార్టీకి కట్టుబడి ఉండడమంటే పాతివ్రత్యంలాంటి ‘పార్టీవ్రత్యం’ అనేవాడు. ప్రజాస్యామ్యం అంటే ఏమిటి? ‘సౌజన్యాలకు రక్ష/సామరస్యాలకు రక్ష/ సహజీవనానికి రక్ష’ అంటాడు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నాడు. ‘ఓటిచ్చునప్పుడే ఉండాలె బుద్ధి/ అనుచుంటే ఈ మాట అనుభవం కొద్ది’ ఆ ఓటర్లకు ప్రభోదించాడు. 197577 ఎమర్జెన్సీ రోజుల్లో ‘పౌరునిగా పలుకలేనప్పుడు బతుకెందుకని’ నిర్భంధాన్ని నిరసించాడు.
కాళోజీ అక్షరాలకు గెరిల్లా శిక్షణ యిచ్చాడు. ఆయన కవిత్వమంటే అన్యాయంపై అక్షరాయుధం అందుకే…

‘అన్యాయాన్ని ఎదురిస్తే నాగొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి
అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు’ అంటాడు.
ఆంధ్ర వలస వాదాన్ని వ్యతిరేకిస్తూనే తెలంగాణ నాయకులను కూడా హెచ్చరించాడు. ‘ప్రాంతేతరులు దోపిడి చేస్తే పొలిమేరదాకా తన్ని తరుముతాం, ప్రాంతంవాడే దోపిడి చేస్తే ప్రాణంతోనే పాతరవేస్తాం’ అన్నాడు. ఆకలి, ఆధిపత్యం, అన్యాయం, అసమానత్వం లేని తెలంగాణ సమాజాన్ని కాళోజీ కోరుకున్నాడు. ఆ దిశగా మనమంతా పయనిద్దాం.

                                                                                                  – డా॥ వంగరి భూమయ్య

Telangana Poet Kaloji Birthday On September 9