Friday, April 19, 2024

‘మేఘ సందేశం’ కవితానువాదం

- Advertisement -
- Advertisement -

సందేశ కావ్యం అనగానే వెంటనే మదిలో మెదిలే మహనీయ కావ్యం కాళిదాస మహాకవి మేఘసందేశం. మేఘదూతం,దూత కావ్యం అని కూడా ఈ కావ్యం ప్రసిద్ధిని పొందింది. కావ్య ప్రక్రియలలో సందేశ కావ్యం ఒక లిరిక్కు’ లాంటిది. బుగ్వేదంలో బీజం కానవచ్చినా, రామాయణంలో మూలం గోచరించినా సందేశ కావ్య సమగ్ర అవతారానికి అభినవ బ్రహ్మ మహాకవి కాళిదాసు. ఒక ప్రక్రియకు కావలసిన లక్షణాలన్నీ సలక్షణంగా మేఘసందేశంలో మూర్తీభ వించాయి. అందువలన సందేశకావ్యాలకు ప్రథమ రూపమే కాకుండా, ఆదర్శ రూపం కూడా మేఘనందేశమే! మేఘసందేశాన్ని ఆదర్శంగా తీసుకుని కొన్ని వందల కావ్యాలు సంస్కృతం, తెలుగు, ఇతర భాషల్లో వెలువడ్డాయి.
కాళిదాసు కవిత్వం సార్వభౌమికమే కాదు సార్వజనీకం కూడా. మేఘ సందేశం భారత దేశ భౌగోళిక చిత్రపటాన్ని చిత్రించిన కావ్యం. ప్రాచీన ప్రజా జీవితాన్ని చిత్రించింది. వస్తు వర్ణనలు లేని కావ్యం. చైతన్య ప్రకృతినుద్దీపించింది. మేఘ దూత కవిత్వ రీతిని వైదర్భీరీతి అంటారు.
మేఘ సందేశం మొట్ట మొదటి ‘ఖండ కావ్యం‘. ఒక కథతో సంబంధం లేకుండా ఏదో ఒక భాగాన్ని లేదా ఘట్టాన్ని తీసుకుని వివరించడమే ఖండ కావ్య లక్షణం. మేఘసందేశ కావ్య కథ క్లుప్తంగా ఇది. పూర్వసర్గ, ఉత్తరసర్గ అని రెండు సర్గలుగా సాగిన ఈ కావ్యంలో, కుబేరుడు యక్షగణానికి రాజు. ఆయన వద్ద ఉన్న ఓ యక్షుడు ఉద్యోగధర్మ నిర్వహణలో చిన్న తప్పిదం చేశాడు. కుబేరుడు కోపించి ఒక సంవత్సర కాలం ఇల్లు విడిచి వెళ్ళాలని శాపం ఇచ్చాడు. ఆ యక్షుడు రామగిరి అనే ప్రాంతంలో నివాసం ఉన్నాడు. ఎనిమిది నెలలు అతిభారంగా గడిచిపోయాయి. ఆషాఢమాసం వచ్చింది. ఒకనాడు యక్షుడు తన భార్యను తలుచుకొని దు:ఖిస్తూ మేఘని చూసి, ఆ మేఘుడిని తగిన విధంగా సంభావించి తన భార్యకు సందేశాన్ని వినిపించ వలసినదిగా కోరాడు.
మేఘ సందేశానికి మహామహులైన పండితులు అనేకులు తెలుగు అనువాదాలను కావించారు. వారి వరుసకు వచ్చారు రఘువర్మ. తమ అనువాదాన్ని శ్లోకాలకు వివరణాత్మక స్వేచ్ఛా నువాదమని పేర్కొన్నారు. ఇది వచన కవితానువాదం. సామాన్య ప్రజా బాహుళ్యానికి సులభ గ్రాహ్యంగా పూర్వ కావ్య సౌరభాన్ని అందించే ప్రయత్నంలో కవి కృత కృత్యులయ్యారు.
మేఘ సందేశ కావ్యానువాదానికి రఘువర్మ పూనుకొనడం లో ఉద్దేశ్యం మధురము, స్వచ్ఛము, ఆత్మాశ్రయము అయిన కవిత్వాన్ని తెలుగు వారికి తేట తెల్లం గా వివరించడమే. ఇది అసిధారా వ్రతం. కాళిదాసు శబ్ద శిల్పి. అతని భావాలు లలితమైనవి. దానికి తోడు ఛందో గతమైన క్లిష్టత ఉంది. మందాక్రాంతమంత ధీర మందగమనం మరో వృత్తానికి లేదు. భావకవులకు ఇది పారాయణ గ్రంథం.
వచన కావ్యానువాద రీతిలో మేఘ సందేశం ను అనువదించిన రఘువర్మ చక్కని శైలిలో ఎక్కడా మూల భావాలకు భంగం రానీక స్వేచ్ఛను అవలంబిస్తూనే విధేయలై మూలాన్ని అనుసరించారు. వచన శైలి అనువాదం వీరిదే ప్రథమం. అందుకు వారిని అభినందించాలి.
వారి అనువాదవిధానానికి ఒక రెండు ఉదాహరణలు
మూలము : కశ్చత్కాంతా విరహ గురుణా స్వాధికారాత్ప్రమత్త:
