Home తాజా వార్తలు రాష్ట్రంలో రోహింగ్యాలపై పోలీస్ నజర్

రాష్ట్రంలో రోహింగ్యాలపై పోలీస్ నజర్

Rohingyasవేలిముద్రలు, ఐరిస్ సేకరిస్తున్న వైనం
కార్డన్ సెర్చ్‌ల్లో రోహింగ్యాల
కదలికలపై ఆరా!

హైదరాబాద్‌ః రాష్ట్రంలో తలదాచుకుంటున్న రోహింగ్యాల కదలికలపై పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా సారిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 4వేల మంది రోహింగ్యాలకు ప్రభుత్వం నుంచి ఏలాంటి సహాయ సహకారాలు, పథకాలు అందకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు కసరత్తు ప్రారంభించారు. ముఖ్యంగా రోహింగ్యాల వేలి ముద్రలు, ఐరిస్ తదితర ఆధారాలు సేకరించి వారిపై నిఘా సారించేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించనున్నారు. బాలపూర్ మత్తు మాత్రలు విక్రయిస్తుండగా ఇద్దరు రోహింగ్యాలు అరెస్టు చేసిన పోలీసులు ఆయా ప్రాంతాలలో ఉన్న రోహింగ్యాలపై దృష్టిసారించారు. పోలీసుల దర్యాప్తులో మేడ్చల్ నియోజక వర్గ పరిధిలో వందలాది మంది రోహింగ్యాలు ఓటుహక్కు కలిగి ఉన్నట్లు విచారణలో వెలుగుచూసింది. ముఖ్యంగా రాచకొండ పరిధిలో ఉన్న రోహింగ్యా ముస్లిం తెగల వారు స్థానికులతో పరిచయాలు పెంచుకుని జీవనం సాగిస్తున్నట్లు తేలింది.

ఇదిలావుండగా మయన్మార్ దేశస్తులకు ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్‌లు పొందిన వారిపై నిఘా సారిస్తున్నారు. గతంలో బాలాపూర్‌లోని క్రీసెంట్ స్కూల్ కరస్పాండెంట్ అబ్దుల్ కాలిక్యు రోహింగ్యా ముస్లింలకు తన స్కూల్ నుంచి అక్రమంగా బోనోఫైడ్ సర్టిఫికెట్ ఇచ్చాడని, రోహింగ్యాలు ఇండియన్ పాస్‌పోర్ట్, ఆధార్‌కార్డు, ఎస్‌బిఐ బ్యాంకు అకౌంట్, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికెట్, పాన్ కార్డులు పొందిన వారిపై ప్రత్యేక నిఘా సారించి వాటిని రద్దు చేసిన విషయం తెలిసిందే. స్థానికులు, బ్రోకర్లు కేవలం దబ్బులకు ఆశపడి రోహింగ్యాలకు ప్రభుత్వ రేషన్‌కార్డులు, బ్యాంక్ అకౌంట్లు ఇప్పిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.

అదే విధంగా ప్రైవేట్ స్కూళ్లలో డబ్బులు తీసుకుని బోనోఫైడ్ సర్టిఫికెట్ ఇచ్చిన క్రీసెంట్ స్కూల్ స్టడీ సర్టిఫికెట్స్,అడ్మిషన్స్ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకుని కరస్పాండెంట్ అబ్డుల్ కాలిక్యును అరెస్టు చేసిన విషయం విదితమే. కాగా బాలాపూర్ పరిధిలో వేలాది మంది రోహింగ్యాలు శరణార్డులుగా ఉంటున్నారని, రోహింగ్యాలకు భారతపౌరసత్వం పొందే అర్హత లేదని, కొందరు రోహింగ్యాలు ధృపత్రాలు పొందేందుకు యత్నిస్తున్నారని, వారికి సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తేల్చిచెబుతున్నారు. మహ్మద్ ఫయాజ్, మహ్మద్ ఫైజల్ రోంహిగ్యా ముస్లింలు పాస్‌పోర్టులు పొందేందుకు పాస్‌పోర్ట్ ఎజెంట్‌గా పనిచేస్తున్న బాలాపూర్ నివాసి నయీంను సంప్రదిండంతో రోహింగ్యాలకు ఇంటి అద్దె అగ్రిమెంట్లు తయారు చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డులు నయీం ఇప్పించడంతో పాటు వారికి భారత పాస్‌పోర్టులు ఇప్పించాడని తేలడంతో మహ్మద్ ఫయాజ్, మహ్మద్ ఫైజల్‌లతో పాటు పాస్‌పోర్ట్ ఎజెంట సయ్యద్ నయీంను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మయన్మార్ లోని రఖైన్ రాష్ట్రానికి చెందిన రోహింగ్యాలకు ఏ దేశంలోనూ పౌరసత్వం లేదు, వీరికి ఇస్లామిక్ స్టేటతో సంబంధాలున్న రోహింగ్యాలు దేశంలోని జమ్మూకాశ్మీర్, హైదరాబాద్, ఢిల్లీ , ముంబై, మేవాట్ తదితర ప్రాంతాలలో దాదాపు 40వేల మంది శరణార్థులుగా ఉన్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక మేరకు రాష్ట్ర పోలీసులు వారి కదిలికలపై దృష్టి సారించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రోహింగ్యాలున్నల్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. మయన్మార్ దేశం నుంచి తరమేస్తున్న రోహింగ్యా ముస్లిం తెగలతో దేశానికి ముప్పు పొంచిఉందని, వారిని ఎప్పుడైన ఇస్లామిక్ స్టేట్ వాడుకునే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు పేర్కొంటున్న విషయం విదితమే.

రోహింగ్యా ముస్లిం తెగకు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు తేల్చిచెబుతున్నాయి. ఇదిలావుండగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని రోహింగ్యాలను గుర్తించేందుకు కసరత్తు ప్రారంభించారు. నగరంలో నిర్వహించే కార్డన్ సర్చ్‌లలో రోహింగ్యాల వివరాలు, ఆధారాలు సేకరించి రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాలని పోలీసు బాసులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రోహింగ్యాలు, వారికి సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు.

Telangana Police Focus on Rohingyas