Home తాజా వార్తలు విడిగా.. వడిగా

విడిగా.. వడిగా

 Telangana Polls Early Before Four States Elections

ఆ 4 రాష్ట్రాల కంటె ముందుగానే తెలంగాణ ఎన్నికలు?

తొలి ప్రాధాన్యత రద్దైన అసెంబ్లీకే
సుప్రీం తీర్పుననుసరించి వ్యవహరించాలని ఇసి నిర్ణయం?
వారం రోజుల్లో స్పష్టత
ఢిల్లీలో కేంద్ర ఇసిలతో సిఇఒ భేటీ
నేడు రానున్న ఎన్నికల కమిషన్ బృందం

మన తెలంగాణ/హైదరాబాద్ : డిసెంబరులో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ వాటికంటే ముందే తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ దిశగానే కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర సిఇఓ కార్యాలయం అధికారులు, సిబ్బంది కసరత్తు చేస్తున్నారు. అక్టోబరు 8వ తేదీకల్లా ఓటర్ల తుదిజాబితాను ప్రకటించాలని షెడ్యూలు రూపొందించాలని కేంద్ర సం ఘం రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీచేయడంతోనే ముసాయిదా జాబితా ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం సోమవారం సాయంత్రం విడుదలచేసింది. వచ్చే నెల 8వ తేదీన మార్పులు చేర్పుల ప్రక్రియను పూర్తిచేసి తుది జాబితాను ప్రకటించిన వెంటనే షెడ్యూలును ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. వీలైనంత వరకు నవంబరు నాల్గవ వారంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మిజోరాం రాష్ట్రాలకు పోలింగ్ ప్రక్రియ డిసెంబరులో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున దానికంటే ముందే తెలంగాణకు నిర్వహించాలని భావిస్తున్నందునే సిఇఓ కార్యాలయం ఏర్పాట్లను చకచకా చేస్తోందని ఢిల్లీ వర్గాల సమాచారం.

తొలి ప్రాధాన్యత తెలంగాణకే :
వాస్తవానికి నాలుగు రాష్ట్రాలతోపాటే తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్ తొలి ప్రాధాన్యతను రద్దయిన అసెంబ్లీకి నిర్వహించడానికే ఇవ్వాల్సిందిగా నొక్కిచెప్పడంతో దాని ప్రకారమే తెలంగాణకు తొలుత నిర్వహించి ఆ తర్వాత నాలుగు రాష్ట్రాలకు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రాధాన్యతా క్రమాన్ని చూసుకున్నప్పుడు రద్దయిన అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని ఇప్పటికే ముగ్గురు కమిషనర్లు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే తేదీలను ఖరారు చేయడమే మిగిలిందని, అక్టోబరు రెండవ వారంలోనే షెడ్యూలును ప్రకటించి నవంబరు నాల్గవ వారంలోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.

వారం రోజుల్లో స్పష్టత :
తెలంగాణలో ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే మంగళవారం ప్రాథమిక నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందం మంగళవారం హైదరాబాద్ వచ్చి రెండు రోజుల పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలను పరిశీలించనున్నందున వీరు సమర్పించే నివేదిక ఆధారంగా వచ్చే మంగళవారం దీనిపై ముగ్గురు కమిషనర్లు విస్తృత చర్చను జరపనున్నట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో పర్యటించి ఒకవైపు ఏర్పాట్ల ప్రక్రియను, మరోవైపు పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారుల సన్నద్ధతను చర్చించనుంది. ఎనిమిది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ సమావేశమై అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రానికి నివేదిక సమర్పించనుంది.
ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్ తేదీలను ఖరారు చేయనుంది. తెలంగాణలో ఒక దశలోనే మొత్తం పోలింగ్

ప్రక్రియను నిర్వహించే అవకాశం ఉంది. వచ్చే మంగళవారం ముగ్గురు ఎన్నికల కమిషనర్లు సమావేశమై ఈ నివేదికను పరిశీలించి, రాష్ట్ర సిఇఓను సంప్రదించి తేదీలపై ఒక స్పష్టతకు రానున్నట్లు తెలిసింది.

వేగంగా ఏర్పాట్లు
నాలుగు రాష్ట్రాలతో సంబంధం లేకుండా తెలంగాణకు ఎన్నికలు నిర్వహించాలని భావించినందున కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా తన కార్యాచరణను వేగవంతం చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయాన్ని అప్రమత్తం చేయడంతోపాటు ఖాళీ పోస్టుల భర్తీ, సిబ్బంది కేటాయింపు, ఇవిఎంల పంపిణీ తదితర వివిధ అవసరాలకు నిర్దిష్ట ప్రణాళికను ఖరారు చేస్తోంది. రద్దయిన అసెంబ్లీకి నిర్వహించడం తొలి ప్రాధాన్యత అని స్వయంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ నాలుగు రాష్ట్రాల కంటే ముందే తెలంగాణకు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పకనే చెప్పినట్లయింది.

ఆ నాలుగు రాష్ట్రాలతో సంబంధం లేకుండా తెలంగాణ ఎన్నికల ప్రక్రియను త్వరగా ముగించాలని భావిస్తోంది. అందువల్లనే వారం రోజుల వ్యవధిలోనే ఇవిఎంలు, వివిపిఏటి పరికరాలను హర్యానా, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి తెలంగాణకు తరలిస్తున్నారు. ఢిల్లీలో సోమవారం కేంద్ర ఎన్నికల కమిషనర్లు రాష్ట్ర సిఇఓతో సుమారు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇవిఎంలు, వివిపిఏటి యంత్రాలు అందిన వెంటనే ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ప్రిసైడింగ్ అధికారులు తదితరుతో సమావేశమై ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇప్పించే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని సూచించినట్లు తెలిసింది. ఓటర్ల తుది జాబితా వచ్చే 8వ తేదీకల్లా ఖరారు చేస్తున్నందున అప్పటికల్లా శిక్షణా కార్యక్రమాలను పూర్తిచేయాలని సూచించినట్లు తెలిసింది.