శాపేనాస్తంగమిత మహిమా వర్షభోగ్యేణ భర్తుః/ యక్షశ్చక్రే జనకతనయా స్నాన పుణ్యోదకేషు/ స్ని గ్ధచ్భాయాతరుషు వసతిం రామ గిర్యాశ్రమేషు.
అనువాదం: అల యక్షు డొకడు పరాకున/ భృత్య విధిని మరిచిన ఫలితంగా/ యక్ష రాజు చేత ఏడాది పాటు/ భార్యా విరహ భార శిక్షాను భవ్య శప్తుడై/ సీతా స్నాత పునీత జలాలనూ,/ చిక్కటి నీడల చెట్లనూ కలిగిఉన్న/ రామ గిరి ఆశ్రమ ప్రాంతాన తన ప్రవాసాన్ని ఏర్పరచుకున్నాడు.
మూలంలో ‘శాపేనాస్తంగమిత మహిమా ‘ధ్వని గర్భితమైన వాక్యం. అస్తమించుట తిరిగి ఉదయించుటకే నని కాళిదాసు భావన. ఈ వాక్యాన్ని తెలుగులో ‘శిక్షానుభవ్య శప్తుడై ‘ అని అని తేట తెల్లము గావించారు. ‘స్నిగ్ధచ్ఛాయాతరుషు‘ అనగా ఎక్కువగా నీడనిచ్చే చెట్లు -చిక్కటి నీడల చెట్లు అర్థమును చక్కగా సాధించారు. ‘ప్రమత్త‘ అను పదానికి పరాకు అని దేశీయతను సాధించారు. ప్రథమ శ్లోకం లోనే కాళి దాస కవి రామగిర్యాశ్రమేషు అని రామాయణమును తలపించి సీతావియోగ దుర్భరతను సూచించాడు. అనువాదం లో మూల పదానుసరణ చక్కగా సాగింది. మూలం లోని ప్రతి శ్లోకాన్నీ చక్కని ఆఖ్యాన శైలిలో కవితాత్మకంగా వివరించారు అనువాదకులు.
‘ఆమ్రకూట పర్వతాన్నీ, అక్కడ ప్రవహించే రేవా నదినీ వర్ణిస్తూ ఏనుగు ఆకారంలో ఉన్న పర్వతానికి, పాయలు పాయలుగా ప్రవహిస్తున్న నది ఆ ఏనుగు పెట్టుకున్న పలు చిత్ర రీతుల అలంకరణ వలే చూస్తావు’ మరియు ‘మార్గ మధ్యలో కనిపించిన ‘నిర్వింధ్య’ నదిని ఒక స్త్రీగా, మేఘాన్ని తన ప్రియునిగా భావిస్తూ, నదిలో వచ్చే సుడులను నీకై సుందర వయ్యారంగా జారుతూ, పారుతూ, నీటి సుడిని తన నాభి గా చూపించే ఆ స్త్రీ యొక్క నాభిగా అభివర్ణించడం’ ఇంకా ‘చర్మణ్వతీ నదిని ఆకాశం నుండీ చూస్తే భూదేవి మెడలో ధరించిన ఒంటి పేట ముత్యాల హారంలా కనిపిస్తోంది, ఆ నీటి కోసం నువ్వు (మేఘుడు) వంగితే ఆ ముత్యాల హారం మధ్యలో ఉన్న ఇంద్ర నీలమణిలా ఉంటావు’ లాంటి ఉపమలను భావ పరిస్ఫూర్తితో అనువదించారు. రఘువర్మ అనువాద శైలి సరళ సుందరంగా సాగింది. మహాకవి హృదయానికి అతిదగ్గరగా ఆత్మీయతను ప్రకటించారు. కవితల ఎత్తుగడ ముగింపులకు సరసమైన వచనాన్ని అనుసంధించారు.
‘మేఘుడా!మా వియోగపు తొలినాడుపూలదండను/ తీసేసి ఆమెసిగముడి వేసిందో/ నాశాపాంతాన దుఖ:విమోచనుడనైనా ముడిని/ వచ్చి విప్పవలసిన వాడను నేనే !/(31 ఉ మే )ఇత్యాదిగా మూలభావాలలోని రస లాలిత్యాన్ని శ్లో కాల వైదగ్ధ్యాన్ని సర్వ జన సుబోధకం కావించారు.
రఘువర్మ సం స్కృత భాషా నిష్ణాతులు. పూర్వ కావ్యాన్ని అతి సరళంగా తెలుగు వారికి అందించారు. అనువాదం చదువుతుంటే మూల శ్లోక భావాల వివరణను చదువుతున్నట్లు కొత్త అనుభవం కలిగించారు.
రఘువర్మ అనువాదం , మూల కావ్యానికి వివరణ అని వారు పేర్కొన్న మాట నిజం. ఎక్కడా తొట్రుపాటు లేక మేఘునితో పలికిన యక్షుని తో కవి ముఖాముఖీ సందర్శనం కావించి మనకు విషయ వివరణను కావించినట్లుగా ఆసక్తి ని కలిగిస్తుంది. అపురూపమైన మేఘ సందేశ కావ్యాన్ని అత్యుత్తమంగా అతి సరళం గా అనువదించిన రఘువర్మ అభినందనీయులు.

–డా. రాజేశ్వరీ దివాకర్ల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News